Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పరిశ్రమలకు ‘పవర్’ కష్టాలు

$
0
0

శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: అందరూ ఊహించినట్టే విద్యుత్ కష్టాలు అంచెలంచెలుగా వినియోగదారుల నుంచి పరిశ్రమల వరకు వెంటాడుతున్నాయి. తాజాగా విద్యుత్ సంక్షోభం జిల్లా పరిశ్రమలను తాకింది. దీంతో జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమలకు వారానికి మూడురోజులు పవర్ హాలిడే ప్రకటిస్తూ ఎపిఇపిడిసిఎల్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈనెల 18వతేదీ నుంచి విద్యుత్ కోతను అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించగా క్షేత్రస్థాయి అధికారులు ఈ సమాచారాన్ని పరిశ్రమల యాజమాన్యానికి తెలియజేశారు. సోమవారం నుంచి ఈ కోత అమల్లోకి వస్తుందని ట్రాన్స్‌కో అధికారులు పరిశ్రమల నిర్వాహకులకు షాకింగ్ న్యూస్ అందించే సరికి వారంతా హడలెత్తిపోతున్నారు. జిల్లాలో 71 భారీ పరిశ్రమలు, 3274 మధ్యతరగతి పరిశ్రమలతోపాటు అనేక కుటీర పరిశ్రమలకు ఈ కోత వర్తిస్తుందని ఆదేశాల్లో ట్రాన్స్‌కో అధికారులు స్పష్టం చేయడంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుతున్న పైడిబీమవరం, ఎచ్చెర్లలో ఉన్న రసాయనిక పరిశ్రమలకు ఈ షాక్ కారణంగా కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. రాజాం, పలాస, కాశీబుగ్గల్లో పలు పరిశ్రమలతోపాటు కుశాలపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గ్రానైట్, అల్యూమినియం తదితర పరిశ్రమలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ నెల 28వతేదీ వరకు వారంలో సోమవారం, మంగళవారం విద్యుత్‌ను పూర్తిగా నిలిపేందుకు అధికారులు ఆదేశాలల్లో పేర్కొన్నారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10గంటల వరకు కేవలం వెలుగులు కోసం మాత్రమే విద్యుత్‌ను వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. జిల్లాలో 23వేలు విద్యుత్ కనెక్షన్‌లు భారీ, మధ్యతరహా, చిన్న, కుటీర పరిశ్రమల కనెక్షన్‌లు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా విద్యుత్ కోతలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు అవసరాలను డీజిల్‌తో తీర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పరిశ్రమలకు విద్యుత్ షాక్ కారణంగా కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. మార్చి ఒకటి నుంచి వారానికి మూడురోజులు సోమ, మంగళ, బుధవారాల్లో డీజిల్‌తోనే పరిశ్రమలు నడిపించాలని, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10.30గంటల వరకు విద్యుత్‌ను వెలుగు కోసమే వినియోగించుకోవాలని ఉత్తర్వులు స్పష్టం చేయడంతో పరిశ్రమల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్‌తో పరిశ్రమలు నడిపించడం కష్టతరవౌతుందని, యాజమాన్యాలు లే ఆఫ్‌లు ఇచ్చి సెలవు ప్రకటించే పనిలో యోచిస్తున్నట్లు సమాచారం. ట్రాన్స్‌కో అధికారులు సూచించినట్లు డీజిల్‌తో పరిశ్రమలు నిర్వహిస్తే యూనిట్‌కు 16 నుంచి 18రూపాయలు ఖర్చవుతుందని విద్యుత్‌తో అయితే యూనిట్ ఛార్జి రూ.4.80 ఉంటుందని ఈ వ్యత్యాసాన్ని భరించడం సాధ్యం కాదని యాజమాన్యాలు పరిశ్రమలు మూసేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీని కారణంగా కార్మికులు తిరిగి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతంలో కొన్ని నెలల పాటు ఇదే సంక్షోభం కారణంగా పరిశ్రమకు లే ఆఫ్‌లు ప్రకటించడం వలన కార్మికుల జీతాల్లో కోత విధించడం జరిగింది. ఇదే పునరావృతమైతే అటు యాజమాన్యాలు, ఇటు కార్మిక కుటుంబాలకు అవస్థలు తప్పేటట్టు లేదు.

మాతృభాషను మరువరాదు
* జిల్లా విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 21: మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయరాదని జిల్లా విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు విద్యార్థులకు హితవు పలికారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు భాషా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష, హిందీ భాష అవసరమైనప్పటికీ నేటి విద్యార్థులు తొలుత మాతృభాషపై ప్రావీణ్యం సంపాదించడం అవసరమన్నారు. అమ్మపదంలోని కమ్మదనం, మాతృభాషలోని తియ్యదనం మాటల్లో వర్ణించలేనిదన్నారు. సదస్సులో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ తెలుగుభాషకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి ప్రభుత్వ కార్యకలాపాలను విధిగా తెలుగులోనే నిర్వహించేలా ప్రభుత్వం చర్య లు చేపట్టాలని డిమాండ్ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ బమ్మిడి పోలీసు అధ్యక్ష త వహించగా, సమాఖ్య జోనల్ కార్యదర్శి కాండూరి సీతారామచంద్రమూర్తి తెలుగు సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో ఎర్నాకుల వెంకటరమణారావు, సూర్యప్రకాశరావు, రాజారావు, శ్రీనివాసరావు, అప్పన్న, నర్సింహరావు, గౌరీశంకర్ పాల్గొన్నారు.

వౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక కృషి
పాలకొండ(టౌన్), ఫిబ్రవరి 21: గిరిజన గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా కృషిచేస్తున్నామని ఐటిడిఎ పి.ఒ. కె.సునీల్ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఓని పంచాయతీ డెప్పిగూడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని గిరిజనులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి తనకు తెలియజేయాలని ఆదేశించారు. గ్రామంలో విద్యుత్, మంచినీరు సదుపాయాలను పరిశీలించారు. అలాగే గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వారు వినియోగిస్తున్న తీరుపై ఆరా తీశారు. సంక్షేమ పథకాల అమల్లో ఎటువంటి జాప్యం జరిగినా చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు. అనంతరం స్కాట్‌దొరవలస గ్రామంలో పాఠశాలను సందర్శించారు. పాఠశాల భవనం మరమ్మతులకు గురైందని గుర్తించిన ఆయన భవన మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాల ఆవరణలో ఉన్న బావిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో మెలిగి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. అలాగే ఉపాధ్యాయులు గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలకు సకాలంలో చేరుకుని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన అందించాలన్నారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతో పాటు ఇ.ఇ.ఎం.ఆర్.జి. నాయుడు, ఎ.పి.డి. ధర్మారావు, ఎంపిడిఒ డి.వి. రమణ, తహశీల్దార్ వివేకానంద, సి.ఐ. రాంబాబు, విద్యుత్ ఎ.ఇ. హరికృష్ణ ఉన్నారు.

కూర్మనాథుని సన్నిధిలో కేంద్రమంత్రి సతీమణి
గార, ఫిబ్రవరి 21: మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథుని ఆలయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవనరుల శాఖా మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి మంగళవారం సందర్శించి పూజలు నిర్వహించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ సందర్శన అనంతరం ఇక్కడకు చేరుకున్న ఆమెను కార్యనిర్వాహణాధికారి ప్రసాద్ పట్నాయక్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఆలయ బేడా మండపంలోని గోడలపై ఒడిశా ఆకుపసర్లుతో వేసినటువంటి చిత్రాల విశిష్టతను అక్కడి అర్చకులు చామర్తి మురళీకృష్ణ వివరించారు. అదేవిధంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. అనంతరం పక్కనే ఉన్నటువంటి లక్ష్మీదేవి సన్నిధిలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమెకు అర్చకులు బేడామండపంలో ఆశీర్వచనాలు పలికి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి సీతారామ నరసింహాచార్యులు ఉన్నారు.

గవర్నర్ నిర్ణయం హర్షణీయం
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: గవర్నర్ నిర్ణయం కిరణ్ సర్కార్‌కు ఓ గుణపాఠం కావాలని కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు పేర్కొన్నారు. సమాచార చట్టం కమిషనర్ల నియామకంలో రాజకీయాలు చేయడం తగదని, సి.ఎం. ఆలోచన సరికాదని అన్ని వర్గాలు దీనిపై వ్యతిరేకించాయన్న విషయాన్ని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గుర్తెరగాలన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో పటిష్టమైన సమాచారహక్కు చట్టాన్ని 2005లో అమలులోకి తీసుకువచ్చారని, దీనిపై ఉభయసభల్లో అన్ని పార్టీల ఎంపీలు కూడా చర్చించి ఒక ప్రణాళిక రూపొందించి, కొన్ని మార్గదర్శకాలను సూచించారన్నారు. సమాచార హక్కు చట్టాన్ని బ్రహ్మాస్త్రంగా రూపొందించడంతో అవినీతిపై పోరాటం చేయాలన్నా, ఏ అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నా ఆయుధంగా వినియోగపడేలా రూపొందించారన్నారు. చట్టానికి లోబడి కమిషనర్లను నియమించాల్సి ఉందని, కానీ నిబంధనలకు విరుద్దంగా ముఖ్యమంత్రి ఎనిమిది మందిని కమిషనర్లగా నియమించి, అనేక విమర్శలు ఎదుర్కొన్నారని తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని, మేధావులు, వివిధ రంగాల్లో నిష్ణాతులను నియమించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా రాజకీయ నిరుద్యోగులతో కమిషనర్ పోస్టులు భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతోపాటు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, మేధావులు, గతంలో న్యాయమూర్తులుగా పనిచేసిన వారు కూడా వ్యతిరేకించారని, ఇందులో కొంత మంది ఒకడుగు ముందుకు వేసి గవర్నర్ వద్దకు నేరుగా వెళ్లి సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించిన నేపథ్యంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.
రాజకీయ నేపథ్యం ఉన్న నలుగురు వ్యక్తుల నియామకం చెల్లదంటూ, మిగిలిన నలుగురు పేర్లతో గవర్నర్ ఆమోదముద్ర వేయడం ఒక నీతివంతమైన పరిపాలనకు నిదర్శంగా నిలిచిందన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనడానికి సమాచార హక్కు కమిషనర్ల నియామకమే తేటతెల్లం చేస్తుందని, దీనిని నిరసిస్తూ ఆశాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి స్వచ్ఛంద పదవీ విరమణకు సన్నద్ధం కావడం నిదర్శనంగా నిలుస్తుందన్నారు. గవర్నర్ నిర్ణయం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

పగడ్బందీగా ఎస్.ఎస్.సి.పరీక్షలు
ఎ.జె.సి. రాజ్‌కుమార్
బలగ, ఫిబ్రవరి 21: జిల్లాలో మార్చి 26 నుంచి ఏప్రిల్ 11 వతేదీ వరకు జరుగనున్న ఎస్.ఎస్.సి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ చెప్పారు. మంగళవారం తన ఛాంబర్‌లో 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎస్.ఎస్.సి. పరీక్షలకు 44,035 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 33,323, ప్రైవేటు విద్యార్థులు 10,712 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. రెగ్యులర్ పరీక్షా కేంద్రాలు 154, ప్రైవేటు పరీక్షా కేంద్రాలు 35తో కలపి మొత్తం 189 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షలు సాఫీగా జరిపించేందుకు అన్ని పరీక్షా కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించాలని ఎ.జె.సి. సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌ల కోసం 10 మంది రెవెన్యూ అధికారులను ఏర్పాటుచేయాలని డి.ఆర్.ఒ.కు సూచించారు. మెటీరియల్‌ను పరీక్షా కేంద్రాలకు చేరవేయడానికి పోలీసు బందోబస్తు నిమిత్తం 10 మంది ఎస్.ఐ.లు, 20 మంది కానిస్టేబుళ్ళు, ఆర్మ్‌డ్ రిజర్వ్ గార్డులను ఏర్పాటుచేయాలని జిల్లా ఎస్.పి.ని కోరారు. పరీక్ష తరువాత పోస్ట్ఫాసులో మెటీరియల్ స్పీడు పోస్టు ద్వారా సకాలంలో పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పోస్టల్ సూపరింటెండెంట్‌ను కోరారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రధమ చికిత్స కిట్లు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోద్య శాఖాధికారిని ఆదేశించారు. పరీక్షా సమయంలో కరెంటు అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారులకు ఆయన సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగా అభ్యర్థులను చేరవేసే విధంగా బస్సులను ఏర్పాటుచేయాలని ఆర్టీసీ అధికారులకు ఎజెసి కోరారు. పరీక్షా కేంద్రాలకు మెటీరియల్‌ను సకాలంలో అందించేందుకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌కు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషా ఖాసిం, జిల్లా విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి శారద, ఏపి ట్రాన్స్‌కో, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సీతంపేట, ఫిబ్రవరి 21: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సాక్షర భారత్ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజరు లక్ష్మణరావు అన్నారు. మంగళవారం స్థానిక పిఎంఆర్‌సి కేంద్రంలో మహిళల హక్కులు, సమస్యల పట్ల గ్రామ సమన్వయకర్తలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఏయే రంగాల్లో వెనుకబడి ఉన్నారు. వారిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మహిళలకు సూచనలు, సలహాలు అందించారు. గిరిజన ప్రాంతాల్లో మహిళలు అధిక సంఖ్యలో విద్యకు దూరంగా ఉంటున్నారని, దీనిని అధిగమించేందుకు వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చదువుకోని ప్రతి మహిళను ఈ కేంద్రాల్లో చేర్పించి విద్యా ప్రమాణాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు అక్షరాస్యత కలిగి ఉంటే ఆ కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. అలాగే ఆర్ధిక స్వావలంబన కోసం మహిళలను ముందుకు నడిపించేందుకు అక్షరాస్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షరభారత్ జిల్లా కో-ఆర్డినేటర్ జనార్దనస్వామి, సీతంపేట, పాలకొండ మండలాల సాక్షరభారత్ కో -ఆర్డినేటర్లు చిన్నారావు, ఎం.రాజబాబు, జిల్లా మహిళా సంఘ అధ్యక్షురాలు కె.లలిత, కళావతి పాల్గొన్నారు.

వైద్య విద్య ఐదో సంవత్సరం
కోర్సు అనుమతులపై సందేహాలు..!
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన రిమ్స్ కథ ఒక ఎత్తయితే ఇకనుంచి మరింత ఉజ్వల భవిత సాధించే అవకాశం లభించిందనే చెప్పాలి. జిల్లాకు చెందిన రాజాం శాసనసభ్యుడు కోండ్రు మురళీమోహన్‌కు ఇటీవల క్యాబినెట్‌లో వైద్యవిద్యా శాఖ బాధ్యతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అప్పగించడంతో రిమ్స్‌లో చదువులు సాగిస్తున్న విద్యార్థుల్లో ఉన్న అనుమానాలు పటాపంచలై ఆశలు రేగాయి. నిన్నటి వరకు రిమ్స్ అనుమతులపై ఎం.సి.ఐ. బృందం ఎటువంటి కొర్రీలు వేస్తుందోనన్న భయం విద్యార్థులను వెంటాడుతూ వచ్చింది. అయితే మురళీమోహన్ అదే మంత్రిత్వ శాఖకు బాధ్యులుగా వ్యవహరించడంతో జిల్లాకు మరింత కలిసొచ్చే అంశం. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎం.సి.ఐ. బృందం రిమ్స్‌ను బుధవారం సందర్శించనున్నది. ఐదో ఏట కోర్సుకు అనుమతులపై ఈ బృందం ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించనుందో.. దీనిపై మంత్రి కోండ్రు కృషి ఏమేరకు ఫలిస్తుందోనన్న చర్చ వాడిగావేడిగా సాగుతోంది. విద్యాధికుడైన మురళీమోహన్ విద్యార్థుల భవితవ్యానికి ఊతమిచ్చేలా ఎం.సి.ఐ. బృంద ప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించి పూర్తి అనుమతుల కోసం కృషి చేస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశలు పెంచుకుంటున్నారు. జిల్లా పౌరులకు మెరుగైన వైద్యసేవలు, రాజీవ్ గాంధీ వైద్య కళాశాలలో ఐదవ సంవత్సరం వైద్య విద్య అనుమతి మంజూరు కోసం ఎం.సి.ఐ. బృందం బుధవారం, గురువారం రిమ్స్‌ను సందర్శించి పరిశీలించనున్నది. గత ఏడాది అభ్యంతరాలతోపాటు ఈ ఏడాది వైద్య విద్యకు అవసరమగు నిర్మాణాలను వౌళిక సదుపాయాలను బృందం పరిశీలించనున్నట్లు తెలిసింది.
2008 జనవరి 2వతేదీన రిమ్స్‌కు శంకుస్థాపన జరిగిన నాటినుండి నాలుగు సార్లు రావాల్సిన ఎం.సి.ఐ. బృందం అధికారుల అలసత్వం నిర్మాణాలలో నిర్లక్ష్యం కారణంగా తొమ్మిది సార్లు రావాల్సి వచ్చింది. 2008లో మొదటి సంవత్సరం వందసీట్లు అనుమతికి ఒకసారి, 2009లో రెండవ సంవత్సరం అనుమతికి మూడుసార్లు, 2010లో మూడవ సంవత్సరం రెండు సార్లు, 2011లో నాల్గవ సంవత్సరం అనుమతికి మూడు సార్లు పర్యటించింది. గత సంవత్సరం ముఖ్యంగా కళాశాల ఆడిటోరియం, విద్యార్థినీ, విద్యార్థుల ఆటస్థలం, వసతి గృహాల నిర్మాణాలు జరుగనందుకు నాలుగవ ఏడాది వైద్యవిద్యకు అనుమతులు మంజూరులో ఒకింత కఠినంగా వ్యవహరించింది. ఇది ఎంతటికి దారితీసిందంటే జిల్లాకు వచ్చిన అపూర్వ అవకాశం చేజారిపోకూడదన్న పట్టుదలతో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలు కిల్లికృపారాణి నాడు ఎంతగానో కృషి చేసిన విషయం తెలిసిందే. ఎం.సి.ఐ. బృందం సూచించిన వౌలిక వసతులు కల్పించడంలో అధికారులు అలసత్వం వహించడమే ఇందుకు కారణం.
రిమ్స్ కళాశాలకు అనుబంధంగా జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిని అప్పజెప్పడంతో ఆసుపత్రి కోసం 13 బ్లాక్‌ల నిర్మాణం జరగాల్సి ఉంది. నేటికి ఆరు బ్లాక్‌లను మాత్రమే నిర్మించి అప్పజెప్పగా మిగతా ఏడు బ్లాక్‌లు ప్రారంభ దశలోనే ఉన్నాయి. నిర్మాణం జరిగిన ఆరు బ్లాక్‌లలో కూడా పారిశుద్ధ్యంపై జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామ్‌రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ రోడ్లు, మురికి కాలువల నిర్మాణంపై అధికారుల నిర్లక్ష్యం ఎత్తిచూపడంతో పనులు ఓ కొలిక్కి వచ్చాయి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా పలుసార్లు ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనుల జాప్యంపట్ల చొరవ తీసుకుని అధికారుల అలసత్వంపై మండిపడుతూ పలు సూచనలు, సలహాలు జారీచేసి రిమ్స్‌ను ఓ గాడిలో కలెక్టర్ పెట్టడంలో కృత్యకృత్యులయ్యారు. ఇప్పటికే విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాసి ప్రీఫైనల్‌కు సిద్ధంగా ఉన్నారు. వీరి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఎం.సి.ఐ. బృందం సానుకూలంగా వ్యవహరించే అవకాశం కూడా లేకపోలేదు. జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకుల కృషి, విద్యాసంవత్సరం చివరి దశలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఒకే ప్రయత్నంలో అనుమతుల మంజూరుకు ఎంతవరకు తోడ్పడుతుందో వేచిచూడాల్సిందే.

దిగజారుడు రాజకీయాలు తగదు
* జిల్లా కాంగ్రెస్ ప్రతినిధులు
బలగ, శ్రీకాకుళం 21: తెలుగుదేశం పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు డి.ఎస్.కె.ప్రసాద్, ముస్తాక్ అహ్మద్, రత్నాల నరిసింహమూర్తి, పి.జీవరత్నం హితవు పలికారు. మంగళవారం స్థానిక ఇందిరావిజ్ఞాన భవనంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం, కనె్నధార విషయాలపై గగ్గోలు పెట్టిన దేశం నాయకులకు సరైన సమాధానం లభించడంతో ఏం చేయాలో తెలియక మంత్రి ధర్మాన కుమారుడు రామ్‌మనోహరనాయుడుపై పడ్డారని విమర్శించారు. ఈ నెల 19వతేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన రామ్‌మనోహరనాయుడి రిసెప్షన్‌పై దేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారని, చట్టానికి వ్యతిరేకంగా పనులు జరిగాయని మాట్లాడడం తగదన్నారు. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, ఆర్.సి నంబర్ 50/ఓపి/2-2009 ప్రకారం ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని ముందస్తు అనుమతితో వాడుకోవచ్చని తెలిపారు. దానికి అనుగుణంగానే తాము జూలై 24వతేదీన దరఖాస్తు చేయగా జూలై 26వతేదీన కళాశాల అధికారులు అనుమతి మంజూరు చేశారని తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం దేశం పార్టీ నేతలకు అలవాటుగా మారిందని, అవసరమైతే సమాచార హక్కు చట్టంద్వారా వివరాలు తెలుసుకోవచ్చని హితవు పలికారు. రోడ్డుపై ఎక్కడో జరిగిన ప్రమాదాన్ని మంత్రి ధర్మానకు అంటగట్టడం దేశం నాయకుల పనికిమాలిన రాజకీయాలకు పరాకాష్టగా పేర్కొన్నారు. విఆర్వో, విఆర్‌ఏ నోటిఫికేషన్ రాకముందే మైదానం అనుమతులు తీసుకున్నామని, దీనిపై మంత్రి ధర్మానకు బాధ్యత వహించమనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తమ్మినేని మంత్రిగా ఉండగా మున్సిపల్ మైదానంలో వివాహం చేసుకున్నారని, అచ్చెన్నాయుడు శాసనసభ్యునిగా వివాహం చేసుకున్నారని, ఈ పెళ్ళిళ్లకు ఎంతవరకు నిబంధనలు పాటించారో తెలియజేయాలని కోరారు. బలమైన నాయకత్వం కలిగిన ధర్మాన ప్రసాదరావు స్థాయిని చూడలేక నీతిమాలిన రాజకీయాలు చేయడం దేశం నాయకులకు తగదని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.

ర్యాంకులే లక్ష్యంగా గురుకుల
విద్యార్థులకు తర్ఫీదు
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 21: ప్రతియేటా పదోతరగతి పరీక్షల్లో జిల్లా ఖ్యాతిని రాష్టస్థ్రాయిలో ఇనుమడింపజేయడం లో ఎస్.ఎం.పురం ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు అగ్రభాగంలో నిలవడం పరిపాటి. గత ఏడాది పదోతరగతి పరీక్షల్లో 585 నుంచి 580లోపు మార్కులు ఆరుగురు విద్యార్థులు సా ధించి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ స్కూ ల్ విభాగంలో ముందు భాగంలో నిలిచారు. అదేతరహా ఫలితాలు ఈ ఏడాది సాధించేందుకు 38 మంది విద్యార్థులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ఏడాది ఇంగ్లీషు మీడియంలో మొదటిసారి పరీక్షలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుండే సన్నద్దవౌతున్నారు. ప్రిన్సిపాల్ బొడ్డేప ల్లి లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులతో ప్రణాళికాబద్దంగా పరీక్షల్లో అధిక మా ర్కులు సాధించేందుకు తర్ఫీదు ఇచ్చే లా కార్యాచరణ రూపొందించారు. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 25వతేదీ వరకు షెడ్యూల్డ్ ప్రాప్తికి 25మార్కులు ఒక్కంటికి రెండు పరీక్షలు ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి వీరికి ఫ్రీఫైనల్ పరీక్షలు పబ్లిక్ తరహాలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశా రు. విద్యార్థులు మానసిక ఆందోళనకు గురికాకుండా ప్రధాన ఆచార్యులతో పాటు కొంతమంది అధ్యాపకులు కౌనె్సలింగ్ ఇప్పటినుంచే నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో మనోవికాసం పరిణితి చెం దేలా తర్ఫీదు ఇస్తున్నారు. గత ఏడాది కంటే అత్యధికంగా మార్కులు సొం తం చేసుకునేలా పదోతరగతి విద్యార్థులను తీర్చిదిద్దేలా జాగ్రత్తలు పాటిస్తున్నామని ప్రధానాచార్యుడు లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

* వారానికి మూడు రోజులు * కార్మికులకు ఇబ్బందులు
english title: 
power troubles

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>