విజయవాడ, జూన్ 2: రాష్ట్ర వైద్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్ కావటం బాధాకరమేనని, అయితే మున్ముందు మరే మంత్రి కూడా బర్తరఫ్ కాబోరని పిసిసి నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విజయవాడ వచ్చిన ఆయన నగర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో విలేఖర్ల సమావేశంలో మట్లాడుతూ మంత్రులు ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి రాజీనామాలు కూడా దురదృష్టకరమన్నారు. మంత్రి పార్థసారథి గురించి విలేఖరులు ప్రస్తావించగా ఆయన కేసు విషయంలో ఎక్కడా అవినీతి చోటుచేసుకోలేదని సమాధానమిచ్చారు. తెలంగాణకు చెందిన ఒకరిద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీని వీడిపోవటంలో అర్థంలేదని వ్యాఖ్యానించారు. మరెవరూ పార్టీని వీడి వెళ్లబోరని ఆయన చెప్పారు. గతంలో దోచుకున్నది దాచుకోటానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావించిందని బొత్స విమర్శించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ మహానాడులో చేసిన తీర్మానాలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఖజానా ఒట్టిపోయి పలుమార్లు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్ళాల్సిరాగా తమ పార్టీ పాలనలో నేటివరకు ఒక్కసారి కూడా అలా జరగలేదన్నారు. బిసిలకు 100 సీట్లు ఇస్తానంటూ పదేపదే చెబుతున్న చంద్రబాబు గత ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇచ్చారో చెప్పగలరా అని బొత్స ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో, కర్ణాటక శాసనసభ ఎన్నికల్లోనూ ప్రజలు అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఎలా పట్టంకట్టారో అలాగే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తపర్చారు. రిజర్వేషన్‌లు ఖరారైనందున స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగుతాయని చెప్పారు. కాగా, బొత్స సమక్షంలో వైఎస్సార్సీపీ యువనేత బాడిత శంకర్, తెలుగుదేశం డాక్టర్స్ సెల్ మాజీ చైర్మన్ డాక్టర్ కొడాలి రామకృష్ణ, తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.
దోచుకున్నది దాచుకునేందుకే వైకాపా ఆవిర్భావం : బొత్స
english title:
i
Date:
Monday, June 3, 2013