మైలవరం, ఫిబ్రవరి 21: ప్రేక్షకులను మెప్పించటంకోసం కళాకారుడు స్టేజిపై అనేక పాట్లుపడతాడని, నిజ జీవితంలో వారి పాట్లు అంతకు రెట్టింపు ఉంటాయని ప్రముఖ సినీనటి, ‘అల్లరి సుభాషిణి’ ఆవేదన వ్యక్తం చేశారు. వెల్వడం ఉత్సవాల్లో భాగంగా భక్త చింతామణి నాటకంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఆమె స్థానిక పంచాయతీ అతిధి గృహంలో మంగళవారం కొద్దిసేపు పాత్రికేయులతో ముచ్చటించారు. నిజ జీవితంలో కళాకారుడు తింటానికి తిండికూడా లేక కడు దారిద్య్రాన్ని అనుభవిస్తున్నాడని వారే అసలైన కళాకారులని, వారిని గుర్తించకుండా క్రీడాకారులకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు అవార్డులు ఇవ్వటం బాధాకరమన్నారు. గ్లామర్‌కు, డబ్బుకే కళారంగంలో అధిక ప్రాధాన్యత ఉండటం శోచనీయమన్నారు. గ్లామర్‌గా కనిపిస్తున్న సినీ ప్రపంచంలో ఎందరో అభాగ్యుల జీవితాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయన్నారు. అటువంటి కళాకారులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
సినీ జీవితానికి నాటక రంగమే పునాది
తన సినీ జీవితానికి నాటక రంగమే పునాది అని సుభాషిణి అన్నారు. కళారంగం పట్ల మక్కువ పెరగటానికి సినీనటి వాణిశ్రీ తనకు స్ఫూర్తి అన్నారు. ఆమె స్ఫూర్తితోనే దాదాపు 10వేల నాటకాల్లో, సుమారు 70 సినిమాల్లో నటించినట్లు తెలిపారు. చింతామణి నాటకంలో చింతామణి, తులాభారం నాటకంతో సత్యభామ పాత్రలు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయన్నారు. దీని ద్వారానే అల్లరి సినిమాలో నటించానని తనకు ఈ సినిమాలోనే తనకు మంచి పేరు వచ్చిందన్నారు. అక్కడినుండే తన ఇంటిపేరు అల్లరిగా పాపులర్ అయిందన్నారు. అదే స్ఫూర్తితోనే కితకితలు, మహాత్మా, శ్రీ ఆంజనేయం, అమ్మాయిలు, అబ్బాయిలు, ఎవడిగోల వాడిది, కాంచనమాల, కేబుల్ టీవి, మనీ మనీ మోర్ మనీ, దుబాయ్ శ్రీను వంటి సినిమాల్లో నటిగా తనకు మంచి గుర్తింపు లభించిందన్నారు. ప్రస్తుతం శివగారి దర్శకత్వంలో ఒక సినిమాలో రాక్షసి పాత్ర చేస్తున్నానని, ఈ చిత్రంలో శివాజీ గణేశన్ కుమారుడు ప్రభుతో నటిస్తున్నట్లు చెప్పారు. చింతామణి నాటకం మంచి సందేశాత్మక నాటకమేనని దీనిపై ముఖ్యంగా వైశ్యులు ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాటక రంగానికి ఆదరణ తగ్గిపోయిందని, ఇందుకు కారణం కేబుల్ టివిలు అందుబాటులోకి రావటమేనన్నారు. ఈకారణంగా అనేక మంది స్టేజి కళాకారులు నిత్య దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారన్నారు. కృత్తివెన్నులో నాటకంలో నటించేందుకు వచ్చిన తనకు ఒక జూనియర్ ఆర్టిస్ట్ తనను అక్కా అనారోగ్యంతోనే తాను నాటకంలో నటించేందుకు వచ్చానని, కుటుంబం గడవటం లేదని, వేసుకునేందుకు బట్టలు దానం చేయమని అడిగిందని చెబుతూ సుభాషిణి కన్నీటి పర్యంతం అయింది. ఇటువంటి వారి కోసమైనా నాటక రంగాన్ని, కళాకారులను ప్రోత్సహించాలని ఆమె అభ్యర్థించారు.
అనుమతి లేకుండా
ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
తిరువూరు, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ సమాజ ఆధారిత యాజమాన్య భాగస్వామ్య పథకం కింద జిల్లాలో 25 కోట్ల రూపాయల వ్యయంతో 95 పనులను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వీ తెలిపారు. మంగళవారం తిరువూరు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వీటిలో 43 పనులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. మిగిలిన పనులను సత్వరమే ప్రారంభించి డిసెంబర్ 31లోగా పూర్తి చేస్తామన్నారు. ఈ పథకం కింద తిరువూరు రాకట్టు సప్లై ఛానెల్‌కు 1.13 కోట్లు, కట్టెలేరు సప్లై ఛానెల్‌కు 1.27 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ఈ ఛానెళ్ళ పరిధిలో చేపట్టనున్న పనులను ఆయన పరిశీలించారు. అక్రమంగా ఇసుక, గ్రావెల్ తరలింపు నిరోధానికి గట్టి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. అనుమతులు లేకుండా ఇసుక, గ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక, గ్రావెల్ అక్రమ తరలింపుపై ప్రజలు నేరుగా తనకు గానీ, ఆర్‌డివోకు గానీ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అక్రమ రవాణా జరిగేటపుడు ఫోను ద్వారా ఫిర్యాదు చేస్తే సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచి అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెరువుల వద్దకు సరైన రహదారి సౌకర్యం లేక పలు ప్రాంతాల్లో పొలంగట్లపై కలెక్టర్ నడిచి వెళ్ళారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాకట్టు, కట్టెలేరు డ్యాంలను తనిఖీ చేసిన కలెక్టర్
తిరువూరులోని ఏడు చెరువులకు సాగునీరు అందించే రాకట్టు డ్యాం, సప్లై చానల్, కట్టెలేరు వాగుపై ఉన్న డ్యాం, సప్లై ఛానెళ్లను మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వీ తనిఖీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సమాజ ఆధారిత యాజమాన్య భాగస్వామ్య పథకం కింద రాకట్టు ఛానెల్‌కు 1.13 కోట్లు, కట్టెలేరుకు 1.27 కోట్లు మంజూరు కాగా ఆయా ఛానెళ్ళ పరిధిలో చేపట్టాల్సిన పనులను కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. రెండు డ్యాంలు, సప్లైయ్ ఛానెళ్ళ పరిధిలోని కాలువలు, చెరువులను ఆయన పరిశీలించారు. కట్టెలేరు డ్యాం వద్ద 2,3 యాప్రాన్‌లను, ముత్తగూడెం వద్ద కల్వర్టు వంతెన నిర్మించాలని, కనుగుల చెరువు, తంగెళ్ళవారి కుంటల మధ్య పాడైన సైఫన్ తొలగించి కొత్తది వేయాలని, గ్రావెల్‌తో చెరువు కట్టలను బలోపేతం చేయాలని, దేవ సముద్రం, కనుగుల చెరువు అలుగులను పునర్నిర్మించాలని, కోతుల చెరువు, సోమికుంట చెరువులకు అప్రోచ్ రోడ్డు నిర్మించాలని, చెరువులు అన్నింటికి క్లూయిస్‌లు కొత్తవి ఏర్పాటు చేయాలని, రాకట్టు సప్లై చానల్ ఆయకట్టు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు వెల్లంకి సురేంద్రబాబు, సంఘం మాజీ అధ్యక్షుడు జీడిమళ్ళ వెంకటేశ్వరరావు నేతృత్వంలోని రైతుల బృందం కలెక్టర్‌కు విన్నవించింది. ఆయా పనులను, ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కట్టెలేరు డ్యాం, సప్లై ఛానెళ్ళను పరిశీలించారు. వివిధ పనులను సత్వరమే చేపట్టి గడువులోగా పూర్తి చేసి రైతులకు సక్రమంగా సాగు నీరు అందించాలని ఆయన అధికారులను కోరారు. నూజివీడు ఆర్డీవో బి సుబ్బారావు, ఇరిగేషన్ శాఖ ఇఇ పద్మారావు, ఎస్‌టి శాయి, ఎఇ లక్ష్మి, కట్టెలేరు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు గుళ్ళపల్లి వెంకటరత్నం, పలువురు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైభవంగా మల్లేశ్వరుని
రథోత్సవం
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 21: శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ పి మధుసూదన్‌రెడ్డి వందలాది భక్తులు శంభో శంకర అంటూ భక్తి నినాదాలు చేస్తుండగా ప్రారంభించారు. పాతబస్తీ కెనాల్‌రోడ్‌లో మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా ఈ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్న స్వామివారు సతీసమేతంగా సర్వాభరణాలను ధరించి ఏడు గుర్రాలను అధిరోహించి భక్తకోటికి దివ్య సందర్శనం ఇవ్వటానికి సాయంత్రం నగర పురవీధుల్లోకి విచ్చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులు, శ్రీ భ్రమ రాంబమల్లేశ్వర స్వామి దేవస్థానం (పాతశివాలయం) నుండి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర, శ్రీ భద్రకాళీ, వీరభద్ర స్వామివార్ల, పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వసంతమల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానం (బుద్దావారిగుడి) నుండి శ్రీ గంగాపార్వతీ సమేత మల్లిఖార్జునస్వామి, తదితర దేవత మూర్తుల విగ్రహాలను ఆయా ఆలయ సిబ్బంది పల్లకిలో ఉంచి ఊరేగింపుగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి తీసుసుకొచ్చారు. రథం ముందు భాగంలో పులివేషాలు, మహిళా భక్తుల కోలాటం, సంకీర్తన కార్యక్రమం, భూతభేతాళ నృత్యాలు, కోలాటం, లంబాడ నృత్యం, కర్రసాము తదితర వాటిని కళాకారులు ప్రదర్శిస్తుండగా స్వామివార్ల రథోత్సవ ఊరేగింపు బయలు దేరింది. నగర ఊరేగింపు కార్యక్రమానికి తొలుత సిపి మధుసూదన్‌రెడ్డి, విజయవాడ శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, సత్రం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బాయన హరేశ్వరరావు, బచ్చు వెంకట నరసింహారావు, దుర్గగుడి ఆర్‌జెసి యం రఘునాథ్, శివాలయం కమిటీ చైర్మన్ కాజా శ్రీ లక్ష్మీవెంకట మోహనరావు తదితరులు ఒక వరుసక్రమంలో రథానికి పూజా కార్యక్రమాలను నిర్వహించగా ఈ ఊరేగింపు మహోత్సవం ప్రారంభమైంది. తొలుత రథానికి ప్రత్యేక పూజలు, బలిహరణ తదితర కార్యక్రమాలను అర్చకస్వాములు నియమనిష్ఠలతో నిర్వహించిన తర్వాత స్వామివార్ల రథోత్సవ ఊరేగింపు బయలుదేరింది.
అగ్ని ప్రమాదంలో 5 లక్షల ఆస్తి నష్టం
హనుమాన్ జంక్షన్, ఫిబ్రవరి 21: బాపులపాడు మండలం వేలేరులో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సాయంత్రం సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హనుమాన్‌జంక్షన్ ఫైర్ ఆఫీసర్ కుంచె దేవదానం తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కాసాని సుబ్బారావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి. ఈ సమయంలోనే పక్కనే ఉన్న అతని సోదరులు కోటయ్య, సురేష్ ఇళ్ళతో పాటు పోలగాని గంగరాజు ఇంటికి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమవడంతో పాటు ఇంట్లోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ దేవదానం తెలిపారు. సుబ్బారావు లక్షన్నర, కోటయ్య లక్ష, సురేష్ లక్ష, గంగరాజు ఇంట్లోని ద్విచక్ర వాహనం పాక్షికంగా దగ్ధమవడంతో పాటు లక్షా 20 వేల ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు హనుమాన్ జంక్షన్ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రభుత్వ కార్యాలయంలో
మర్కటమైనా కునుకు కామనే..!
ఉయ్యూరు, ఫిబ్రవరి 21: అవినీతి ఆరోపణలు, ఎసిబి దాడులు వంటి రోజుకో వార్తతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న ప్రస్తుత తరుణంలో ఉయ్యూరు మండల తహశీల్దార్ కార్యాలయాన్ని అధికారి కాని అధికారి ఒకరు మంగళవారం తనిఖీచేసి చూపరులను ఆశ్చర్యచకితులను చేయడమే కాక సిబ్బందికి ముచ్చెమటలు పోయించారు. మధ్యాహ్నం గం.12.45ని. ప్రాంతంలో హఠాత్తుగా కార్యాలయంలో ప్రవేశించిన ఆ అధికారి తహశీల్దార్ గది మినహా కార్యాలయంలోని అన్ని టేబుల్స్‌ను ఒక్కొక్కటిగా పరిశీలించారు. ఆలస్యంగా విధులకు హాజరయ్యే సిబ్బంది వైపు గుర్రుగా చూసారు. ఫైళ్ళను పరిశీలించారు. అనంతరం కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శర్మ టేబుల్ వద్దకు చేరుకున్న ఆ అధికారి అక్కడ కొంతసేపు బైఠాయించారు. ఈలోగా సిబ్బంది తనిఖీ చాలునంటూ ఆ అధికారిని వేడుకున్నారు. బిస్కట్ లంచం ఇచ్చి మరీ బతిమలాడారు. అయినప్పటికీ ఆ అధికారి కార్యాలయం నుంచి నిష్క్రమించకపోవడంతో వారు బెదిరింపులకు పాల్పడ్డారు. వాటికి కూడా లొంగని ఆ అధికారి సీటు మహిమో ఏమో తెలియదుకాని కొంతసేపు నిద్రలోకి జారుకున్నారు. ఇంత జరుగుతున్నా తహశీల్దార్ ఝాన్సీలక్ష్మి ఆ అధికారి తన గదిలోకి రాకముందే పెండింగ్ ఫైళ్ళను చూసేయాలన్నట్లుగా తన పనిలో నిమగ్నమయ్యారు. సుమారు అర్ధగంటపాటు హల్‌చల్ సృష్టించిన ఆ అధికారి నిదానంగా కార్యాలయం నుంచి నిష్క్రమించారు.
ఇంతకీ ఆ పేరులేని అధికారి కాని అధికారి ఎవరని ఆశ్చర్యపోతున్నారా? ఆయనే మర్కట రాజు. మంగళవారం ఓ కోతి ఉయ్యూరు మండల రెవెన్యూ కార్యాలయంలోకి చొరబడి యథేచ్ఛగా సంచరించి విశ్రమించిన వైనమిది.
కమిషనరేట్‌లో పలువురు ఎస్‌ఐల బదిలీ
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 21: కమిషనరేట్‌లో పని చేస్తున్న పలువురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ నగర పోలీసు కమిషనర్ మధుసూదనరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తోట్లవల్లూరులో పనిచేస్తున్న యు రామారావును మాచవరం పోలీస్టేషన్‌కు బదిలీ చేశారు. సిసిఎస్‌లో ఉన్న కె రమేష్‌ను తోట్లవల్లూరుకు, సిసిఆర్‌బిలో పని చేస్తున్న కెఎస్‌ఎన్ మూర్తిని నాలుగో ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. సిఎస్‌బి సిఐ సెల్‌లో పని చేస్తున్న పి కృష్ణ అనే పిఎస్‌ఐని సత్యనారాయణపురంనకు, కృష్ణలంకలో పని చేస్తున్న ఎంఎ హుస్సేన్‌ను పటమట క్రైం విభాగానికి, అదేవిధంగా ఏసిపి అటాచ్‌మెంట్‌లో ఉన్న జి శ్రీనివాస్ అనే పిఎస్‌ఐని కృష్ణలంక స్టేషన్‌కు, సిఎస్‌బిలో ఉన్న ఎన్‌ఎల్‌వి మోహన్‌కుమార్ అనే పిఎస్‌ఐని నున్న స్టేషన్‌ను బదిలీ చేశారు. అదేవిధంగా నాలుగో ట్రాఫిక్ స్టేషన్‌లో పని చేస్తున్న ఆర్‌ఎస్‌ఐ జి శివప్రసాద్‌ను సిటి ఆర్మ్‌డ్ రిజర్వుకు పంపారు. హోంగార్డు యూనిట్‌లో పని చేస్తున్న ఆర్‌ఐ ఎం రామకృష్ణను ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ విభాగంలో నియమించారు. ఉయ్యూరు టౌన్‌లో ఉన్న ఎ శివకుమార్‌ను సత్యనారాయణపురం స్టేషన్‌కు బదిలీ చేశారు.
వైభవంగ రథోత్సవం
సంధ్యా సమయాన వివిధ రకాలైన విద్యుత్ దీపాలు మిరుమిట్లుగొల్పుతుండగా వేలాది మంది భక్తులు హరహర మహాదేవ్... శంభోశంకర అంటూ రెండు చేతులు ఎత్తి సృష్టి స్థితి లయకారుడైన పరమేశ్వరుడ్ని భక్తిశ్రద్ధలతో కీర్తిస్తుండగా సర్వాభరణాలు ధరించిన మల్లేశ్వరస్వామివారు సతీసమేతంగా నగరోత్సవానికి బయలు దేరారు...
ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 21: శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ పి మధుసూదన్‌రెడ్డి వందలాది భక్తులు శంభో శంకర అంటూ భక్తి నినాదాలు చేస్తుండగా ప్రారంభించారు. పాతబస్తీ కెనాల్‌రోడ్‌లో మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా ఈ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకున్న స్వామివారు సతీసమేతంగా సర్వాభరణాలను ధరించి ఏడు గుర్రాలను అధిరోహించి భక్తకోటికి దివ్య సందర్శనం ఇవ్వటానికి సాయంత్రం నగర పురవీధుల్లోకి విచ్చేశారు. తొలుత సత్రం కమిటీ సెక్రటరీ బచ్చు వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో రథాన్ని వివిధ రకాలైన పుష్పాలతో అలకరించి రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులు, శ్రీ భ్రమ రాంబమల్లేశ్వర స్వామి దేవస్థానం (పాతశివాలయం) నుండి శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర, శ్రీ భద్రకాళీ, వీరభద్ర స్వామివార్ల, పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వసంతమల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానం (బుద్దావారిగుడి) నుండి శ్రీ గంగాపార్వతీ సమేత మల్లిఖార్జునస్వామి, తదితర దేవత మూర్తుల విగ్రహాలను ఆయా ఆలయ సిబ్బంది పల్లకిలో ఉంచి ఊరేగింపుగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి తీసుసుకొచ్చారు. ఇక్కడ ఉత్సవ మూర్తులకు దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకస్వామి రాచకొండ సుమంత్‌శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కెనాల్‌రోడ్‌లో ఉన్న రథం వద్దకు ఈ ఊరేగింపు తీసుకొచ్చారు. రథం ముందు భాగంలో పులివేషాలు, మహిళా భక్తుల కోలాటం, సంకీర్తన కార్యక్రమం, భూతభేతాళ నృత్యాలు, కోలాటం, లంబాడ నృత్యం, కర్రసాము తదితర వాటిని కళాకారులు ప్రదర్శిస్తుండగా స్వామివార్ల రథోత్సవ ఊరేగింపు బయలు దేరింది. నగర ఊరేగింపు కార్యక్రమానికి తొలుత సిపి మధుసూదన్‌రెడ్డి, విజయవాడ శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, సత్రం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బాయన హరేశ్వరరావు, బచ్చు వెంకట నరసింహారావు, దుర్గగుడి ఆర్‌జెసి యం రఘునాథ్, శివాలయం కమిటీ చైర్మన్ కాజా శ్రీ లక్ష్మీవెంకట మోహనరావు, ఇవో సంధ్య, శ్రీ వసంత మల్లిఖార్జున స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ బొట్టా భాస్కరరావు, సత్రం కమిటీ ఉపాధ్యక్షుడు నందిపాటి నారాయణరావు, సహాయ కార్యదర్శులు మట్టా వెంకట సుబ్బారావు, డి శంకరరావు, కాజ యజ్ఞనారాయణ, డిసిపి రవీంద్రబాబు తదితరులు ఒక వరుసక్రమంలో రథానికి పూజా కార్యక్రమాలను నిర్వహించగా ఈ ఊరేగింపు మహోత్సవం ప్రారంభమైంది. కెనాల్‌రోడ్ రథం సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపుకు అడుగడుగున స్వామివార్లకు అఖండ స్వాగతం పలికి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఇక్కడ ప్రారంభమైన ఈ ఊరేగింపు నెమ్మదికి వినాయకుడి సెంటర్‌కు చేరుకొంది. అక్కడ నుండి పక్కరోడ్‌లోనికి ప్రవేశించింది. రథంలో ఉన్న ఉత్సవ మూర్తుల విగ్రహాలను అర్చకస్వాములు తిరిగి స్థాన చలం చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. తిరిగి ఊరేగింపు ఆ రోడ్ గుండా సాగి యథాస్థానానికి చేరుకొంది. ఈమహోత్సవాన్ని తిలకించటానికి మంగళవారం సాయంత్రం 4గంటల నుండే వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కెనాల్‌రోడ్ రథం సెంటర్‌కు చేరుకున్నారు. పాతబస్తీ కెనాల్‌రోడ్‌కు అనుసంధానంగా ఉన్న శివాలయం వీధి, నల్లమందు సందు, ఐరన్‌సెంటర్, మార్వాడీగుడి వీధి, మఠం సందు, మసీదువీధి, తదితర వీధుల గుండా ఎటువంటి వాహనాలు కెనాల్‌రోడ్‌లోనికి రాకుండా పోలీసులు మధ్యాహ్నం 3గంటలనుండే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఈ మహోత్సవానికి తిలకించటానికి వచ్చిన భక్తులు విధిగా వారి వారి వాహనాలను పార్కింగ్ చేసి కెనాల్‌రోడ్‌లోనికి వచ్చి ఈ మహోత్సవాన్ని తిలకించారు. విజయకృష్ణా సూపర్ బజారు కమిటీ మాజీ చైర్మన్ అడపా నాగేంద్ర, సమైక్యాంధ్ర సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నరహరశెట్టి శ్రీహరి, కొణిజేటి రమేష్, జిల్లా నాయకుడు కొణిజేటి సురేష్, మాజీ కార్పొరేటరులు సంపర రాంబాబు, బుద్దా జగన్నాథం, శ్రీ దినవహివారి సత్రం కమిటీ చైర్మన్, ఇవో పైలా పాపారావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, దుర్గగుడి దేవస్థానం పిఆర్‌ఓ పి అచ్యుతరామయ్య నాయుడు, వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధులు శ్రీనివాసరావు, కెనడీ, 39వ డివిజన్ అధ్యక్షుడు మనోజ్ కొఠారీ, ఆర్యవైశ్య సంఘానాయకులు యేల్చూరి సత్యనారాయణ, భూమ బాబు, నాళం సురేష్, ది దుర్గాకోపరేటివ్ అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ కొరగంజి భాను, శ్రీనగరాల సీతారామస్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ మరుపిళ్ళ హనుమంతరావు, దుర్గగుడి రినోవేషన్ కమిటీ మాజీ చైర్మన్ పోతిన పైడారావు, హోల్‌సేల్ మెడికల్ అసోసియేషన్ సెక్రటరీ శివప్రసాద్, కోశాధికారి శ్రీనివాసగుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రథానికి ప్రత్యేక పూజలు, బలిహరణ తదితర కార్యక్రమాలను అర్చకస్వాములు నియమనిష్ఠలతో నిర్వహించిన తర్వాత స్వామివార్ల రథోత్సవ ఊరేగింపు బయలుదేరింది.
రాష్టస్థ్రాయి యువజనోత్సవంలో నగర విద్యార్థుల హవా
బెంజిసర్కిల్, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ సేవా పథకములో భాగంగా నిర్వహించిన రాష్టస్థ్రాయి యువజనోత్సవంలో నగర విద్యార్థులు తమ హవా ప్రదర్శంచారు. ఈ నెల 16 నుండి 18 వరకు 3 రోజుల పాటు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ యువజనోత్సవంలో పిబి సిద్ధార్థ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ రాష్ట్ర స్థాయి సంగీత, సాంస్కృతిక పోటీలకు 9 విశ్వవిద్యాలయాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు హాజరయ్యారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ పోటీలు చాలా ఉత్కంఠ భరితంగా జరిగాయి. విశ్వవిద్యాలయాల స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సంగీత పోటీల్లో నగరానికి చెందిన పిబి సిద్ధార్థ పిజి కళాశాలలో ఎంఎ ఇంగ్లీష్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ దేవవరపు మధుబాబు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం తరుఫున పాత్రినిధ్యం వహించి వాయిద్య సంగీత విభాగంలో తన తబల వాదనతో ప్రథమ స్థానంలో నిలిచాడు.
మధుబాబుకు అభినందనలు
రాష్టస్థ్రాయి యువజనోత్సవాల్లో సంగీత విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన దేవవరపు మధుబాబును పిబి సిద్ధార్థ కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. మధుబాబు ప్రథమ స్థానంలో నిలవడం ద్వారా పిబి సిద్ధార్థ కళాశాల కీర్తితో పాటు విజయవాడ కీర్తి, కృష్ణాజిల్లా కీర్తిని రాష్టల్రో ఇనుమడింప చేశాడని అభినందనలతో ముంచెత్తారు. కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ కె కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్టస్థ్రాయిలో ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం మధుబాబును ఘనంగా సన్మానించారు. అలాగే కళాశాల తరుఫున నగదు బహుమతులను అందజేశారు. ఎన్‌ఎస్‌ఎస్ వలాంటీర్లందరూ మధుబాబును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
పెండింగ్‌లో ఉన్న రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి
అజిత్‌సింగ్‌నగర్, ఫిబ్రవరి 21: 56వ డివిజన్ వాంబే కాలనీలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణంతోపాటు పారిశుద్ధాన్ని మెరుగుపర్చి దోమలను నివారించాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి కె దుర్గారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక జి ప్లస్ త్రీ గృహాల వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ అన్ని సౌకర్యాలను కల్పిస్తామని హామీలిచ్చి తీసుకువచ్చిన పునరావాసులకు కష్టాలు తప్పడం లేదని, పునరావాసం కల్పించి సంవత్సరాలు గడుస్తున్నా కల్పిస్తామన్న కనీస సౌకర్యాలు పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. కనీసం రోడ్లు, మురుగు పారుదలతోపాటు ఇతర సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటం పరిశీలిస్తే పునరావాసులపై నగర పాలకులకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అవగతం అవుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు నిలచిపోయాయని, దీంతో స్థానికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. గత వర్షాకాలంలో వర్షాలు తగ్గిన తరువాత రోడ్ల నిర్మాణం చేపడతామన్న నగర పాలకులు ఇంతవరకు ఆయా పనులను పునఃప్రారంభించకపోవడం విచారకరమన్నారు. సైడు కాల్వల్లో మురుగును సక్రమంగా తీయకపోవడంతో ఎక్కడి పూడికలు అక్కడే అన్నట్టుగా ఉందన్నారు. దీంతో దోమలు వృద్ధి నానాటికీ పెరిగి దోమ కాటుకు గురవుతున్నారన్నారు. దోమలు విజృంభణ ఎక్కువగా ఉన్నా నివారణా చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. నగర పాలక సంస్థలో స్పెషలాఫీసర్ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడు లేకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితి దాపురించిందన్నారు. ఐద్వా సింగ్‌నగర్ జోన్ కార్యదర్శి జి ఝాన్సీ రాణి, ఎరియా కార్యదర్శి ఓంకార్, స్థానిక నాయకులు ఎస్ బంగార్రాజు, ఎస్ అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
పాయకాపురం, ఫిబ్రవరి 21: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన పాయకాపురం కండ్రికలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఇదే ప్రాంతానికి చెందిన నాగవల్లి సంతోష్‌కుమారి (26)కి వివాహమై ఎనిమిది సంవత్సరాలైంది. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈక్రమంలో భర్తతో ఏర్పడిన విభేదాల కారణంగా భర్త నుండి కొనే్నళ్లుగా దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈమె కండ్రికలోని తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కాగా, గత కొద్ది రోజుల నుండి ఈమెకు మరో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో మానసికంగా కృంగిపోయింది. తల్లిదండ్రులైన లక్ష్మీ, అప్పారావు సోమవారం వైజాగ్ వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సంతోష్‌కుమారి ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందింది. మంగళవారం ఉదయం పక్కింటి వారు ఎంత పిలిచినా పలుకకపోవడంతో కిటికీల్లోంచి చూడగా ఉరి వేసుకుని వేలాడుతున్న సంతోష్‌కుమారి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పాయకాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెరుగైన సమాజం కోసం విద్యార్థుల ప్రతిజ్ఞ
బెంజిసర్కిల్, ఫిబ్రవరి 21: సమాజంలో మంచి మార్పు విద్యార్థులతో మొదలు కావాలి అనే ఉద్దేశ్యంతో మెరుగైన సమాజం కోసం అంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయంలో ఈ నెల 24, 25 తేదీల్లో కళాశాలలో జరుగుతున్న సాంస్కృతిక ఉత్సవం సురభి - 2012లో భాగంగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురభి కన్వీనర్ పివి చలపతి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా బాధ్యతగా నిర్వహించాలన్నారు. విశిష్ట అతిథి సురభి కోకన్వీనర్ కె మాణిక్యేశ్వరరావు మాట్లాడుతూ సమాజ పురోభివృద్ధిలో విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ముదావహం అని అన్నారు. సమాజం మారాలంటే మార్పు నా నుంచి మొదలు కావాలి అని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసిన విద్యార్థి జి కె చైతన్యను ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. శుక్రవారం, శనివారం నిర్వహించే సురభి కార్యక్రమంలో కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సురభి కమిటీ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా సమాచార హక్కు చట్టంపై అవగాహన శిబిరం, సామాజిక వ్యాపారంపై అవగాహన శిబిరం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.