![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/kavita_5.jpg)
మరణానికి చిరునామా లేదని
తోడెళ్లావా...? తోడయ్యావా..?
ఆనవాళ్లు మిగల్చొద్దని
చితాభస్మమై.. ఎగిరిపోయావా
అనుభూతులు ఆత్మాహుతి చేసుకున్నాయి
అనుభవాలు గుండె గదిలో గుప్తమయ్యాయి
స్కీంల స్కాంలు ఫొటో మెడలో దండలయ్యాయి
ఊరు అప్పుల కుప్పై ఊరేగుతోంది
రావల్సినదంతా రహస్యమై దాక్కుంది.
సానుభూతి సాంగత్యమైంది
వయోభేదాల్ని మరిచి
మాయల మరాఠీ మాటల గూడైంది
మట్టి గూట్లో ఒదగాల్సిన సహజత్వం
పోస్టుమార్టం జరగొద్దని మానవత్వం
ఖబరస్థాన్‌లో ఖరీదు కట్టై కాలిపోయింది
కాలి బూడిదైన కట్టెకు
పంచామృతాభిషేకం
కర్మకాండలత్యద్భుతం.
రాముడి తోడులేక నాడు సీతమ్మదెంత వేదన
వసంత మెళ్లిపోతూ తిలకాన్ని తీసుకెళ్లినా
బోసిపోయిన మోముకు స్టిక్కర్ల పరిహాసం
ఏడుపునెంత అరువు తెచ్చుకున్నా...
ఆవేదనెంత రక్తి కట్టించినా...
వేల రూకల్ని ఒంటికి పులుముకునే
బ్యూటీపార్లర్ వనె్న తగ్గి చిన్నబోయింది.
పుస్తె, మట్టెలు లేకున్నా...
నగా, నట్రాలు ఒంటి మెరుపుల్ని విడవగలవా?
మేను సొగసులు విరబోసుకోవా?
గిర్రున తిరిగే కాలానికెంత మతిమరుపో...
షోకేసులోని కుర్తా, పైజామాకు
షోకొస్తుంది
కువకువలాడే మువ్వల సవ్వడి
మనస్సు మర్మంతో
గతాన్ని మరిపిస్తుంది
భవితవ్యం మురిపిస్తుంది
జీవన రంగస్థల లోగిలిలో
నమిలిన నోరాగుతుందా...
నాట్యమాడిన కాలాగుతుందా...
కాలమే నిర్ణయిస్తుంది
నిజం నిఖార్సుగ నిలబడ్తుంది.
లైఫే ఓ సైకిల్!
-రాపోలు పరమేశ్వరరావు
జీవన్మరణాల మధ్య దూరం
ఒక సెకను కాలమే!
ఎర్జీ దెబ్బతిన్న టైర్లో
పంచర్లీకైన ట్యూబులా
జీవన యానం!
రోడ్డుపై ఉన్న ముల్లు
టైరకు సెంటీమీటర్లో
పొంచివున్నట్లు భవిష్యత్!
ఆప్యాయత
అనురాగాల మధ్య
అగాధమైన
ఆర్థిక సంక్షోభం!
మనిషి గాడి తప్పితే
మార్గమున్నదిగానీ
మనసు తప్పితే
జపాన్ సునామీతో
ఏమి పోలిక!
షెడ్లో
పాత సామానై పోయిన
సైకిల్ తీరు జీవితం!
రెక్కలు
-అవనిగడ్డ సూర్యప్రకాష్
కర్రులేని నాగలితో
భూమిని దున్నలేము
లౌక్యమెరుగని వ్యక్తితో
కలిసి మనలేము...
అనుభవం
చేదు కారాదు...
* * *
అసంపూర్ణ చిత్రం
అందగించదు
పూలు పూయని వనం
శోభనివ్వదు...
పూజలందని దేవళం
వాసికెక్కదు...
* * *
మబ్బు చాటు సూర్యదీపం
దేదీప్యంగా వెలగదు
తెరచాటు నాటకం
రక్తి కట్టదు..
విఫలాల మాటున బతుకు
విముక్తం పొందదు...
* * *
అంతమాత్రానికే
తిరకాసేల..?
ప్రతి సదవకాశానికి
తిరుమంగళం పాడనేల...?
తప్పుడు తక్కెట కాదు
జీవితం...
* * *
మాటిమాటికి తిట్టి
తిప్పలు పెట్టినోడు
ఒకరోజు
పూమాలతో ప్రణమిల్లకపోడు..
కాలం
బలీయం...
* * *
ఆకలి, దాహం
తీరు మారనివి
ఆకాశం, అగాధం
అంతు దొరకనివి...
వాయువు, విద్యుత్తు
ఆకృతి ఉండనివి...
*