న్యూఢిల్లీ, జూన్ 2: ఆహార భద్రత బిల్లును ఆమోదింపజేయడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అందుకు తాము వ్యతిరేకం కాదని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ ఆదివారం స్పష్టం చేసింది. ‘ఆహార భద్రత బిల్లుకోసం ఆర్డినెన్స్‌ను జారీ చేయడం లేదా పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పిలవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆలాంటి ముఖ్యమైన బిల్లు విషయంలో ఆర్డినెన్స్ జారీ సరికాదు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి మేము వ్యతిరేకం కాదు’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. అయితే అంతకన్నా మెరుగైన మార్గం ఏమిటంటే జూలైలో జరగాల్సిన పార్లమెంటు వర్షాకాల సమావేశాన్ని ముందుగా నిర్వహించడమని ఆమె అభిప్రాయ పడ్డారు. ఆహార భద్రత బిల్లు అంశంపై చర్చించడానికి యుపిఏ సమన్వయ కమిటీ సోమవారం సమావేశమవుతున్న నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి బిజెపి మద్దతు లభించడం గమనార్హం. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం అనుకుంటోంది. ఈ బిల్లును ఆమోదించడానికి ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి అంగీకరించడం ఎంతయినా ముఖ్యం. ఎందుకంటే ప్రతిపక్షాల గొడవ కారణంగా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఆహార భద్రత బిల్లుకు ఉన్న అడ్డంకులను ఏదో విధంగా తొలగించాలని గట్టిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని పిలిచే విషయమై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ప్రధాన రాజకీయ పార్టీలతో చర్చలు ప్రారంభించాలని శనివారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించింది. ఒకవేళ ఆ ప్రయత్నాలు విఫలమైన పక్షంలో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని కూడా కోర్ కమిటీ నిర్ణయించింది.
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అజెండాలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లును దేశ జనాభాలో మూడింట రెండు వంతు మందికి అతి తక్కువ ధరకే ఆహార ధాన్యాలను అందించే లక్ష్యంతో రూపొందించిన విషయం తెలిసిందే.
హెడ్లీని అప్పగించండి
అమెరికాకు భారత్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూన్ 2: ముంబయి తీవ్రవాద దాడుల వెనుక జరిగిన కుట్రకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు వీలుగా లష్కరే తోయిబా తీవ్రవాది డేవిడ్ హెడ్లీని ఏడాది కాలం పాటు ‘తాత్కాలికం’గా భారత్‌కు అప్పగించాలని, అలాగే అతని అనుచరుడు తహవుర్ హుస్సేన్‌ను కూడా తమకు అప్పగించాలని అమెరికాకు భారత్ విజ్ఞప్తి చేసింది. పాకిస్తానీ అమెరికన్ తీవ్రవాది హెడ్లీని అప్పగించలేమని అమెరికా పేర్కొనడంతో అతనిని ప్రశ్నించేందుకు భారత్ తాజాగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే హెడ్లీని ఏడాది కాలం పాటు ‘తాత్కాలికం’గా తమకు అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఇండో-అమెరికా అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై గత నెల 20 నుంచి 22వ తేదీ వరకూ వాషింగ్టన్‌లో జరిగిన చర్చల్లో భారత్ ఈ విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని కూలంకషంగా పరిశీలిస్తామని అమెరికా అధికారులు హామీ ఇచ్చినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న భారత ఉన్నతాధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. 26/11 దాడులకు ముందు ముంబయిలో రెక్కీ నిర్వహించడంలో హెడ్లీకి సహకరించిన పాకిస్తానీ-కెనడియన్ తీవ్రవాది తహవుర్ హుస్సేన్ రాణాను భారత్‌కు అప్పగించే విషయాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని అమెరికా హామీ ఇచ్చినట్టు ఆ అధికారి తెలిపారు. ముంబయి తీవ్రవాద దాడుల విషయమై భారత దర్యాప్తు అధికారులు ఇంతకుముందు హెడ్లీని ఒకసారి ప్రశ్నించిన విషయం విదితమే. అయితే ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే వత్తిడి తీసుకురావడంతో హెడ్లీని మరోసారి ప్రశ్నించేందుకు వీలు కల్పిస్తామని అమెరికా అధికారులు హామీ ఇచ్చినట్టు ఆ అధికారి తెలిపారు. అయితే తహవుర్ రాణాను ప్రశ్నించేందుకు మాత్రం అమెరికా అధికారులు ఇప్పటివరకూ అవకాశం కల్పించలేదు. హెడ్లీకి అత్యంత సన్నిహిత అనుచరుడైన రాణాను ప్రశ్నించగలిగితే ముంబయి దాడుల వెనుక కుట్రకు సంబంధించి మరింత సమాచారం లభిస్తుందని భారత దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.