కర్నూలు, జూన్ 2: కర్నూలు జిల్లాలోని ఆదోని, కర్నూలు రెవిన్యూ డివిజన్ల పరిధిలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. జిల్లాలోని తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా నదిలోకి వరద నీరు వచ్చి చేరడంతో కెసి కెనాల్‌కు ఆధారమైన సుంకేసుల బ్యారేజ్ నిండింది. దీంతో సుమారు 1.2 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యం వున్న సుంకేసుల బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండింది. వేసవిలో సుంకేసుల బ్యారేజీలో 0.04 టిఎంసిల నీటిని మాత్రమే నిల్వ వుంచి మిగతానీటిని తాగు, సాగు నీరు కింద వినియోగించారు. భారీ వర్షం కారణంగా సుంకేసుల నిండడంతో కెసి కాలువకు తాగునీటి కోసం నీరు విడుదల చేసే అవకాశం వుంది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలో ఓ మోస్తరు వర్షం కురిసినప్పటికీ నీరు భూమిలోకి ఇంకిపోయిందని మళ్లీ ఒకటి, రెండు వర్షాలు కురిస్తే వ్యవసాయానికి అనుకూలం కావచ్చని రైతులు చెబుతున్నారు.
తిరుమలలో కుండపోత వర్షం
తిరుపతి: తిరుమల కొండపై వరుణుడు కుండపోత వర్షం కురిపించాడు. దీంతో ఆదివారం భక్తులు తడిసి ముద్దయ్యారు. రోడ్లన్నీ జలయమయం అయ్యాయి. వర్షం కారణంగా ఘాట్‌రోడ్డులో సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పటికీ అటు తరువాత యధావిధిగా కొనసాగాయి. ఇదిలా ఉండగా రద్దీ కారణంగా సాధారణ క్యూలో వెళ్లే భక్తులకు 18 గంటలు సమయం పడుతుండగా కాలిబాటలో వచ్చే భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. తలనీలాలు సమర్పించే భక్తులకు సైతం ఆరు గంటల సమయం పడుతోంది. ఆదివారం మధ్యాహ్న సమయంలో ఆకాశం నల్లమబ్బులతో నిండిపోయింది. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిచింది. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు పరుగులు తీసిన భక్తులు రాంభగీచ అతిథి భవనాల్లో తలదాచుకున్నారు. సుమారు గంటపాటు వర్షం కురవడంతో తిరుమల రోడ్లన్నీ జలయమం అయ్యాయి. ఇదిలా ఉండగా కల్యాణోత్సవాలు ముగిసిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఆర్జిత సేవలు జరిగే వైభవోత్సవ మండపానికి పటాటోపం (గొడుగు) మధ్య తీసుకువచ్చారు. అనంతరం అక్కడ వసంతోత్సవం, బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. కాగా రద్దీ కారణంగా వసతి దొరకని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తిరుమలలో వెంకన్న దర్శనం కోసం వర్షంలోనే బారులు తీరిన భక్తులు