![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/sisindri_4.jpg)
నీరు రకరకాలుగా ఇగురుతుంది!
ఒక బల్లమీద మూడు రకాల పాత్రలు ఒకదాని పక్కన మరొకటి ఉంచాలి. ఈ మూడుపాత్రల్లో ఒకటి సాసరు, రెండవది గాజు గ్లాసు, మూడవది వెడల్పు మూతిగల సన్నని పొడవైన సీసాగా తీసుకోవాలి.
ఈ పాత్రలలో అయిదు పెద్ద చెమ్చాల నీరు విడివిడిగా పోయాయి.ఈ పాత్రలకు మూతలు లేకుండా కొంత సమయం ఆ విధంగా బల్లమీద వదిలివేయాలి. పాత్రలలోని నీరు ఏ రేటున ఇగురుతున్నది పరిశీలించాలి.
సాసర్‌లోని నీరు వేగంగా ఇగరడం గమనిస్తారు. ఆ తరువాత స్థానంలో గ్లాసులోని నీరు ఇగరడం గుర్తిస్తారు. ఆలస్యంగా సీసాలోని నీరు ఇగరడం జరుగుతుంది.
పాత్రనుబట్టి అందలి నీరు ఇగిరే రేటు ఆధారపడి ఉంటుందని ఈ ప్రయోగం వల్ల తెలుసుకుంటారు. నీరు ఎక్కువ వైశాల్యం మేర గాలికి అందుబాటులో ఉంటే ఆ నీరు ఎక్కువ వేగంగా ఇగురుతుంది. నీరు ఇగిరే ప్రక్రియ ఉష్ణోగ్రత, వాతావరణంలోని సార్ధ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది.
గాలి పొడిగా వుంటే నీరు వేగంగా ఇగిరిపోతుంది. వాతావరణ ఉష్ణోగ్రత హెచ్చుగా ఉన్నా నీరు వేగంగా ఇగిరిపోతుంది. వాతావరణ గాలి తేమగా చల్లగా ఉంటే ఇగిరే ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఈ స్థితిలో గాలిలో నీటి ఆవిరి సంతృప్త స్థితిలో ఉంటుంది.
తెలుసుకోండి
ప్రపంచంలో అతి దీర్ఘకాలం జీవించే చెట్లలో రావి చెట్టు ఒకటి. ఇది వందల సంవత్సరాలు జీవిస్తుంది. రావిచెట్టు దాదాపు పదిహేను మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. రావి చెట్టును హిందువులు, బౌద్ధులు ఉభయులకు పూజనీయమైనదే.
రావి చెట్టును హిందువులు దేవాలయాల వద్ద నాటుతారు. బుద్ధ్భగవానునికి రావిచెట్టు క్రిందనే జ్ఞానోదయం కలిగిందని బౌద్ధుల ప్రగాఢ విశ్వాసం.
కొన్ని ఆస్వాభావిక సంఘటనలతో సంబంధం కలవిగాను, దయ్యాలు నివసించే ప్రదేశమని రావిచెట్లను గురించి గ్రామాలలో కథలుగా చెప్పుకుంటారు.
రావిచెట్లు భారతదేశమంతటా విస్తరించి ఉన్నాయి. మఱ్ఱిచెట్టువలె ఇది కూడా అశ్వత్థ కుటుంబానికి చెందినది.
-ఎ.లక్ష్మీ సువర్చల
నో
సూఫర్తి
స్కూలునుంచి ఇంటికి తిరిగి వస్తుంటే లిల్లీని బుల్లి అడిగింది.
‘‘మీ అమ్మానాన్నలు మన క్లాస్‌మేట్ కళ ఆల్ నైట్ బర్త్‌డే పార్టీకి వెళ్లడానికి ఒప్పుకున్నారా?’’
‘లేదు. ఒప్పుకోలేదు’’ లిల్లీ దిగులుగా చెప్పింది.
‘‘గుడ్. మా అమ్మా నాన్న నాక్కూడా నో చెప్పారు’’
‘‘గుడ్ అంటావేమిటి? అసలు ఎందుకు అనుమతి ఇవ్వనన్నారో చెప్పారా?’’
‘‘లేదు. నేను అడగలేదు’’
‘‘నేను అడిగాను. నీ వయసు పనె్నండు కాబట్టి అన్నారు. నా వయసుకీ, ఆ పార్టీకి హాజరవడానికి సంబంధం ఏమిటంటే చెప్పలేదు’’ లిల్లీ చెప్పింది.
‘‘వాళ్లు మన మంచికే వద్దని చెప్పి ఉంటారు’’
‘‘అదేం కాదు. నేను ఇంటికి వెళ్లాక మళ్లీ నన్ను పంపమని పేచీ పెడతాను’’
‘సర్లే. మా ఇంటికి వచ్చి నా మేథ్స్ బుక్ తీసుకెళ్లాక నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి’’ బుల్లి చెప్పింది.
ఇద్దరూ బుల్లి ఇంటికి చేరుకుంటుండగా బుల్లి దూరంనుంచే చూసి అరిచింది.
‘‘అరె! మా ఇంటి గేట్‌ని ఎవరో తెరిచాక మళ్లీ మూయలేదు’’
చుట్టూ చూస్తే ఓ చోట కూర్చున్న బుల్లి వాళ్ల పెంపుడు కుక్క లైలా కనిపించింది. బుల్లి లైలాని తనతో రమ్మని పిలిస్తే అది తోకాడించుకుంటూ ఆనందంగా వచ్చింది.
‘‘మీరు ఎప్పుడూ దీన్ని ఇంటి వెనక వుంచి గేట్ మూసేస్తుంటారు. దానికీ కాస్తంత స్వేచ్ఛ కావాలి కదా?’’ లిల్లీ చెప్పింది.
‘‘దాన్ని ఇంట్లో ఉంచితేనే దానికి భద్రత. గేటు తెరిచి ఉంటే, అది బయటకి వెళ్లి ఏ బండి కిందో పడితే ప్రమాదం అని దానికి తెలీదు కదా. దాని స్వేచ్ఛకి నో చెప్పడం దాని మంచికే’’ బుల్లి చెప్పింది.
కొద్ది క్షణాలాగి లిల్లీ నవ్వుతూ అడిగింది
‘‘మా అమ్మానాన్నలు నాకు నో చెప్పడం నా మంచికేనా?’’
‘‘పాయింట్ అర్థం అయిందిగా. ఆలోచిస్తే నీకే ఆ విషయం బోధపడుతుంది. దాన్ని ఎందుకు ఎప్పుడూ ఇంట్లోనే బంధించి ఉంచుతామో, బయటికి వెళ్లినప్పుడల్లా ఎందుకు చెయిన్ కట్టి తీసుకువెళ్తామో మా లైలాకి తెలీదు. అలాగే మనకీ మన తల్లిదండ్రులు ఆల్‌నైట్ బర్త్‌డే పార్టీకి ‘నో’ ఎందుకు చెప్పారో తెలీకపోయినా అది మన మంచికే అని ఈ ఉదాహరణని బట్టి అర్థం కావడంలేదా?’’ బుల్లి ప్రశ్నించింది.
‘‘నువ్వు చెప్పింది నిజమే బుల్లీ’’ లిల్లీ ఒప్పుకుంది.
-మల్లాది