రాజమండ్రి, జూన్ 2: గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ కష్టాలు మొదలయ్యాయి. జూన్ 1వ తేదీ నుండి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు, వెంటనే ఖాతాల్లో సబ్సిడీ మొత్త, (పర్మినెంట్ అడ్వాన్స్) జమవుతుందని ప్రకటించినప్పటికీ, చాలామందికి జమ కాలేదు. రాష్ట్రంలో తొలిదశలో గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం అమలుచేస్తున్న జిల్లాల్లో ఒకటయిన తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవటంతో గ్యాస్ వినియోగదారుల్లో ఆందోళన మొదలయింది. ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను గ్యాస్ ఏజన్సీలకు అందించటంతో పాటు, సంబంధిత బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్లు అందించి సీడింగ్ చేసుకున్న వినియోగదారులకు, జూన్ 1వ తేదీ నుండి సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే పర్మినెంట్ అడ్వాన్స్ జమకావాలి. కానీ కొంతమంది వినియోగదారులకు జమ కాలేదు. జమ కాకపోవడం పక్కనపెడితే, సిలిండర్‌కు సబ్సిడీ లేకుండా చెల్లించాల్సిన మొత్తాన్ని సూచిస్తూ వారి మొబైళ్లకు ఎస్‌ఎంఎస్ వస్తోంది. ఈ ఎస్‌ఎంఎస్ చూసుకున్న వినియోగదారులు వెంటనే బ్యాంకు ఖాతాలో పర్మినెంట్ అడ్వాన్స్ జమయిందో లేదో సరిచూసుకుంటే అలాంటి మొత్తమేదీ కనిపించటం లేదు.
నగదు బదిలీకి ముందు సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారుడు రూ.411 చెల్లించే వారు. నగదు బదిలీ పథకం అమలుచేయటం మొదలుపెట్టిన తరువాత రూ.851.50 చెల్లించాల్సిందిగా వినియోగదారులకు ఎస్‌ఎంఎస్ వచ్చింది. అంటే పర్మినెంట్ అడ్వాన్స్ కింద 440.50 జమకావాలి. కానీ కొంత మందికి రూ.435మాత్రమే జమయినట్టు సమాచారం అందుతోంది. అంటే మిగిలిన రూ.5.50ను వినియోగదారులు చెల్లించుకోవాలన్న మాట. నగదు బదిలీ పథకం అమలుకాక ముందు సిలిండర్‌కు రూ.411 చెల్లించాల్సిన వినియోగదారులు, నగదు బదిలీ పథకం తరువాత రూ.416.50చెల్లించాల్సి ఉంటుందా? అసలు ఏమిటీ గందరగోళం? అని గ్యాస్ వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పర్మినెంట్ అడ్వాన్స్‌తో పాటు రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న గ్యాస్ సిలిండర్ సబ్సిడి రూ.25కూడా జమకావాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం అందించే సబ్సిడీ విషయంలో ఇంత వరకు ఎలాంటి స్పష్టత లేదు. తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజు 16,157 మంది గ్యాస్ సిలిండర్లను బుక్‌చేసుకుంటే, వారి ఖాతాల్లోకి పర్మినెంట్ అడ్వాన్స్‌గా రూ.70లక్షల 26వేల 999 జమచేసినట్టు అధికారులు ప్రకటించారు. మరి మిగిలిన ఖాతాదారుల సంగతేమిటో అంతుబట్టకుండా ఉంది.
అయితే సాంకేతికపరమైన లోపాలేమైనా వచ్చాయేమో సరిచూసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులు తమ ఖాతాల్లోకి పర్మినెంట్ అడ్వాన్స్ జమయిందో చూసుకునే వారికి అసలు విషయం తెలుస్తుందని, అలా చూసుకోని వారికి జమకాకపోయినా తెలియకపోగా, నష్టం జరుగుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బ్యాంకు ఖాతాల్లో జమకాని గ్యాస్ సబ్సిడీ రీఫిల్‌కు పూర్తి మొత్తం చెల్లించాలని ఎస్‌ఎంఎస్‌లు వినియోగదారుల్లో ఆందోళన
english title:
n
Date:
Monday, June 3, 2013