హైదరాబాద్, జూన్ 2: తెలుగు అకాడమి రూపురేఖలు మారబోతున్నాయి. అకాడమికి సొంత భవన నిర్మాణంతో పాటు అనేక కొత్త చర్యలు చేపట్టడంతో విస్తృత వ్యాప్తితో దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని తెలుగు వారికి సైతం సేవలు అందించే స్థాయికి ఎదగబోతోంది. తెలుగు అకాడమిలో కొత్తగా రెండు విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో నాలుగు అకాడమి కేంద్రాలను నెలకొల్పుతారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శబ్దసాగరం, తెలుగు మహానిఘంటువు రూపకల్పనకు మళ్లీ ఏర్పాట్లు మొదలయ్యాయి. తెలుగు అకాడమికి సొంత భవనాన్ని 20 కోట్ల రూపాయిలతో చేపట్టాలని అకాడమి కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకు బడ్జెట్ కూడా కేటాయించారు. స్థలాన్ని ఖరారు చేయడంతో పాటు భవనాన్ని నిర్మించేందుకు అకాడమి కౌన్సిల్ కూడా తీర్మానం చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో ఐదు ఎకరాల స్థలాన్ని గుర్తించినా, ఈ మేరకు ఉస్మానియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా తీర్మానం చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో అకాడమిలో అనువాద విభాగాన్ని, పత్రికా విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు విభాగాలకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రస్తుత కేంద్ర కార్యాలయంలోని ప్రాంతీయ కార్యాలయాన్ని వేరే భవనానికి తరలిస్తారు. పత్రికా విభాగానికి త్వరలోనే ప్రసిద్థి చెందిన సంపాదకులతో కమిటీని నియమిస్తామని అకాడమి సంచాలకుడు ఆచార్య కె. యాదగిరి చెప్పారు. అకాడమి తరఫున భాష, సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రాలపై మూడు ప్రత్యేక సంచికలను తీసుకువస్తామని, ఈ మూడు సంచికలు రాష్ట్రంలోని ప్రతి విద్యార్ధికీ రిఫరెన్స్ పుస్తకంగా ఉంటుందని అన్నారు. తెలుగు మాద్యమంలోనే అన్ని అంశాలపైనా పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ పత్రికలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. విషయ నిపుణులతో అనేక అంశాలపై వ్యాసాలు రాయిస్తామని యాదగిరి పేర్కొన్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న మహానిఘంటు నిర్మాణం, శబ్దసాగరం రూపకల్పనకు సైతం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. నిఘంటు నిర్మాణ కమిటీకి సైతం ఒక కమిటీని నియమిస్తామని, దేశంలో కన్నడ భాషకు మహా సమగ్ర నిఘంటువు అందుబాటులో ఉందని, అలాగే తెలుగులో తీసుకువచ్చి, కొత్తగా వచ్చిన ప్రతి పదాన్ని ఈ నిఘంటువులో చేర్చేలా చర్యలు చేపట్టాల్సి ఉందని ప్రొఫెసర్ యాదగిరి పేర్కొన్నారు. అలాగే తెలుగు పదాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేందుకు స్థిరీకరించేందుకు ఆధునిక వ్యవహార పదకోశాన్ని రూపొందించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంత మంది ఉన్నారనేది ఇంత వరకూ స్పష్టమైన సమాచారం లేదని తెలుగు వారిని గుర్తించేందుకు భాషా సర్వే జరగాల్సి ఉందని తెలిపారు. తెలుగు వారైనా తెలుగు వచ్చిన వారు, తెలుగు రాని వారు ఎంత మంది ఉన్నారో తెలియని పరిస్థితిలో తెలుగు అకాడమిలో ఉన్న ప్రత్యేక విభాగం ఈ గుర్తింపు కార్యక్రమాన్ని ఎట్టకేలకు ప్రారంభించింది.
ఇతర రాష్ట్రాల్లో చెన్నై, బెంగలూరు, ముంబై, ఢిల్లీ పట్టణాల్లో నాలుగు అకాడమి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి భాష సాహిత్యం, సాస్కృంతిక పరిచయాన్ని, అందుకు సంబంధించిన గ్రంథాలను అందించేందుకు తెలుగు అకాడమి పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. అకాడమి స్థాపించినపుడు అనేక ఉన్నత లక్ష్యాలను రూపొందించుకున్నా, అవి నెరవేర్చేందుకు ఇంత వరకూ పెద్ద ప్రయత్నం ఏమీ జరగలేదు. నిజానికి అన్ని యూనివర్శిటీలకు పాఠ్యగ్రంథాలను, జనరంజక గ్రంథాలను అందిస్తూ, వనరుల కేంద్రంగా తెలుగు అకాడమి ఉపయోగపడుతోంది. విశ్వవిద్యాలయాల పరిపాలనా విద్యాత్మక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఉన్నత విద్యామండలి స్థాయిలోనే అకాడమి సైతం పనిచేస్తున్నా దానికి విశిష్ట విద్యా విజ్ఞాన కేంద్రంగా హోదా కల్పించకపోవడంతో లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను కూడా అకాడమి పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది. జాతి వికసించాలన్నా, దేశం, ప్రపంచం వికసించాలన్నా భాషా వికాసం అనివార్యం అనే భావనతోనే తెలుగు అకాడమికి కొత్త కార్యక్రమాలు రూపొందించామని యాదగిరి వ్యాఖ్యానించారు.
ధర్మానే రాజకీయ
గురువు: కొండ్రు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూన్ 2: జిల్లా కాంగ్రెస్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావే నా రాజకీయ గురువని రాష్ట్ర వైద్యవిద్య, 104, 108 శాఖామంత్రి కొండ్రు మురళీమోహన్ స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని ధర్మానను కలిసేందుకు ఆయన క్యాంపు కార్యాలయానికి ఆదివారం విచ్చేసిన మంత్రి కొండ్రు విలేఖరులతో మాట్లాడారు. రాజకీయ నేతలకు గతి నిర్దేశికుడని, కాంగ్రెస్ పార్టీకి తత్వవేత్త వంటి అనుభవం ఉన్న ధర్మాన అడుగుజాడల్లోనే పార్టీ శ్రేణులు పయనిస్తాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా పనిచేస్తానని స్పష్టంచేశారు. జిల్లా వైద్య రంగాన్ని విస్తృతంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయింపులో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని పేర్కొన్నారు. డిఎల్ బర్త్ఫ్ విషయమై మీ అభిప్రాయం ఏంటని మీడియాప్రతినిధులు ప్రశ్నించగా ఆ వ్యవహారంపై మాట్లాడేంత పెద్దవాడిని కాదని బదులిచ్చారు. ధర్మానను కలవడంలో రాజకీయ ప్రాధాన్యత ఉందా అన్న ప్రశ్నకు కూడా పదవులు ముఖ్యం కాదని, తాను ఈ స్థాయిలో ఉండటానికి ధర్మానే కారణమన్నారు.
జగన్ రాజకీయాలకు కిరణ్ మద్దతు: టిడిపి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలులో నుంచి సాగిస్తున్న రాజకీయ కార్యకలాపాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మద్దతు ఉందని టిడిపి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంత్రులు, అధికారులు, ముఖ్యమంత్రి అండ లేనిదే జైలులో జగన్ వ్యవహారాలు సాగుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. జైలులో నీలి చిత్రాలు చూస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శిలు చేశారు, దానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. అనంతరం జైళ్ల శాఖ డిజి చంద్రబాబు ఆరోపణలను ఖండించారు. ఈ వ్యవహారంపై మండవ వెంకటేశ్వరరావు ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ జగన్ జైలులో రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నారా? లేదా? అనే దానిపై జైళ్ల శాఖ డిజి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జైలులో జగన్ ములాఖత్‌ల గురించి టిడిపి నేత యనమల రామకృష్ణుడు సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు కోరితే కొన్ని వివరాలు మాత్రమే ఇచ్చారని, బినామీ ములాఖత్‌ల గురించి వివరాలు ఇవ్వలేదని తెలిపారు. జగన్‌ను పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ రక్షిస్తున్నారని ఆరోపించారు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా చంచల్‌గూడ జైలులో వ్యవహారాలు సాగుతున్నాయని, ప్రభుత్వం అండతోనే ఇది సాగుతోందని మండవ వెంకటేశ్వరరావు ఆరోపించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
యర్రగుంట్ల, జూన్ 2: కడప వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లకు సమీపంలోని కడప, తాడిపత్రి రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతుల సహా నలుగురు మృతి చెందారు. పదేళ్ల పాపతోపాటు ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జువారీ సిమెంట్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్న జి సూర్యనారాయణ (52), ఆయన భార్య మురళీకుమారి (46), కమలాపురం పట్టణానికి చెందిన వెంకట సుబ్బయ్య (46), ఎర్రగుంట్లకు చెందిన ఆటో డ్రైవర్ మక్బూల్ (35) ఉన్నారు. సూర్యనారాయణరెడ్డి భార్య, మనుమరాలితో కలిసి కడప నగరంలోని ఓ ఇంజనీరు వీడ్కోలు సభకు వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా ఎదురుగా వస్తున్న డీజల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా వారితోపాటు ఆటోలో ఉన్న సూర్యనారాయణరెడ్డి మనుమరాలు స్నేహ, మరో ప్రయాణికుడు బుజ్జి గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సిఐ రామకృష్ణుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.2 కోట్లతో మహిళ పరార్
డిఎస్పీని ఆశ్రయించిన చీటీల బాధితులు
ఆత్మకూరు, జూన్ 2: పురపాలక సంఘం పరిధిలో ఓ మహిళ చీటీల పేరుతో ప్రజలను మోసం చేసి రెండు కోట్ల రూపాయలతో పరారైనట్లు బాధితులు ఆదివారం ఆత్మకూరు డీఎస్పీ రాజామహేంద్రనాయక్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు పంటవీధికి చెందిన ఓ మహిళ చీటీల పేరుతో 5వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు నెలసరి చీటీ పాటల పేరుతో మోసం చేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. బినామీ పేర్లతో చీటీపాటలతో మోసం చేసిందని బాధితులు తెలిపారు. ఈమేరకు తమకు న్యాయం చేయాలని బాధితులంతా డీఎస్పీకి వినతి పత్రం అందచేశారు.
నేడు రాజ్‌నాథ్ రాక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: గత పది సంవత్సరాలుగా వాడిపోయిన కమలం వికసిస్తోంది. టిడిపి కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో పుంజుకుంటోంది. సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి సోమవారం ఇక్కడ నిజాం కాలేజీలో తెలంగాణ ఆత్మగౌరవ సభలో బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో బిజెపిలో చేరనున్నారు. రాజ్‌నాథ్ సోమవారం ఉదయం 11.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా రాష్ట్ర బిజెపి కార్యాలయానికి చేరుకుంటారు. సాయంత్రం నిజాం కాలేజీలో జరిగే తెలంగాణ ఆత్మగౌరవ సభలో ప్రసంగిస్తారు. నాగం జనార్దన్ రెడ్డి బిజెపిలో చేరడం ద్వారా కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపిలో నిరాశానిస్పృహలకు గురైన పలుకుబడి ఉన్న నేతలు బిజెపిలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు ఆ పార్టీని వీడిన నేపథ్యంలో త్వరలోనే టి అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన బూటకమని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు ఈ ప్రకటనను నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆహార భద్రత బిల్లు కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్న యుపిఐ ప్రభుత్వం, అదే సమావేశాల్లో తెలంగాణ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టరాదని డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మతపరమైనరిజర్వేషన్ల విధానాన్ని ప్రవేశపెట్టరాదని ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. బిసి ఇ కేటగిరీలో ఉన్న ముస్లింలకు విద్య, ఉపాధి అవకాశాలకే రిజర్వేషన్లు పరిమితమన్నారు. రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.
దేశాన్ని మతపరంగా విడదీయడం వాంఛనీయం కాదన్నారు. పైగా బిసిల కోటా తగ్గిపోతుందన్నారు. విద్య, ఉపాధికి మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు అనుమతిస్తామని గతంలో ప్రభుత్వమే స్పష్టం చేసిందన్నారు.
తెలంగాణకు సిఎం
మోత్కుపల్లి లేదా రత్నం
బాబు అంగీకరించాడన్న
ప్రజా సంఘాల జెఎసి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టిడిపి శాసనసభాపక్షం ఉప నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు లేదా కెఎస్ రత్నంను ముఖ్యమంత్రిని చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అంగీకరించారని తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి అధ్యక్షుడు గజ్జెల కాంతం తెలిపారు. గజ్జెల కాంతం నాయకత్వంలో ప్రజా సంఘాల జెఎసి నాయకులు ఆదివారం చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణపై మహానాడులో మరోసారి తీర్మానం చేసినందుకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో దొరల రాజ్యం కోసం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దొరల రాజ్యం తీసుకు రానివ్వమని ప్రజాసంఘాల నాయకులు చంద్రబాబుకు తెలిపారు. సామాజిక తెలంగాణకు టిడిపి కట్టుబడి ఉన్నందున టిడిపికే మా మద్దతు అని అన్నారు. కెసిఆర్ నిజమైన ఉద్యమకారులను విస్మరించి డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌లు ఏకమై ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే టిడిపి ఎంపిలంతా అనుకూలంగా ఓటు వేస్తారని చంద్రబాబు వెల్లడించినట్టు చెప్పారు. 2014లో టిడిపి అధికారంలోకి వస్తే అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేసేందుకు అంగీకరించినట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి కావాలని, మోత్కుపల్లి నర్సింహులు లేదా కెఎస్ రత్నంను ముఖ్యమంత్రిని చేయనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారని కాంతం తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై
శే్వతపత్రాన్ని ప్రకటించండి
ముఖ్యమంత్రి కిరణ్‌కు దత్తాత్రేయ బహిరంగ లేఖ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, ఆర్థిక పరిస్థితిపై శే్వతపత్రాన్ని ప్రకటించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఆదివారం బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రణాళిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ అంకెలను తారుమారు చేసి రాష్ట్రంలో అభివృద్ధి గొప్పగా ఉందని పేర్కొన్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశం మొత్తం మీద ఐదవ స్ధానంలో ఉందని, వృద్ధిరేటు జాతీయ స్ధానంలో 8.18 శాతం ఉందని, జాతీయ స్ధాయి వృద్ధిరేటు కంటే ఎక్కువగా ఉందని పేర్కొనడం సబబుకాదన్నారు. ఒక రాష్ట్ర వృద్ధిరేటు జాతీయ స్ధాయితో పోల్చరాదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. జాతీయ స్ధాయి ధరల సూచిక కంటే ఇది ఎక్కువన్నారు. విద్యుత్ సంక్షోభం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డయన్నారు. పరిశ్రమలు రుణాలు చెల్లించలేకపోతున్నాయన్నారు. గత రెండేళ్లలో ఒక మెగావాట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేకపోయామన్నారు. ఆర్‌బిఐ అంచనా ప్రకారం 15 నుంచి 20 శాతం చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. 30 లక్షల మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారన్నారు. కొత్త పరిశ్రమలు రాలేదన్నారు. రుణాలను రీషెడ్యూల్ చేయాలని బ్యాంకులను ప్రభుత్వం కోరాలన్నారు. ఐదు వేల కి.మీ పొడువున ఆర్‌బి రోడ్లను అభివృద్ధి చేయలన్నారు. ఆర్టీసి యాజమాన్యం విద్యార్ధుల బస్ పాస్‌ల రేట్లను కూడా పెంచిందన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు సంకేతాలు: పాల్వాయ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి తమ పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంటున్నట్లు తనకు సంకేతాలు ఉన్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీలో సామరస్యపూర్వక వాతావరణం కల్పించేందుకు యత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని ఆయన ఆదివారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే నెల 5 నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని అధిష్ఠానం భావిస్తున్నదని ఆయన తెలిపారు. సోమవారం జరగబోయే యుపిఎ స్టీరింగ్ కమిటీ సమావేశంలోనూ తెలంగాణ అంశంపై చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లింది వాస్తవమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ బలపడుతుందని ఆయన చెప్పారు. లేకపోతే టిఆర్‌ఎస్ టిఆర్‌ఎస్ బలపడుతుందని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు టిఆర్‌ఎస్‌లో చేరడం తొందరపాటు చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇసికి కార్యదర్శిని ఇవ్వరా?
సిఎం నిర్లక్ష్యమా? ప్రధాన కార్యదర్శి నిర్లక్ష్యమా?
ఎస్‌ఇసి కోర్టులో ఎన్నికల బంతి
జాబితా రాగానే సన్నాహాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికపై జరుగుతున్న వేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కార్యదర్శిని ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. కార్యదర్శి లేకపోవడం వల్ల ఎన్నికల ఏర్పాట్లలో కమిషన్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కమిషన్‌కు కార్యదర్శిని నియమించకపోవడం ముఖ్యమంత్రి నిర్లక్ష్యమా? లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్లక్ష్యమా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కమిషన్‌కు కార్యదర్శిని ఇవ్వటం లేదేమోనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 300 మంది వరకు ఐఎఎస్ అధికారులు వివిధ పదవుల్లో ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పి. రమాకాంత్ రెడ్డి గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న పి.కె. మహంతితో సహా ముఖ్యమంత్రి కార్యాలయంలో, జిఎడిలో పనిచేస్తున్న సీనియర్ ఐఎస్ అధికారులంతా రమాకాంతరెడ్డి కింద పని చేసిన వారే. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా పని చేస్తున్న రాంగోపాల్ గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో కార్యదర్శిగా పని చేశారు. రాంగోపాల్‌ను 2012 జనవరిలో ఎన్నికల కమిషన్ కార్యదర్శి బాధ్యతల నుండి తప్పించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ కార్యదర్శి పోస్టు ఖాళీగానే ఉంది. జిల్లా కలెక్టర్‌గా పని చేసి, ప్రభుత్వంలో కమిషనర్‌గా పని చేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారిని లేదా అందుకు సమాన హోదా కలిగిన ఐఎఎస్ అధికారిని కమిషన్ కార్యదర్శిగా నియమించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ ప్రతి రోజూ జిల్లా కలెక్టర్లతో కమిషన్ కార్యదర్శి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మాట్లాడుతూ ఉండాలి. ఈ కారణంగానే జిల్లా కలెక్టర్ స్థాయి కన్నా హెచ్చుస్థాయి కలిగిన ఐఎఎస్ అధికారిని మాత్రమే కమిషన్ కార్యదర్శిగా నియమించాల్సి ఉంటుంది. కమిషన్ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉన్న విషయాన్ని ఇప్పటికే అనేక పర్యాయాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి తెలియచేసిందని. అయినప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన కానరావడం లేదని తెలిసింది.
పంచాయతీరాజ్ శాఖలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి, ఈ జాబితా ఎన్నికల కమిషన్‌కు అందిన తర్వాత 18 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏప్రిల్-మే నెలల్లో పర్యటించి, ప్రాంతీయ సమావేశాలను ఏర్పాటు చేసి అన్ని జిల్లాల యంత్రాంగాలతో ఎన్నికల ఏర్పాట్లపై సవివరంగా చర్చించారు. గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లాపరిషత్‌లకు నిర్వహించాల్సిన ఎన్నికల ఏర్పాట్లకు సమాయత్తం అయ్యారు. ప్రభుత్వం తాజాగా పంచాయతీ సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టింది. ఏ ఏ స్థాయిలలో ఎంత మేరకు రిజర్వేషన్లు ఉండాలో ఉత్తర్వులు జారీ చేసింది.
గుర్తించాల్సిన స్థానాలు
రిజర్వేషన్లు ఎంత మేరకు ఉండాలో ప్రభుత్వం ప్రకటించింది కాని, ఏ ఏ స్థానాలు ఎవరెవరికి రిజర్వ్ చేయాలో నిర్ణయించలేదు. 22 జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాల్లో 13 లేదా 14 స్థానాలను ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. అలాగే మొత్తం మండలపరిషత్ అధ్యక్ష స్థానాల్లో 680 స్థానాలు ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వ్ అయ్యే అవకాశాలున్నాయి. ఏయే స్థానాలను ఏయే తెగలకు రిజర్వ్ చేస్తారో గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 9 వరకు ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని, ఆ తర్వాత ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. జూలై 5వ తేదీ తర్వాత దశల వారీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
గల్ఫ్‌లో తెలుగువారి తిప్పలు
ఉద్యోగ రిజర్వేషన్లతో రెండు లక్షల మంది వెనక్కి జూలై 3 చివరి గడువుగా ప్రకటన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: గల్ఫ్ దేశాలు ఇకమీదట ఉద్యోగ నియామకాల్లో తమ దేశాలకు చెందిన నిరుద్యోగులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వబోతున్నాయి. ప్రతి పదిమంది వలస ఉద్యోగుల్లో ఒక్కరికైనా స్వదేశానికి చెందిన నిరుద్యోగికి ఉద్యోగం కల్పించే విధంగా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నాయి. ఫలితంగా మన దేశం నుంచి వలస వెళ్ళిన నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగాల కోసం వలస వస్తున్న వారితో గల్ఫ్ దేశాలు భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని రాబట్టుకుంటున్నప్పటికీ, వలస వస్తున్న వారితో స్వదేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదని ఆ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో తమ దేశాల్లోని యువతకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాయి. ఫలితంగా మన దేశం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన వారు వెనుదిరగాల్సి వస్తున్నది. రాష్ట్రానికి చెందిన సుమారు రెండు లక్షల మంది తెలుగువారు ఇంటి బాట పట్టనున్నారు. అప్పులు చేసి ఉద్యోగాల కోసం గల్ఫ్‌కు వెళ్ళిన వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసం గల్ఫ్ వెళ్ళిన తెలుగువారికి రానున్న రోజులు కష్టకాలంగా మారనున్నాయి. గల్ఫ్ దేశాలకు చెందిన యువతకు ఉద్యోగాల రిజర్వేషన్ ఉండాలని అక్కడి పాలకులు ప్రకటించడంతో తెలుగువారు అయోమయంలో పడ్డారు. ఏ కంపెనీలో అయినా ప్రతి పది మందిలో గల్ఫ్ దేశానికి చెందిన ఒక వ్యక్తి ఉండాలని ప్రభుత్వాలు ప్రకటించాయి. దీంతో ఎక్కడ తమ ఉపాధి, ఉద్యోగాలు పోతాయోనని తెలుగువారు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వాలపై తిరుగుబాటుకు దిగుతారని ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడి యువతకు ప్రత్యేకంగా ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్ ఉండకపోవడం గమనార్హం. గల్ఫ్‌కు చెందిన ఆరు దేశాల్లో లక్షలాది మంది తెలుగువారు ఉన్నారు. జూలై 3వ తేదీ నాటికి ఉద్యోగాలకు సంబంధించిన పరిశీలన పూర్తి అవుతుందని ప్రోటోకాల్ అధికారి రమణారెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి వివరించారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో మూడు కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కూలీలుగా పనిచేసే వారిని మొదటి కేటగిరీలో ఉంచారు. వివిధ రంగాల్లో వృత్తిలో ప్రావీణ్యం ఉన్న వారిని రెండవ కేటగిరీలో చేర్చారు. ఇక మూడవ కేటగిరీలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు, అకౌంట్ ఆఫీసర్లు జాబితాలో చేర్చారు. తెలుగుభాష మాత్రమే వచ్చిన వారిని భవన నిర్మాణ రంగాల్లోకి తీసుకుంటారు. తాపీ మేస్ర్తిలు, ప్లంబర్లు, స్వీపర్స్, మహిళలు అయితే ఇంటిపనిలో పెట్టుకుంటారు. రెండవ కేటగిరీలో డ్రైవర్లు, సెక్యూరిటి గార్డ్స్, మెకానికల్, కంప్యూటర్స్ ఆపరేటర్స్, షాపు క్లీనర్స్, ఎసి మెకానిక్ విభాగాల్లో చేర్చుకుంటారు. ఇక మూడవ కేటగిరీలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేనేజర్లు, అకౌంట్‌కు చెందిన విభాగాల్లో ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తారు. గల్ఫ్‌కు వెళుతున్న వారిలో ఎక్కవమంది ఉపాధి కోసం పరుగులు తీస్తారు. 20-40 మధ్య వయసుల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ వయసులో ఉన్న వ్యక్తులు చురుకుగా పని చేస్తున్నందున వారితో ఎక్కువ పనులు చేయించుకుంటారు. మూడవ కేటగిరిలో వివిధ రంగాల్లో అనుభవం ఉన్నందున వారికి జీత భత్యాలు ఎక్కువగా ఇస్తారు. గల్ఫ్‌కు వెళ్ళిన వారిలో 20 నుంచి 40 మధ్య వయసు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న వారు కనీసం రూ.25 వేలనుంచి లక్ష వరకు సంపాదిస్తున్నారు.
సౌర విద్యుత్ సంస్థల వ్యూహంపై
సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 2: సౌర విద్యుత్ యూనిట్‌కు ఆరు రూపాయల 49 పైసలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఎన్ని సౌర విద్యుత్ ఉత్పాదన సంస్ధలు ముందుకు వస్తాయో ఈ నెల 4వ తేదీన తేలనుంది. విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి వర్గ ఉప సంఘం సౌర విద్యుత్‌కు యూనిట్ ఆరు రూపాయల 49పైసలు ధరను బెంచ్‌మార్క్ ధరగా నిర్ణయించిన విషయం విదితమే. గతంలోనే వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపి ట్రాన్స్‌కో టెండర్లను ఆహ్వానించింది. దీనికి స్పందించి 331 బిడ్స్ వచ్చాయి. ఈ సంస్ధలు మొత్తం 1780 మెగావాట్ల సౌర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి. 56 మెగావాట్ల విద్యుత్‌కు 13 బిడ్స్ వచ్చాయి. ఈ సంస్ధలు యూనిట్ ఏడు రూపాయలు చొప్పున చెల్లించాలని కోరాయి. 593 మెగావాట్ల విద్యుత్‌కు 107 బిడ్స్ వచ్చాయి. ఈ సంస్ధలు 8 రూపాయల నుంచి ఎనిమిది రూపాయల 50పైసల మధ్య రేటును పేర్కొన్నాయి. గరిష్టంగా ఒక యూనిట్‌కు 15 రూపాయల 50 పైసలను కూడా కొన్ని సంస్ధలు పేర్కొన్నాయి. ఈ బిడ్స్ వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై యూనిట్ సౌర విద్యుత్‌కు 6రూపాయల 49 పైసలు బెంచ్ మార్క్ రేటును ఖరారు చేసింది. ఆసక్తి ఉన్న సంస్ధలు జూన్ 4వ తేదీలోగా తమ నిర్ణయాన్ని తెలియచేయాలని ప్రభుత్వం కోరింది. తాజా సమాచారం ప్రకారం 60మెగావాట్ల సౌర విద్యుత్‌కు ఐదు సంస్ధలు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ సంస్ధలే యూనిట్‌కు 6 రూపాయల 49 పైసలకు సౌర విద్యుత్‌ను సరఫరా చేయగలమని ప్రభుత్వానికి తెలియచేసినట్లు తెలిసింది. ఈ వివరాలు రెండు మూడు రోజుల్లో వెల్లడవుతాయని భావిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నిర్దేశించిన రేటు కంటే ఎక్కువ రేటు ఇవ్వరాదని ట్రాన్స్‌కో డిస్కాంలను ఆదేశించింది. యూనిట్‌కు 6 రూపాయల 49 పైసలకు మాత్రమే అంగీకరించాలనే యోచనలో డిస్కాంలు ఉన్నాయి. ఏపిఇఆర్‌సి మాత్రం గతంలోనే సౌర విద్యుత్ యూనిట్ రేటు 5 రూపాయల 50పైసలను ఖరారు చేసింది.
ఈ రేటును దృష్టిలో పెట్టుకుని అదనంగా 99 పైసలు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. అంటే యూనిట్‌కు అదనంగా 99 పైసలు చొప్పున అదనపు భారాన్ని ప్రభుత్వం భరించి, ఈ మొత్తాన్ని డిస్కాంలకు చెల్లిస్తుంది. కాని ఇంతకంటే మించి రేటుకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తే, ప్రభుత్వం మిగిలిన భారాన్ని భరించేందుకు సిద్ధంగా లేదు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం 8500 కోట్ల రూపాయల వరకు బకాయిలను డిస్కాంలకు చెల్లించాల్సి ఉంది.