Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వానికీ పాత్ర!

$
0
0

న్యూఢిల్లీ, జూన్ 2: సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి గత రెండు దశాబ్దాలుగా అనుసరిస్తున్న కొలీజియం స్థానంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా పట్టు ఉండే జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (జెఎసి) ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ జెఎసి ఏర్పాటు ప్రతిపాదనను అతి త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందు ఉంచబోతున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. ఒకసారి ఈ ప్రతిపాదన ఆమోదం పొంది కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వానికి కూడా తన వాదన, అభిప్రాయం వినిపించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థ ప్రభుత్వం ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేదని, అందువల్ల న్యాయమూర్తుల నియామకానికి తీసుకునే నిర్ణయాల్లో ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ ఆశించిన స్థాయిలో కూడా ఈ కొలీజియం విధానం పనిచేయలేదని తాను భావిస్తున్నట్లు ఆయన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గత నెలలో కొత్తగా న్యాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన సిబల్ కొలీజియం వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని సమర్థించుకున్నారు. మంచి వ్యక్తులు న్యాయమూర్తులుగా ఉండాలనేదే ఇటు ప్రభుత్వ, అటు న్యాయ వ్యవస్థ ధ్యేయమని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకం పూర్తి స్థాయి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, విస్తృత స్థాయి సంప్రదింపులతో జరగాలని ఆయన స్పష్టం చేశారు.
‘ఉన్నత న్యాయస్థానాల (సుప్రీంకోర్టు, 24 హైకోర్టులు) న్యాయమూర్తుల నియామకంలో కేవలం న్యాయమూర్తులకే పూర్తి అధికారాలు కాకుండా ప్రభుత్వానికి కూడా సమాన అవకాశాలు ఉండాలి. ఉన్నత న్యాయ స్థానాల న్యాయమూర్తుల నియామకంలో ఇద్దరికీ (ప్రభుత్వం, న్యాయమూర్తులు) భాగస్వామ్యం ఉంటే ఇద్దరు సంప్రదించుకోవడం తప్పనిసరి అవుతుంది. న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వానికి తన వాదన వినిపించే అవకాశం ఉండి తీరాలి’ అని సిబల్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆల్తమస్ కబీర్ ఇటీవల గట్టిగా సమర్థించిన విషయం తెలిసిందే. అయితే కొలీజియం వ్యవస్థను మార్చే ప్రతిపాదన పట్ల న్యాయ వ్యవస్థ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల గురించి ప్రస్తావించగా, న్యాయ వ్యవస్థ అభిప్రాయాలు తమకు తెలుసని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని సిబల్ బదులిచ్చారు.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆరుగురు సభ్యుల జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రభుత్వ ప్రతినిధిగా ఈ కమిషన్‌లో ఉంటారు. ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇందులో ఉంటారు. మరో ఇద్దరు న్యాయకోవిదులను ఈ కమిషన్ సభ్యులుగా రాష్టప్రతి నామినేట్ చేస్తారు. ఈ ఆరుగురు సభ్యుల జెఎసి ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకాన్ని చేపడుతుంది. ప్రతిపక్ష నాయకుడిని కూడా ఈ జెఎసిలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో జెఎసిని ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో, మరో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన అయిదుగురు సభ్యుల కొలీజియం ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులను నియమిస్తోంది. 1993 తరువాత ఈ కొలీజియం వ్యవస్థ అమలులోకి వచ్చింది. అంతకుముందు ప్రభుత్వమే ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులను నియమించేది.
ఏప్రిల్ 18న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఎజెండాలో ఈ జెఎసి ఏర్పాటు ప్రతిపాదనను చేర్చినప్పటికీ, కేబినెట్ దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోలేదు. జ్యుడీషియల్ స్టాండర్డ్స్ అకౌంటబిలిటీ బిల్లు సహా న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించి పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ ఆమోదింపచేయడానికి తాను కృషి చేస్తానని సిబల్ తెలిపారు.

సిబిఐకి స్వయంప్రతిపత్తిపై
బిల్లుకు కేంద్రం విముఖత?

న్యూఢిల్లీ, జూన్ 2: సిబిఐపై పట్టును వదులుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రం సుముఖంగా లేదు. స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు చేసేందుకు కొత్త బిల్లును తీసుకురావాలన్న ఆలోచనను కూడా పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే డిపిఎస్‌ఇ చట్టంలో స్వల్ప మార్పులకు మంత్రుల బృందం సానుకూలంగా ఉన్నట్టు తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది. ఇప్పటివరకూ మంత్రుల బృందం రెండుసార్లు సమావేశం అయినప్పటికీ సిబిఐపై పూర్తిగా పట్టును వదులుకునే విషయంలో అంత సుముఖతను వ్యక్తం చేసిన సందర్భమేమీ లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ వ్యవస్థ (డిఎస్‌పిఇ) చట్టంలో మార్పుల ప్రతిపాదనలకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలు చేసేందుకు ఓ అఫిడవిట్‌ను సిద్ధం చేయాలని అటార్నీ జనరల్ వాహనవతిని మంత్రుల బృందం కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డిఎస్‌పిఇ చట్ట నిబంధనల ప్రకారమే సిబిఐ పని చేస్తుంది. అంటే, ఈ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే నేరాలను మాత్రమే సిబిఐ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా ప్రతిపాదిస్తున్న బిల్లు ద్వారా సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకుండానే వివిధ కేసులను దర్యాప్తు చేసే అధికారం లభిస్తుంది. దేశంలో నేరాల స్వభావం తీవ్రతలో మార్పులు వస్తున్నందున డిఎస్‌పిఇ చట్టం ఎంతమాత్రం ఉపకరించటం లేదని 2010లో సిబిఐ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ విషయంలో ఓ బిల్లును కూడా సమర్పించింది. ఇందులో సిబిఐ దర్యాప్తు పరిశీలనాంశాలు, డైరెక్టర్ ఎంపిక వ్యవహారం, సంస్థాగత వ్యవహారం, అధికారాల విస్తృతి, రాష్ట్రాలపై సిబిఐ పాత్ర మొదలైన వాటిని నిర్వచించింది. అయితే డిఎస్‌పిఇ చట్టంలో ఈ రకమైన మార్పులు చేయడానికి కేంద్రం సుముఖంగా లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పులకు బదులుగా సిబిఐ డైరెక్టర్‌కు ఆర్థికపరమైన అటార్నీని కల్పించే దిశగా సిఫార్సులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం అతిచిన్న ఖర్చుకు సంబంధించి కూడా సిబ్బంది మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇటీవల జరిగిన మంత్రుల బృందం సమావేశంలో సిబిఐకి సంబంధించి న్యాయవ్యవస్థ ప్రభుత్వాన్ని ఎంతమాత్రం శాసించజాలదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయంలో డిఎస్‌పిఇ చట్టంలో స్వల్పమార్పులు తెస్తే సరిపోతుందన్న వాదన వినిపించింది.

కొలీజియం స్థానంలో జెఎసి త్వరలో కేబినెట్ ముందుకు ప్రతిపాదన కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వెల్లడి
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>