ఆర్మూర్, ఫిబ్రవరి 21: క్వింటాల్ ఎర్రజొన్నలకు 2500 రూపాయల ధర ఇవ్వాల్సిందేనని, ఈ విషయంలో సీడ్ కంపెనీల వ్యాపారులు చొరవ తీసుకోవాలని రైతు ప్రతినిధులు అన్నారు. మంగళవారం ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వారు విలేఖరులతో మాట్లాడారు. ఎర్రజొన్నలకు మద్దతు ధర కల్పించే విషయంలో జిల్లా కలెక్టర్ వరప్రసాద్‌ను కలిసి విన్నవించామని అన్నారు. బళ్లారి ప్రాంతంలో క్వింటాల్‌కు 2200 రూపాయల ధర చెల్లించిన సీడ్ వ్యాపారులు ఆర్మూర్ ప్రాంతానికి వచ్చే సరికి 1600 నుంచి 1800 రూపాయల ధరకు తగ్గించి వేశారని వారు చెప్పారు. ఆర్మూర్ ప్రాంతంలోని సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నిలువునా ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు 500 రూపాయల ధర తేడా ఉండడం విచారకరమన్నారు. బళ్లారి ప్రాంతం కంటే ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్న పంట నాణ్యంగా ఉంటుందని, ఇది తెలిసీ కూడా సీడ్ వ్యాపారులు ధర ఎక్కువగా పెట్టడం లేదని అన్నారు. ధర నిర్ణయం అయ్యే వరకు లారీల్లో ఎర్రజొన్నలను రవాణా చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇప్పించే విషయంలో ప్రభుత్వానికి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శికి నివేదిక పంపించినట్లు కలెక్టర్ చెప్పారన్నారు. అయితే సీడ్ వ్యాపారులతో నేరుగా చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కలెక్టర్ సూచించారని అన్నారు. దీంతో బుధవారం ఉదయం 11 గం.కు ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో సీడ్ కంపెనీల వ్యాపారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా ఎడ్ల రాజిరెడ్డి ఖరారు
నిజామాబాద్, ఫిబ్రవరి 21: జిల్లాలోని కామారెడ్డి శాసనసభా నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎడ్ల రాజిరెడ్డి తలపడనున్నారు. అనేక తర్జనభర్జనల అనంతరం అధిష్ఠానం రాజిరెడ్డికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డిసిసిబి) చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కామారెడ్డి సెగ్మెంట్ పరిధిలోని భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన ఎడ్ల రాజిరెడ్డి 1978నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, షబ్బీర్‌అలీకి ముఖ్య అనుచరుడిగా చెలామణి అవుతున్నారు. అంతకుముందు ఆయన కామారెడ్డి సెగ్మెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఐదేళ్ల పాటు దోమకొండ సమితి వైస్ ప్రెసిడెంట్‌గా, అనంతరం అప్పటి అధ్యక్షుడు గోపాల్‌రావు దీర్ఘకాలం సెలవు పెట్టడంతో ఏడాదిన్నర పాటు ఇంచార్జ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం అప్పటి హేమాహేమీ నాయకులు చెన్నారెడ్డి, బాల్‌రెడ్డి, బాలాగౌడ్‌ల ఆశీస్సులతో 1982లో మొదటిసారి డిసిసిబి చైర్మన్‌గా ఎన్నికై 1985వరకు రాజిరెడ్డి ఆ పదవిలో కొనసాగారు. తాజాగా 2006లో జరిగిన సహకార ఎన్నికల్లోనూ రామేశ్వర్‌పల్లి సింగిల్‌విండో చైర్మన్‌గా గెలుపొందిన మీదట షబ్బీర్‌అలీ ప్రోద్బలంతో మరోమారు డిసిసిబి చైర్మన్ పదవిని చేపట్టారు. ప్రస్తుతం రాజకీయ జీవితం చరమాంక దశకు చేరుకున్న తరుణంలో ఆయనకు అధికార పార్టీ తరఫున చట్టసభకు పోటీ చేసే అవకాశం లభించింది. ఎస్సెస్సీ వరకు విద్యనభ్యసించిన ఎడ్ల రాజిరెడ్డి, సహకార విభాగంలో డిప్లొమా సైతం చేశారు. ఆయనకు సతీమణి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వాస్తవానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి షబ్బీర్‌అలీ విముఖత ప్రదర్శించడంతో ఆయన స్థానంలో పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు ముగ్గురు నేతలు తమవంతు ప్రయత్నాలు చేశారు. ఎడ్ల రాజిరెడ్డితో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్, లోయపల్లి నర్సింగ్‌రావులు పార్టీ టిక్కెట్ రేసులో కొనసాగారు. వీరిలో నర్సింగ్‌రావుకు అభ్యర్థిత్వం దక్కవచ్చని పలువురు భావించినప్పటికీ, షబ్బీర్‌అలీ చొరవతో అధిష్ఠానం రాజిరెడ్డి వైపే మొగ్గు చూపింది. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ ఎలాంటి మచ్చ లేని నాయకుడిగా, పార్టీలో సుదీర్ఘకాలం నుండి కొనసాగుతుండడం వల్లే రాజిరెడ్డికి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. అయితే షబ్బీర్‌అలీ ఉప ఎన్నిక బరిలో లేకపోవడం కాంగ్రెస్ కార్యకర్తలను ఒకింత నిరుత్సాహానికి గురి చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉప ఎన్నికల్లో షబ్బీర్‌అలీ దిగితే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు అవకాశం ఉండేదని పేర్కొంటున్నారు. ఫలితంగానే నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలంతా షబ్బీర్‌కే అభ్యర్థిత్వం కేటాయించాలంటూ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. హైకమాండ్ సైతం షబ్బీర్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోటీకి దిగేందుకు ససేమిరా అనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎడ్ల రాజిరెడ్డికి టిక్కెట్‌ను ఖరారు చేశారు. ఎడ్ల రాజిరెడ్డికి ఎవరితోనూ విభేదాలు లేనందున షబ్బీర్‌అలీతో పాటు జిల్లాకు చెందిన ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైతం ఆయన గెలుపు కోసం తమవంతు కృషి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బరిలో షబ్బీర్‌అలీ లేకపోవడం వల్ల తమ గెలుపు మరింత సునాయాసంగా మారిందని టిఆర్‌ఎస్ శ్రేణుల్లో ముందస్తుగానే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ షబ్బీర్‌అలీ బరిలోకి దిగితే పెద్ద పదవిని చేపట్టవచ్చనే ఆలోచనతో గట్టి పోటీనిచ్చేందుకు ఆస్కారం ఉండేదని, ప్రస్తుతం ఎడ్ల రాజిరెడ్డిని ఎదుర్కోవడం కష్టమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద గత నాలుగైదు రోజుల నుండి కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెర దించుతూ అధిష్ఠానం ఎడ్ల రాజిరెడ్డికి అవకాశం కల్పించడంతో ప్రచారం ఊపందుకోనుంది. ఇప్పటికే టిఆర్‌ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, టిడిపి తరఫున నిట్టు వేణుగోపాల్‌రావుల అభ్యర్థిత్వాలు ఖరారైన విషయం విదితమే.
బిఆర్‌జిఎఫ్ గ్రామ సభలకూ ఎన్నికల కోడ్
* మార్చి నెలాఖరు వరకు ప్రగతి పనులు లేనట్టే
నిజామాబాద్, ఫిబ్రవరి 21: జిల్లాలో ప్రతిఏటా జరుగుతున్న ఉప ఎన్నికలు అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం కనబరుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గడిచిన 2008వ సంవత్సరం నుండి నిజామాబాద్‌లో యేటేటా క్రమం తప్పకుండా చట్టసభలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. 2008లో ఎల్లారెడ్డి, డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కొనసాగగా, 2009లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఏడాది కాలం సైతం గడువకముందే 2010లో మరోమారు నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఆ మరుసటి ఏడాదే 2011లో బాన్సువాడ నియోజకవర్గంలో ఉప పోరు సందడి కొనసాగింది. తాజాగా ప్రస్తుతం కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ఇలా ఒకటి, రెండు నియోజకవర్గాలకు ప్రతిఏటా ఎన్నికలు అనివార్యంగా మారడం వల్ల ఎన్నికల నియమావళి(కోడ్) అమల్లోకి వస్తూ ప్రతీసారి రెండుమూడు మాసాల పాటు అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. కామారెడ్డి ఉప ఎన్నికకు ఈ నెల 16వ తేదీన షెడ్యూల్ ప్రకటించడంతో, ఆ రోజు నుండే ఎన్నికల కోడ్‌ను అమల్లోకి తెచ్చారు. జిల్లా అంతటా కొత్త పథకాలను చేపట్టడం, వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలకు నిధుల మంజూరీలు, మంత్రులు, ఇతర విఐపిల పర్యటనలన్నీ నిలిచిపోయాయి. భూ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న గ్రామ రెవెన్యూ సదస్సులను అటకెక్కిస్తూ అర్ధాంతరంగా నిలిపివేశారు. తాజాగా బిఆర్‌జిఎఫ్ పథకం కింద రానున్న ఐదేళ్లలో చేపట్టదల్చిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనులను గుర్తించే ప్రక్రియ సైతం ఎన్నికల కోడ్ పుణ్యమా అని వాయిదా పడింది. 2012-13 నుండి 2016-17 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో జిల్లాలో గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయిలలో బిఆర్‌జిఎఫ్ నిధులతో చేపట్టదల్చిన పనులకు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించేందుకు ఇటీవలే కసరత్తులు ప్రారంభించారు. పక్షం రోజుల క్రితం ఈ ప్రతిపాదనల రూపకల్పన విషయమై చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. గ్రామ సభలను నిర్వహించి ఏయే పనులను చేపట్టాలన్నది ప్రజల ఆమోదం మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల నేతృత్వంలో గ్రామసభలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. అంతేకాకుండా 2011-12ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు చేపట్టాల్సి ఉన్న పెండింగ్ పనులను సైతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంకల్పించారు. మార్చి మాసాంతంలోపు వీటిని ఖర్చు చేయని పక్షంలో నిధులు మురిగిపోయే ప్రమాదం ఉండడంతో గడువులోపు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని భావించారు. ఈ క్రమంలోనే కామారెడ్డి ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించడం, 22వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుండడంతో ఈ పనులన్నింటికి ఎలక్షన్ కోడ్ అడ్డుగా మారింది. బిఆర్‌జిఎఫ్ నిధులతో వచ్చే ఐదేళ్లలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన ప్రక్రియను కామారెడ్డి ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు వాయిదా వేస్తున్నామని కలెక్టర్ డి.వరప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిఆర్‌జిఎఫ్ కింద మంజూరయ్యే నిధులతో జిల్లాలోని ప్రతిపాదించిన ప్రాంతాల్లో రహదారులు, లింకు రోడ్లు వంటి పనులను చేపట్టాల్సి ఉందన్నారు. అయితే ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్నందున ఈ పనులను చేపట్టాలా వద్దా అన్నది నిర్ధారించుకునేందుకు ఎన్నికల సంఘానికి లేఖ రాయగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున గ్రామ సభలు నిర్వహించరాదని ఎలక్షన్ కమిషన్ సూచించిందన్నారు. ఇ.సి ఆదేశాల మేరకు ప్రస్తుతం బిఆర్‌జిఎఫ్ పనుల గుర్తింపు కోసం నిర్వహించదల్చిన గ్రామ సభలను వాయిదా వేస్తున్నామని, మార్చి 25వ తేదీ అనంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తామని కలెక్టర్ వరప్రసాద్ పేర్కొన్నారు.
ఎర్రజొన్న వ్యాపారుల దోపిడీని అరికట్టాలి
కలెక్టర్‌కు రైతుల వినతి
కంఠేశ్వర్, ఫిబ్రవరి 21: ఎర్రజొన్న విత్తన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారులు చేస్తున్న దోపిడిని అరికట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ డి.వరప్రసాద్‌ను క్యాంప్ కార్యాలయంలో కలిసిన రైతులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఎర్రజొన్న రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, జిల్లాలో 35వేల ఎకరాల్లో ఎర్రజొన్న పంటను పండిస్తున్నారని అన్నారు. గత సంవత్సరం క్వింటాలు ఎర్రజొన్నలకు 2,200నుండి 2,600రూపాయల వరకు కనీస మద్దతు ధర ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుతం సీడ్స్ వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను దోచుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే క్వింటాలు ఎర్రజొన్నకు కేవలం 1600రూపాయలు మాత్రమే నిర్ణయించారని అన్నారు. గ్రామాల్లో తమ ఎజెంట్ల ద్వారా రైతుల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధానాలను అవలంభిస్తున్నారని అన్నారు. మార్కెట్‌లో ఎర్రజొన్న పంటకు ధర లేదని కొంతమంది రైతుల్ని నమ్మించి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మొదట్లో వ్యాపారులు క్వింటాళుకు 1,975రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారని, క్రమంగా ధరను తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీనివల్ల ఎర్రజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒకవైపు 11కోట్ల రూపాయల ఎర్రజొన్న పంట బకాయిలను ఇవ్వకపోగా, ప్రస్తుతం వ్యాపారుల సిండికేట్ విధానం వల్ల పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉందని అన్నారు. అందువల్ల ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్న పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. లేదంటే సీడ్స్ వ్యాపారుల వద్ద కనీస మద్దతు ధర ఇప్పించాలని విన్నవించారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ ఇతర రాష్ట్రాలలో ఎర్రజొన్న పంటకు లభిస్తున్న మద్దతు ధర వివరాలను సేకరించి, రైతుల సమస్యల పరిష్కారం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అనంతరం ఎర్రజొన్న రైతులు ఆర్ అండ్ బి అతిథి గృహంలో సమావేశమై ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్మూర్, బాల్కొండ, నందిపేట, జక్రాన్‌పలిల, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, భీమ్‌గల్ తదితర 8మండలాలకు చెందిన ఎర్రజొన్న రైతుల ప్రతినిధులు పాల్గొన్నారు.
టిడిపి, కాంగ్రెస్ తెలంగాణ ద్రోహులు
కామారెడ్డి, ఫిబ్రవరి 21: తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ద్రోహులని, ఆ పార్టీలకు నిజంగా చిత్తశుద్ది ఉండి ఉంటే నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చేదని సిరిసిల్లా ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు. మంగళవారం జరిగిన టిఆర్‌ఎస్ పార్టీ సెగ్మెంట్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కట్టుబడి ఉన్న పార్టీ టిఆర్‌ఎస్ అని అన్నారు. టిఆర్‌ఎస్ వల్లే ఉద్యమం ఈరోజు ఇంత ఉద్ధృత స్థాయికి చేరిందన్నారు. టిఆర్‌ఎస్‌లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని అన్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. కామారెడ్డి టిఆర్‌ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్‌ను విజయం ముఖ్యం కాదని, భారీ మెజార్టీ సాధించి, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యేలా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్తున్నారో ప్రజలే ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు. తెలంగాణ తెచ్చెది, ఇచ్చేది మెమె అంటూ, తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని అన్నారు. అనంతరము బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ ఉప ఎన్నికల్లో గంపను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలకు ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని అన్నారు. బాన్స్‌వాడలో తెలంగాణ ప్రజలు తాను టిడిపికి ఎమ్మెల్యే పదవికి తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేస్తే, తెలంగాణ ప్రజలు తనను అభిమానించి అక్కడి ఉప ఎన్నికల్లో తనను గెలిపించారని, అలాగే ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లో రవీందర్‌రెడ్డిని గెలిపించారని అన్నారు. ఇప్పుడు గంపగోవర్ధన్‌ను కనివిని ఎరగని రీతిలో భారీ మెజార్టీతో కామారెడ్డి సెగ్మెంట్ ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. అనంతరము టిఆర్‌ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్ మాట్లాడుతూ, తాను తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టిడిపికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశానని, కామారెడ్డి సెగ్మెంట్ ప్రజలకు తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాల్లో తెలంగాణ వాదాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టిఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగుర రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి ఉప ఎన్నికల్లో గంపగోవర్ధన్‌ను తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీ పెద్దల కండ్లు తెరిపిస్తారని అన్నారు. ఈసమావేశంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు ముజీబొద్దిన్, భూంరెడ్డి, తిర్మల్‌రెడ్డి, రాజగౌడ్, రమేశ్‌గుప్తా, మామిండ్ల రమేశ్‌తో పాటు నాల్గు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆందోళనకు నేతృత్వం వహించినందుకే ఇబ్బందులు
ఆరు నెలలుగా షార్జాలో అవస్థలు
మోర్తాడ్, ఫిబ్రవరి 21: వీసాలు పొడగించక, సకాలంలో వేతనాలు ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్న కంపెనీల యాజమాన్యాలపై కోర్టుకు వెళ్లినందువల్లే తమను స్వస్థలాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని షార్జాలోని పలువురు భారతీయులు వాపోయారు. ఆరు మాసాలుగా రోడ్లపై పడేసిన చెత్తను ఏరుకుని, అమ్ముకుని పొట్టబోసుకుంటున్నామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధితులు వాపోతున్నారు. షార్జాలోని ఖరం జనరల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో దాదాపు 200మంది కార్మికులు పని చేసేవారు. ఇందులో రాష్ట్రానికి చెందిన నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు కూడా ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కంపెనీలో చేరిన కార్మికులకు రెండు సంవత్సరాలకు వీసా గడువు పూర్తయ్యింది. నియమాల ప్రకారంగా వారిని కంపెనీలో కొనసాగించుకోవాలంటే సదరు కంపెనీ యాజమాన్ని వీసా గడువును పొడగించాల్సి ఉంటుంది. అయితే వీసా ముగిసినప్పటికీ, గడువు పొడగించకుండానే కార్మికులతో పని చేయించుకున్న కంపెనీ వేతనాలు మాత్రం సకాలంలో అందించలేదు. దీంతో అక్కడి లేబర్ కోర్టును కార్మికులు ఆరు మాసాల క్రితం ఆశ్రయించారు. కోర్టు తీర్పు కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా వస్తుందన్న సమాచారంతో యాజమాన్యం బాధిత కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, కేసును ఉపసంహరించేలా కృషి చేసింది. దానిని నమ్ముకున్న కార్మికులకు నిరాశే మిగిలింది. గడిచిన ఆరు మాసాలుగా తాము ఇక్కట్లతోనే బ్రతుకు వెళ్లదీస్తున్నామని బాల్కొండ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన రాజేశ్వర్ అనే కార్మికుడు స్థానిక విలేఖరులతో ఫోన్‌లో వాపోయాడు. ఆయన అందించిన సమాచారం మేరకు, షార్జాలోని భారతీయ ఎంబసి అధికారుల చొరవతో ఇప్పటి వరకు చాలమందిని స్వగ్రామాలకు పంపించి వేశారని తెలిపారు. అయితే కోర్టుకు వెళ్లిన తనతో పాటు మరో 20మందిని కంపెనీ యాజమాన్యం అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని రాజేశ్వర్ వాపోయాడు. ఇటీవల షార్జాకు వచ్చిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మధుగౌడ్ యాష్కీతో నేరుగా కలిసి, పూర్తి పరిస్థితిని వివరించి సమస్యను ఏకరవు పెట్టుకున్నామన్నాడు. త్వరలోనే భారత ప్రభుత్వంతో మాట్లాడి తామందరిని స్వగ్రామానికి పంపించేలా కృషి చేస్తానని ఎంపి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం కంపెనీలో పని చేయడానికి యాజమాన్యం ఒప్పుకోవడం లేదని, పొట్టపోసుకోవడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో అక్కడి పార్కుల్లోనూ, రోడ్లపైన స్క్ఫ్రా వస్తువులను సేకరించి, వ్యాపారులకు అమ్ముకుని, వచ్చిన నగదుతో కాలం వెళ్లదీస్తున్నామని ఆయన వాపోయాడు. ప్రస్తుతం తమ గ్రూపులో 10మంది వరకు తెలుగువారు ఉన్నారని, మిగతా వారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారని రాజేశ్వర్ తెలిపారు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం షార్జాలోని ఎంబసి అధికారులతో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూడాలని, స్వగ్రామాలకు తిరిగి వచ్చేలా సహకరించాలని బాధితులు వేడుకుంటున్నారు.
ముందుచూపుతోనే
ఉప పోరుకు దూరమైన షబ్బీర్‌అలీ
నిజామాబాద్, ఫిబ్రవరి 21: సాధారణంగా చట్టసభలకు జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థిత్వాలను దక్కించుకునేందుకు ముఖ్య నేతలంతా ఉవ్విళ్లూరుతూ, అధిష్ఠానాల అనుగ్రహం పొందేందుకు తుదికంటా ప్రయత్నాలు సాగిస్తారు. అందులోనూ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గాలకు ఎన్నిక వస్తే, నేతల హడావుడికి అంతే ఉండదు. అలాంటిది ప్రస్తుతం ఉప ఎన్నిక రూపంలో కామారెడ్డి శాసనసభా నియోజకవర్గానికి అవకాశం లభించగా, అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అదే సెగ్మెంట్‌కు చెందిన మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్‌అలీ మాత్రం విముఖత కనబర్చి ఉప పోరుకు దూరంగా ఉండిపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఉప పోరు బరిలో తాను కానీ, తన కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయరంటూ షబ్బీర్‌అలీ తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటూ, తన స్థానంలో ఎంతో నమ్మకస్థుడిగా వ్యవహరిస్తున్న డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డికి పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేయించారు. అయినప్పటికీ కార్యకర్తలు మాత్రం ఇప్పటికీ షబ్బీర్‌అలీ అభ్యర్థిత్వానే్న బలంగా కోరుకుంటున్నారు. గత రెండు రోజుల క్రితం సిఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, పిసిసి చీఫ్ బొత్స, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, జిల్లా ఇంచార్జ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు షబ్బీర్‌అలీని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయారు. వాస్తవానికి షబ్బీర్‌అలీ వ్యూహాత్మకంగానే పోటీ చేసే విషయంలో బెట్టును ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలూ తెరపైకి వచ్చాయి. అయితే ఆయన వాస్తవంగానే పోటీకి దూరంగా ఉండిపోవడం, ఎడ్ల రాజిరెడ్డికి టిక్కెట్ ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఒకింత విస్మయానికి లోనయ్యారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే షబ్బీర్‌అలీ ముందుచూపుతోనే ఉప ఎన్నికలకు దూరంగా ఉండిపోయారని స్పష్టమవుతోంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు ఓటమిని చవిచూసిన దృష్ట్యా, ప్రస్తుత ఉప ఎన్నికలోనూ పరాభవం ఎదురైతే ప్రతిష్ఠ మరింతగా మసకబారుతుందని, అది రాజకీయ భవితవ్యంపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశ్యంతోనే షబ్బీర్‌అలీ పోటీ చేసే ఆలోచనను దరి చేరకుండా కఠిన నిర్ణయానికి కట్టుబడినట్టు తెలుస్తోంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కామారెడ్డి సెగ్మెంట్‌లో తెలంగాణ సెంటిమెంటు ప్రభావం ఇంకాస్త ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇది కూడా షబ్బీర్‌అలీ పోటీకి దూరంగా ఉండేందుకు ఒక కారణమని భావిస్తున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేసిన షబ్బీర్‌అలీ, అప్పటి టిడిపి అభ్యర్థిగా బరిలో నిలిచిన గంప గోవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఏడాది కాలానికే జరిగిన ఉప ఎన్నికల్లోనూ మరోమారు షబ్బీర్‌అలీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కామారెడ్డికి పొరుగున ఉన్న ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మరోమారు పోటీకి దిగి ఓడిపోతే ప్రతిష్ఠ మసకబారే ప్రమాదం ఉందనే ఆందోళన వెంటాడడం వల్లే షబ్బీర్‌అలీ పోటీకి దూరంగా ఉండిపోయారని స్పష్టమవుతోంది. అయితే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఎంతోకొంత చరిష్మా కలిగిన షబ్బీర్‌అలీ తన సొంత సెగ్మెంట్‌లో బరిలోకి దిగకుండా ఇతరులకు అవకాశం కల్పించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు కాంగ్రెస్ నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఎన్నికలకు ముందే ఓటమి భయంతో దూరంగా ఉండిపోయారనే వాదన తెరపైకి వస్తుందని, ప్రత్యర్థి పార్టీలు ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయనే ఆందోళన వారిని వెంటాడుతోంది. షబ్బీర్‌అలీ మాత్రం వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను నిలుపుకునేందుకు, రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఉప పోరుకు దూరంగా ఉండిపోయారు. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి కొద్ది రోజుల ముందు నుండే షబ్బీర్‌అలీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, హోంమంత్రి సబితాఇందారెడ్డిలను సెగ్మెంట్‌కు రప్పించి ఎన్నికల ప్రచారాన్ని తలపించే రీతిలో అట్టహాసంగా సభలు నిర్వహించడం, ఎంపి సురేష్‌శెట్కార్ కోటా నుండి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించడం, ఒకటిరెండు మండలాల్లో యువజన, కుల సంఘాలకు సైతం పంపకాల పర్వం జరిపినట్టు ప్రచారమవుతుండడం షబ్బీర్‌అలీ పోటీలో ఉంటారనే వాదనలకు బలం చేకూర్చింది. అధిష్ఠానం ఒత్తిడితో ఆయనే ఉప పోరు బరిలోకి దిగడం ఖాయమని పార్టీ శ్రేణులంతా భావించినప్పటికీ, షబ్బీర్‌అలీ మాత్రం ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయరాదనే తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో హైకమాండ్ ఎడ్ల రాజిరెడ్డికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.