ఇస్లామాబాద్, జూన్ 1: దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నవాజ్ షరీఫ్ మళ్లీ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 66 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన అధికార మార్పిడిలో భాగంగా జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)కి ఎన్నికయిన మిగతా పార్లమెంటు సభ్యులతో పాటుగా షరీఫ్ శనివారం పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య జాతీయ అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం మధ్యాహ్నం కొత్త పార్లమెంటు సభ్యుల చేత ప్రస్తుత జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఫెహ్మిదా మీర్జా ప్రమాణ స్వీకారం చేయించారు. గత నెల ప్రారంభంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్-ఎన్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం, షరీఫ్ మూడోసారి పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండడం తెలిసిందే.
కొత్త పార్లమెంటు తొలి సమావేశంలో పాల్గొనడం కోసం నవాజ్ షరీఫ్ తన సన్నిహిత అనుచరులతో కలిసి లాహోర్ నుంచి రావల్పిండికి విమానంలో వచ్చారు. అక్కడి నుంచి ఆయన రోడ్డుమార్గంలో ఇస్లామాబాద్ చేరుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పార్లమెంటు భవనం రక్షణ కోసం వందలాది మంది సైనికులను మోహరించడంతో పాటుగా మిలిటరీ హెలికాప్టర్లు నగరంలో ఏరియల్ గస్తీ నిర్వహించాయి. తెల్లటి సల్వార్ కమీజ్, ఎర్రమట్టి రంగు కోటు ధరించిన 63 ఏళ్ల షరీఫ్ తన పార్టీ సీనియర్ నాయకుడు చౌధరి నిసార్ అలీఖాన్‌తో కలిసి ముందువరసలో కూర్చున్నారు. సభ ప్రారంభానికి గుర్తుగా ఖురాన్‌లోని కొన్ని పంక్తులను పఠించిన తర్వాత స్పీకర్ కొత్తగా ఎన్నికయిన సభ్యుల చేత ప్రమాణం చేయించారు. కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఈ నెల 3న ఎన్నుకుంటారని ప్రకటించిన స్పీకర్ ఆ తర్వాత జాతీయ అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిందిగా సభ్యులను ఆహ్వానించారు. కొత్త ప్రధాని ఎన్నిక ఈ నెల 5న జరగనుంది. 342 మంది సభ్యులుండే జాతీయ అసెంబ్లీలో పిఎంఎల్-ఎన్‌కు 189 మంది సభ్యుల బలం ఉన్నందున సభా నాయకుడిగా నవాజ్ షరీఫ్ ఎన్నికవుతారనేది ఎప్పుడో తెలిసిపోయింది. అంతకుముందు రావల్పిండి విమానాయ్రంలో మీడియాతో కొద్దిసేపు మాట్లాడిన షరీఫ్ గత నెల 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో శాంతియుతంగా అధికార మార్పిడి జరుగుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేసారు. ప్రజలకు సేవ చేసేందుకు మరోసారి అవకాశమిచ్చినందుకు ఆయన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజాస్వామ్యబద్ధ అధికార మార్పిడులుంటాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇస్లామాబాద్ చేరుకోగానే షరీఫ్ కొత్తగా ఎన్నికయిన పిఎంఎల్-ఎన్ సభ్యులతో సమావేశమయ్యారు. 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అప్పటి ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు ద్వారా గద్దె దించడం తెలిసిందే. కాగా, శనివారం నాటి పార్లమెంటు సమావేశానికి విచ్చేసిన ప్రతినిధులు, వారి అభిమానులు, ప్రముఖుల వాహనాలతో జాతీయ అసెంబ్లీ లోపల, వెలుపల ఉన్న ఖాళీ ప్రదేశమంతా నిండిపోయింది. పలువురు జర్నలిస్టులు, ప్రభుత్వ, సైనిక ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (చిత్రం) ఇస్లామాబాద్‌లో శనివారం పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నవాజ్ షరీఫ్ తదితరులు
* సభ్యులతో ప్రమాణం చేయించిన జాతీయ అసెంబ్లీ స్పీకర్ * 3న కొత్త స్పీకర్, 5న ప్రధాని ఎన్నిక
english title:
pak
Date:
Sunday, June 2, 2013