రాయపూర్, జూన్ 2: గత నెల 25న తమ పార్టీ కాన్వాయ్‌పై నక్సలైట్లు మెరుపుదాడి చేసి పలువురిని పొట్టన పెట్టుకున్నప్పటికీ ఈ దాడి జరిగిన జీరమ్ ఘాటి సమీపంలోని కేస్లుర్ గ్రామం నుంచి పరివర్తన్ యాత్రను త్వరలోనే తిరిగి ప్రారంభించాలని చత్తీస్‌గఢ్‌లోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాగా, నక్సల్స్ దాడిలో మృతిచెందిన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్, అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నాయకుడు మహేంద్ర కర్మ, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ తదితరులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నెల 6న జిల్లా ప్రధాన కేంద్రాల్లో నివాళులర్పిస్తారు. ఆ మర్నాడు అంటే జూన్ 7న బ్లాక్ ప్రధాన కేంద్రాల్లో నివాళులర్పిస్తారు. అయితే బస్తర్ డివిజన్‌లోని బస్తర్, దంతేవాడ, బీజపూర్, నారాయణ్‌పూర్, సుక్మా, కంకేర్ జిల్లాల్లో నక్సల్స్ ప్రభావిత మారుమూల గిరిజన బ్లాక్‌లలో మాత్రం ఈ నివాళి కార్యక్రమాలు ఉండవు. ‘పరివర్తన్ యాత్ర ఎక్కడయితే ఆగిపోయిందో అక్కడినుంచి మేము త్వరలోనే తిరిగి ప్రారంభించి రాష్ట్ర రాజధాని రాయపూర్‌లో ముగిస్తాం’ అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి బికె హరిప్రసాద్ ఆదివారం విలేఖరులకు చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పరివర్తన్ ర్యాలీ గత నెల 25న జగదల్‌పూర్ జిల్లా కేస్లూర్ పట్టణానికి వెళ్తుండగా జీరమ్ వ్యాలీ వద్ద నక్సల్స్ దాడికి గురయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 28 మంది చనిపోగా, మాజీ కేంద్ర మంత్రి విసి శుక్లా సహా మరో 36 మంది గాయపడ్డారు. ఈ ర్యాలీ తిరిగి కేస్లూర్‌నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు, బ్లాక్‌స్థాయి సభ్యులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం అనంతరం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కూడా అయిన హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. నక్సల్స్ కుట్రలో కొంతమంది కాంగ్రెస్ నాయకులకు పాత్ర ఉందన్న బిజెపి ఆరోపణ గురించి అడగ్గా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతోందని, అన్ని వాస్తవాలు వెల్లడవుతాయని హరిప్రసాద్ చెప్పారు. పరివర్తన్ ర్యాలీని తిరిగి ప్రారంభించడానికి ముందే కొత్త పిసిసి అధ్యక్షుడ్ని నియమించడంపై పార్టీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఏఐసిసి కోశాధికారి మోతీలాల్ వోరా చెప్పారు.
చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం
రాయపూర్‌లో నల్ల దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహిస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు.