హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిజెపితోనే సాధ్యమని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం బిజెపిలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం జర్నలిస్టుల ఫోరం డాక్టర్ నాగంతో ‘మీట్ ది ప్రెస్’ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ప్రాంతీయ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదన్నారు. బిజెపి సహకారం లేకుండా టిఆర్‌ఎస్ సొంతంగా తెలంగాణను ఎలా సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కెసిఆర్ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఇక ఆ పార్టీ ఎప్పటికీ తెలంగాణ ఇవ్వదన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ చెప్పే కల్లబొల్లి మాటలు వినేందుకు ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా లేరన్నారు. 2014లో ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పాటు కావడం తథ్యమన్నారు. బిజెపిని మతతత్వ పార్టీగా కెసిఆర్ అభివర్ణించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇదే నిజమైతే గత ఎన్నికలు ముగిసిన వెంటనే అద్వానీని కెసిఆర్ ఎందుకు కలిశారని పంజాబ్ ర్యాలీలో బిజెపితో కలిసి వేదికను ఎందుకు పంచుకున్నారని ఆయన నిలదీశారు. దేశమంతా బిజెపి నినాదాలతో మార్మోగుతుంటే, తెలంగాణ కావాలంటున్న కెసిఆర్ ఇక్కడ బిజెపిని ఓడించమనడం అసమంజసంగా ఉందన్నారు. కెసిఆర్ వాదనలో హేతుబద్ధత లేదన్నారు. టిఆర్‌ఎస్ కంటే ముందే బిజెపి తెలంగాణ డిమాండ్‌ను ప్రస్తావించిందన్నారు. ఒకవేళ టిఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వస్తే తెలంగాణ కావాలని వత్తిడి చేయడం మినహా అంతకంటే మించి ఆ పార్టీ చేసేదేమీ ఉండదన్నారు. అదే బిజెపికి ఓటు వేస్తే తెలంగాణ ఏర్పాటు కావడం తథ్యమన్నారు.
హైదరాబాద్‌లో ఆదివారం జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన
మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతున్న నాగం జనార్దన్‌రెడ్డి