Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాంగ్రెస్‌లో డిఎల్ కలుపు మొక్క

$
0
0

కడప, జూన్ 2: మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలుపుమొక్క అని కడప వైఎస్సార్ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి పేర్కొన్నారు. ఆయనను తొలగించడం ఇప్పటికే ఆలస్యమయిందని, డిఎల్‌కు ఉద్వాసన పలికిన ముఖ్యమంత్రికి డబుల్ థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు. పార్టీకి చేటు చేస్తున్న మరిన్ని కలుపు మొక్కలను తక్షణం ఏరివేయాలని కోరారు. డిఎల్‌ను తొలగించడం ద్వారా పార్టీ వ్యతిరేకులకు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లయిందన్నారు. ఆదివారం కడప నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిఎల్ బర్త్ఫ్‌న్రు తప్పుపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి అధిష్ఠానానికి సూట్‌కేసులు మోస్తున్నారని ఆరోపణలు చేసినపుడు నిద్రపోయారా? అని ప్రశ్నించారు. 2 వేల కోట్ల రూపాయలు సంపాదించిన డిఎల్ ఏ వ్యాపారం చేశారని ప్రశ్నించారు. మంత్రి పదవిని లెక్కచేయని కొండా సురేఖను ఆడపులిగా అభివర్ణించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా, యువనేత రాహుల్ గాంధీల నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. వారి ఆధ్వర్యంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్రమంగా అమలు చేయడంతోపాటు మరిన్ని మెరుగైన పథకాలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందడుగు వేస్తున్నారని, పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కడప ఎంపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జైలు పార్టీగా అభివర్ణించారు. అక్రమాల ఊబిలో చిక్కుకున్న జగన్ జైలు నుండి బయటపడే అవకాశం లేదన్నారు. ఆ పార్టీ నేతల్లో మరికొంత మందికి జైలుయోగం తప్పదన్నారు. వైకాపాలో టికెట్లు వైఎస్ కుటుంబ సభ్యులకు, రెడ్లకు ముఖ్యంగా సూట్ కేసులు అందించేవారికి దక్కుతాయన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయల బియ్యం పథకానికి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారన్నారు. మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే మద్యపానం నిషేధం విధించగా చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే మద్యం వ్యాపారులతో కుమ్మక్కై గాలిలో కలిపేశారన్నారు. ఉద్యోగులను భయభ్రాంతులను చేసి అభద్రతాభావం సృష్టించారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కమలమ్మ, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలైనా అర్పిస్తాం రైవాడ నీరు సాధిస్తాం
మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేల శపథం
దేవరాపల్లి, జూన్ 2: ప్రాణాలు అర్పించైనా రైవాడ జలాశయం నుండి సాగునీటిని సాధిస్తామని విశాఖ జిల్లాలోని మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు, కెఎస్‌ఎన్ రాజులు శపథం చేశారు. రైవాడ నీరు రైతుల హక్కు అనే నినాదంతో దేవరాపల్లిలో 36 గంటలపాటు ఎమ్మెల్యే గవిరెడ్డి చేపట్టిన దీక్షలో భాగంగా ఆదివారం చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు పాల్గొని గవిరెడ్డి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాడుగుల ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ రైవాడ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి కనువిప్పు కలిగిస్తానన్నారు. రైతుల కోసం నిర్మించిన రైవాడ నీటితో గ్రేటర్ విశాఖ అధికారులు వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ నీటితో కోట్లాది రూపాయలు వసూలు చేసుకుని రైవాడకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వలన రైవాడ జలాశయం అభివృద్ధి కుంటుపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైవాడ నీరు రైతులకు ఇస్తామని 35 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగదని ఆయన హెచ్చరించారు. చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ చలనం లేని ప్రభుత్వానికి పోరాటం ద్వారా కళ్ళు తెరిపించాలని పిలుపునిచ్చారు. నీటి బిందువులను లెక్కగట్టి విశాఖలో వ్యాపారం చేసుకుంటున్న ప్రభుత్వం రైతుల కోసం రైవాడ బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ప్రత్యేక ఆందోళనకు దిగైనా గ్రేటర్ విశాఖకు మంచినీటి అవసరం కోసం తరలిస్తున్న నీటిని అడ్డుకున్నప్పుడే ఈ ప్రాంత రైతులకు న్యాయం చేకూరుతుందన్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త తుట్టా నర్సింగరావులు మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై దుయ్యబట్టారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిపి రావాడ సింహాద్రినాయుడు, దేవరాపల్లి, కె.కోటపాడు మండల టిడిపి అధ్యక్షుడు పోతల పాత్రునాయుడు, సబ్బవరపురామునాయుడు, సుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ కొప్పాక కాసుబాబు, కర్రి నాయుడు, కిళ్లి గోవింద, చల్లా నానాజీ పాల్గొన్నారు.
నేడు ఎడ్‌సెట్
హాజరుకానున్న 1.48 లక్షల మంది
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 2: ఆంధ్రాయూనివర్శిటీ ఆధ్వర్యంలో బిఇడిలో ప్రవేశం నిమిత్తం నిర్వహించే ఎడ్‌సెట్ 2013 పరీక్ష సోమవారం జరగునుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ పరీక్షలకు 1.48 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు పరీక్షల కన్వీనర్ నిమ్మ వెంకటరావు ఆదివారం ఇక్కడ తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన వెల్లడించారు. ఎడ్‌సెట్ 2013 పరీక్ష నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 287 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పరీక్ష జరుగుతుందని తెలిపారు. 45 నిముషాల ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్కనిముషం అలస్యమైనా అభ్యర్థులను అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచామని, వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ఫోటోను తీసుకురావాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
డిఎల్ తొలగింపును నిరసిస్తూ
మహిళ ఆత్మహత్యాయత్నం
మైదుకూరు, బ్రహ్మంగారిమఠం, జూన్ 2: మంత్రి పదవి నుండి డిఎల్ రవీంద్రారెడ్డిని తొలగించడాన్ని నిరసిస్తూ ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కడప వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మైదుకూరుతోపాటు బ్రహ్మంగారి మఠంలో డిఎల్ రవీంద్రారెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదిలావుండగా ఖాజీపేటలో డిఎల్ బర్త్ఫ్‌న్రు నిరసిస్తూ కడప జిల్లా మహిళా కార్యదర్శి లక్ష్మీదేవి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీనితో డిఎస్పీ ప్రవీణకుమార్‌రెడ్డి జోక్యం చేసుకుని వారించారు. నిరసన కారులందరినీ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
రూ. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
నర్సీపట్నం (రూరల్), జూన్ 2: విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం పోలీసులు 50 లక్షల రూపాయల గంజాయిని పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురితో సహా మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్‌లో స్థానిక ఎఎస్పీ విశాల్ గున్నీ ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. ఆదివారం తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో అందిన సమాచారం ఆధారంగా నర్సీపట్నం రూరల్ సిఐ పిఆర్ రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై అప్పారావు, రోలుగుంట ఎస్సై అప్పన్న, కోటవురట్ల ఎస్సై గోవిందరావులతో గంజాయి అక్రమ రవాణా దారులపై దాడి నిర్వహించారని తెలిపారు. గబ్బాడ పంచాయతీ మడ్డువారి పాకలు సమీపంలోని నెల్లిమెట్ట వద్ద 22 బ్యాగుల్లో ఉన్న 514 కిలోల గంజాయితో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు.
గూడ్స్ నిలిచిపోవటంతో
ఆలస్యంగా నడిచిన రైళ్లు
మధిర, జూన్ 2: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్రి గ్రామ సమీపంలో ఓ గూడ్స్ రైలు ఇంజన్‌లో వచ్చిన సాంకేతిక లోపం కారణంగా ట్రాక్‌పై నిలిచిపోయింది. దీంతో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా నడిచాయి. ఆదివారం సాయంత్రం 4.40 గంటల సమయంలో ఖమ్మం వైపు వెళుతున్న గూడ్స్ రైలింజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడి మోటమర్రి రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది. వెనుక వస్తున్న ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మధిర రైల్వేస్టేషన్‌లో సుమారు గంటపాటు నిలిచిపోయింది. దీనివెనుక వచ్చే నవజీవన్‌ను తొండలగోపవరం రైల్వేస్టేషన్‌లో 50 నిమిషాల పాటు నిలిపివేశారు. మరో ఇంజన్‌ను తెప్పించి గూడ్స్ రైలును మోటమర్రి రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్ళటంతో నిలిచిపోయిన రైళ్లు బయల్దేరి వెళ్లాయి.

పిడుగుపాటుకు నలుగురు మృతి
బాపట్ల/ పొన్నూరు, జూన్ 2: గుంటూరు జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు గురై నలుగురు మృతి చెందారు. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామంలో పంటపొలాల వద్ద కాపలా ఉండే రైతుకూలీ సాదు సుబ్బారావు (35), పశువుల కాపర్లు కాకుమాను అంజలీదేవి (30), మల్లవరపు జాలయ్య (12) ఆదివారం మధ్యాహ్నం హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవటంతో సమీపంలోని చెట్టుకిందకు వెళ్ళి నిలబడ్డారు. అదేసమయానికి పిడుగుపడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పొన్నూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గందుల వెంకటేశ్వర్లు (56) తుంగభద్ర డ్రైన్ పరిసరాల్లో గొర్రెలు కాస్తుండగా పిడుగు పడటంతో మృతిచెందాడు.
‘పిల్లల మనోభావాలను తల్లిదండ్రులు గుర్తించాలి’
శ్రీశైలం, జూన్ 2: శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు ఆయన తరుఫున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన సుండుపల్లెలోని ఆయన చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రభావం విద్యార్థులపై అధికంగా ఉంటుందని దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు సమన్వయం సాధించాలని అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల మనోభావాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి ప్రోత్సాహం ఇవ్వాలన్నారు.

మంత్రులపై చర్య చేపట్టే అధికారం సిఎంకు ఉంది : బాలరాజు
గాజువాక, జూన్ 2: మంత్రులు క్రమశిక్షణ తప్పితే వారిపై చర్యలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాలరాజు అన్నారు. ఇక్కడి జవహర్‌లాల్ ఫార్మాసిటీలోని గ్లోకెమ్ కంపెనీని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగించిన విషయాన్ని విలేఖరులు ఆయన వద్ద ప్రస్తావించగా, పై విధంగా స్పందించారు. సమష్టి నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రి వర్గానికి ఉంటుందని, అటువంటి నిర్ణయాలను బహిరంగంగా విభేదించడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. సమష్ట నిర్ణయాలపై అనుమానాలు ఉంటే ఏ మంత్రికి అయినా ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంటుందన్నారు. మంత్రులకు ఏ సమయంలోనైనా ముఖ్యమంత్రిని సంప్రదించే అవకాశం ఉందని తెలిపారు. మంత్రివర్గ సమావేశం అంటే ఒక క్రమశిక్షణ గల అత్యుత్తమ సమావేశమని, అటువంటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై బహిరంగంగా విభేదించడాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తప్పు పడుతుందని చెప్పారు. విలేఖరుల సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, కాంగ్రెస్ నేతలు పయిల జగన్నాథరావు, బొద్దపు వెంకటరమణ, దుల్ల రామునాయుడు, అట్టా సన్యాసి అప్పారావు, జిబి నాయుడు, మోటూరి సన్యాసినాయుడు తదితరులు ఉన్నారు.

డిఎల్ బర్తరఫ్ బాధాకరం
కేంద్ర మంత్రి కోట్ల
ఎమ్మిగనూరు, జూన్ 2: విదేశాల్లో ఉన్న మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని భర్తరఫ్ చేయడం బాధాకరమని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీలకు అవినీతి మచ్చలు ఉన్నాయన్నారు. టిడిపి, బిజెపి, వైకాపాల్లోనూ అనేక మంది నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయాల్లో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ 2014 ఎన్నికల్లో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేస్తుందన్నారు. రైల్వే కోచ్‌ల గురించి అవగాహన లేకపోవడం వల్లే ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి ఆరోపణలు చేస్తున్నారన్నారు. జిల్లాలో 120 కోట్ల రూపాయలతో రైల్వే కోచ్ వర్కుషాప్ నిర్మాణం చేపడతామన్నారు. ఇందులో 5వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. రాహూల్‌గాంధీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు.

నన్ను తొలగించే విషయం సిఎంనే అడగండి
మంత్రి రామచంద్రయ్య
కంభం, జూన్ 2: రాష్ట్ర మంత్రివర్గం నుంచి తమను తప్పించే విషయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినే అడగండి అని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి రామచంద్రయ్య విలేఖరులనే ప్రశ్నించిన వైనమిది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో కమలాపురం సెంటర్‌లో ఆదివారం శ్రీకృష్ణదేవరాయుల విగ్రహా ఆవిష్కరణకు వచ్చిన సందర్భంగా మంత్రి రామచంద్రయ్య కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడారు. గత రెండురోజులుగా మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై విలేఖరులు ఆయన్ని ప్రశ్నించగా ఈవిషయాన్ని సిఎంను అడగండంటూ ఎదురు ప్రశ్నించారు. కాగా జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన కంభం చెరువును పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తానన్నారు.

జగన్‌ది జైలుపార్టీ : ఎమ్మెల్యే వీరశివారెడ్డి విమర్శలు
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>