పులివెందుల , ఫిబ్రవరి 21: అపుడే వేసవి ముంచుకొస్తోంది. ఎండలు మండుతున్నాయి. చిత్రావతి డ్యాం ఒట్టిపోతోంది. దీంతో పులివెందుల మున్సిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలవుతున్నాయి. ప్రతి యేడు పట్టణ ప్రజలకు వేసవి వచ్చిందంటే నీటికోసం 3పానీపట్టు2 యుద్దాలు తప్పవు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో సుమారు 60వేల జనాభా ఉంటుంది. ఈ జనాభాకు సరిపడా నీరు మున్సిపాలిటీ అధికారులు అందించాలంటే ప్రతిరోజు 60లక్షల లీటర్ల నీరు సరఫరా చేయాలి. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సుమారు 50కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి 24గంటల నీటిసరఫరా అందించారు. ఇందులో భాగంగా నక్కలపల్లె సమ్మర్ స్టోరేజితో పాటు పట్టణంలోని ద్యాన్ చంద్ క్రీడామైదానంలో స్టాక్‌పాయింట్, క్లోరినేషన్‌ప్లాంట్ ఏర్పాటు చేసి పైపులైను ఏర్పాటు చేశారు. ఈ పథకానికి కావలసిన నీరు లింగాల మండల పరిధిలోని పార్నపల్లె సమీపంలోని చిత్రావతి డ్యాంనుంచి పిబిసి కెనాల్ ద్వారా కామసముద్రం చెరువుకు అక్కడినుంచి నక్కలపల్లె సమ్మర్‌స్టోరేజి ట్యాంక్ చేరుతుంది.
ముందుచూపులేని అధికారులు
ప్రతి యేడాది పట్టణ ప్రజలకు వేసవిలో కాసిన్ని మంచినీళ్లు అందించాలంటే
మున్సిపల్ అధికారులు నానాపాట్లు పడుతుంటారు. ఇది జగమెరిగిన సత్యం. గత యేడాది కొంతమేర చిత్రావతిడ్యాంకు వచ్చిన నీటిని పిబిసికి సాగునీరు ఇవ్వకుండా రైతన్నల నోరుకొట్టి పట్టణ ప్రజలకు తాగునీరు అందించి పబ్బంగడుపుకున్న మున్సిపల్ అధికారులపై అప్పట్లో పిబిసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. గత యేడాది ఉత్పన్నమైన సమస్యను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ అధికారులు ఈయేడాది నీటి సమస్యను పట్టించుకోకపోవడంతో వేసవికి ముందే పట్టణ ప్రజలు తాగునీటికోసం తిప్పలు పడుతున్నారు. చిత్రావతిలో ప్రస్తుతము నిల్వ ఉన్న నీటిని సాగునీటి కోసం విడుదల చేయకుండా, తాగునీటికోసం ఉండే విధంగా కలెక్టర్ అనీల్ చర్యలు తీసుకున్నారు. దీంతో నియోజవర్గంలోని 172 గ్రామాల పథకం, అనంతపురం జిల్లాకు సరఫరా చేయు నీటి పథకాలకు ఈయేడు చిత్రావతి డ్యాంలో నీరు సంవృద్ధిగా ఉండేది. అయితే మున్సిపల్ అధికారుల అనాలోచిత నిర్ణయాలను కలెక్టరు దృష్టికి తీసుకెళ్లి డ్యాంనుంచి నీరు విడుదల చేయించారు. దీంతో ఉన్నకాస్తా నీరు కామసముద్రం చెరువుపాలైంది. దీంతో డ్యాంలో ఉన్న మంచినీటి పథకాలకు మార్చిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదముంది.
కమీషన్‌ల కోసమే ఆరాటంగా పైపులైను నిర్మాణం
వచ్చే వేసవిలో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందస్తుగా రాజకీయాలకు అతీతంగా కలెక్టరు అనిల్‌కుమార్‌తో వైకాపా ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, కాంగ్రెస్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, టిడిపి ఎమ్మెల్సీ ఎస్‌వి సతీస్‌కుమార్‌రెడ్డిలు గతమాసం నుంచి విడివిడిగా సమావేశమై తుంగభద్రనుంచి చిత్రావతికి తాగునీరు విడుదలయ్యేట్లు చూడాలని కోరారు. సమస్యను కలెక్టరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఫలితంలేదు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గత మాసం నుంచి పలుమారు మున్సిపల్ అధికారులను కలిసి తాగునీటి సమస్యపై చర్చించారు. ఈ చర్చల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు అంకెలగారడి చూపి కాలయాపన చేశారు. తాగునీటి సమస్యతీవ్రత దృష్ట్యా ఈమాసం మొదట్లో కలెక్టరు అనిల్ మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి చిత్రావతి డ్యాం, నక్కలపల్లె సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకును పరిశీలించి ఈయేడాది ప్రజలకు చిత్రావతి డ్యాం నీటిని అందించలేమని, వెంటనే నక్కలపల్లె సమ్మర్‌స్టోరేజ్ వద్ద ఉన్న బోర్లునుంచి నీటిని పులివెందులకు ప్రస్తుతమున్న పైపులైను ద్వారా సరఫరా చేయాలన్నారు. అలాగే మండల పరిధిలోని నామాలగుండు సమీపంలోని వాగులో 3బోర్లు వేసి అక్కడినుంచి పైపులైను నిర్మాణ చేపట్టి ప్రజల నీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇదే అదనుగా మున్సిపల్ అధికారులు కలెక్టరుతోపాటు ప్రజాప్రతినిధులకు సుమారు 95లక్షల రూపాల ప్రణాళికలు సిద్ధం చేసి చూపించారు. ప్రస్తుతం నామాలగుండు సమీపంలో వేసిన బోర్లనుంచి నీటిని ద్యాన్‌చంద్ క్రీడామైదానంలోని ట్యాంక్‌కు సరఫరా చేయాలంటే సుమారు 7000మీటర్ల దూరం ఉంది. ఇందుకోసం పనులు చేపట్టారు. పైకి మాత్రం ఈనెల 25అని మరోసారి 29వ తేదీ అని అధికారుల భింకాలు పలుకుతున్నారు. ఈ పనులు పూర్తి కావాలంటే మార్చిమాసం పూర్తవుతుంది. గతయేడాది సమస్యను గుర్తించిన అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోకుండా ప్రస్తుతము 95లక్షల రూపాయలను ఖర్చు చేస్తే ప్రతిరోజు 18లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తారు. ఇందులో విద్యుత్‌కోతతో రోజుకు కనీసం 10లక్షల లీటర్ల నీరు మాత్రమే అందుతుంది. మరి ప్రతిరోజు పట్టణానికి 60లక్షల లీటర్లనీటిని ఎక్కడినుంచి సరఫరా చేస్తారో మున్సిపల్ అధికారులకే యెరుక. తాగునీటి సమస్య వేసవిలో తలెత్తుతుందని తెలిసికూడా, ఇప్పటి వరకు చోద్యం చూస్తూ ప్రత్యామ్నాయం పేరుతో ప్రస్తుతము ఏర్పాటుచేయు పైపులైనుపై కమీషన్‌ల కోసం మక్కువ చూపారుతప్ప, పట్టణ ప్రజల దాహార్తి తీర్చే పరిస్థితి కనిపించలేదని పురపాలక ప్రజలు మున్సిపల్ అధికారులను బాహాటంగానే విమర్శిస్తున్నారు. అలాగే ప్రస్తుతము మున్సిపల్ అధికారులు ఆత్రంగా ఖర్చు చేయుచున్న 95లక్షల రూపాయలతో ఎంతమేర నీటిని పులివెందుల పట్టణ ప్రజలకు అందించి వారి దాహార్తిని తీరుస్తారో వేచి చూడాల్సిందే.
వైఎస్‌ఆర్‌సిపి వైపుమైనార్టీల చూపు!
కడప, ఫిబ్రవరి 21: జిల్లాలో అధికార పార్టీకి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి మైనార్టీ నాయకులు ఇటు పార్టీపై, అటు ప్రభుత్వంపై తీవ్ర నిరాశకు గురై, సరైన ఆదరణ లభించక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో చాలా జనాభా కలిగిన మైనార్టీలకు ప్రభుత్వంలో పదవులు లభించకపోవడంతో పాటు పార్టీ గుర్తిస్తుందని నిరీక్షించిన నేతలకు నిరాశే మిగులుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా త్వరలో జరగనున్న రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ఉప ఎన్నికల్లో మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు మైనార్టీల ఓట్లు గండిపడే అవకాశాలు లేకపోలేదు. రాయచోటి, రాజంపేట నియోజక వర్గాల్లో మైనార్టీ ఓట్లే కీలకంగా మారనున్నాయి. మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వని కారణంగా అభ్యర్థులు కూడా మైనార్టీ ఓటర్ల ముందుకు వెళ్లాలంటే జంకుతున్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్న కాలంలో జిల్లా మైనార్టీలకు పెద్దపీట వేశారు. ప్రస్తుతం ఆ ఆదరణ కనిపించకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే
మైనార్టీలు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అత్యధిక జనాభా కలిగిన రాయచోటిలో కొంతమంది మైనార్టీ నేతలు పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే అక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువురు అగ్రనేతలు పార్టీ టిక్కెట్ కోసం హోరాహోరిగా ప్రయత్నాలు కొనసాగిస్తుండడంతో, మైనార్టీలు టిక్కెట్ కోసం పోరాడినా దక్కదనే నెపంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేసే మైనార్టీ నేతలకు సరైన ఆదరణ లభించని పక్షంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఘోరంగా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని స్థానికలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కడప - రేణిగుంట ఫోర్‌లైన్‌కు గ్రీన్‌సిగ్నల్!
కడప, ఫిబ్రవరి 21: ఎన్నో దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్న కడప - రేణిగుంట హైవే రోడ్డును ఫోర్‌వే చేయడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కడప నుంచి రేణిగుంట వరకు సుమారు 140 కిలోమీటర్ల పరిధిలో ఫోర్‌లైన్ చేయడానికి 779 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆర్‌అండ్‌బి అధికారులు నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తూ మాచింగ్ గ్రాంట్ సమకూరుస్తామని మిగిలిన గ్రాంట్‌ను కేంద్ర ప్రభుత్వం భరించాలని నివేదిక ఇవ్వనుంది. దీంతో ఫోర్‌లైన్లకు రూ.779 కోట్లకు అనుమతి లభించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ రోడ్డు మార్గాల నిర్మాణానికి స్థల సేకరణ నిమిత్తం సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. చాలా రోజుల క్రితమే కడప-రేణిగుంట రహదారిని నాలుగు లైన్లుగా చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అప్పటి ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి గల్లా అరుణకుమారి కూడా ప్రకటించారు. అయితే వైఎస్ అకాల మరణం తర్వాత నిధులేమితో ఈ పనులు ఆనాడే అటక్కాయి. ప్రస్తుతం ఈ రహదారికి అధికారులు వంద అడుగుల మేర భూమిని కేటాయించనున్నారు. సాధ్యమైనంత వరకు ప్రస్తుతం ఉన్న వెడల్పే ఫోర్‌లైన్‌కు సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భవిష్యత్ అంచనాలను దృష్టి పెట్టుకుని వెడల్పు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రోజు రోజుకు వాహనాలు పెరగడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్డు మార్గాన్ని 150 అడుగుల మేర భూ సేకరణ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాయచోటి మార్గం గుండా వెళ్లే జాతీయ రహదారికి 200 అడుగులు భూ సేకరణ చేశారు. రానున్న పదేళ్లలో ఆ మార్గం ఆరులైన్లు మారే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే నిధులేమి ప్రధాన అవరోధంగా మారనుంది. రోడ్డుకు కావాల్సిన 780 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తే ఈ పనులు వేగవంతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వాసులకే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక రాష్టవ్రాసులతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల వాసులు తిరుపతి-చెన్నై వెళ్లడానికి ఇది దగ్గరి మార్గం. అయితే ఈ రహదారిని అభివృద్ధి చేసి జాతీయ హోదా కల్పించకుండా కడప నుంచి రాయచోటి మార్గం గుండా చిత్తూరు నుంచి చెన్నై వెళ్లే రహదారికి జాతీయ హోదా కల్పించారు. దీనివల్ల రేణిగుంట - కడప రహదారి ఫోర్‌లైన్‌కు నోచుకోకుండా రెండు రోడ్లకే పరిమితమైంది. రాష్ట్రంలో ఇలాంటి 13 రోడ్లకు జాతీయ హోదా కల్పించినా రేణిగుంట - కడప రోడ్ ఇందులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఈ రహదారి జాతీయ రహదారిగా గుర్తించి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేసి ఫోర్‌లైన్ పనులు పూర్తి చేయాలని మేధావులు కోరుతున్నారు.
ఉత్పత్తి లేకనే విద్యుత్ కోత
వేంపల్లె, ఫిబ్రవరి 21: ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి తగ్గిన కారణంగానే కోతను విధించక తప్పడం లేదని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ నరిరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లెలో తన స్వగృహంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిందన్నారు. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేదన్నారు. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడిందన్నారు. గత సంవత్సరం 248 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉండేదన్నారు. ఇప్పుడు 272 యూనిట్ల డిమాండ్ ఉందన్నారు. గతంలో ప్రాజెక్టుల నుండి 2600 మిలియన్ మెగా యూనిట్లు ఉత్పత్తి అయ్యేదన్నారు. కాకతీయ ప్రాజెక్టు భూపాల్ పల్లెలో 500 మెగా వార్డ్స్ తగ్గిందన్నారు. అలాగే ఢిల్లీలో ఎన్‌టిపిసికి చెందిన జర్చర్ ప్రాజెక్టు నుండి కొనుగోలు చేస్తుండేవారమని, ప్రస్తుతం అది కూడా నిలిచిపోయిందన్నారు. జలాశయం ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో తగ్గిందన్నారు. దీంతో వ్యవసాయ రంగానికి మాత్రం 7 గంటలు ఇస్తూ మిగతా వారికి కోత విధిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఐకెపి సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా 6527 మంది ఉన్నారన్నారు. ప్రధానంగా వారివి రెండే డిమాండ్లు అన్నారు. వారి ఉద్యోగ నియామకాలు కేవలం సొసైటీ ద్వారా జరుగుతాయన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఘనంగా శివపార్వతుల
కల్యాణ మహోత్సవం
వీరపునాయునిపల్లె, ఫిబ్రవరి 21: మండల పరిధిలోని శ్రీఅనిమేల సంగమేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సంగమేశ్వర దేవాలయంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 20సూత్రాల కమిటీ అమలు చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి సతీమణి అలివేలమ్మతోపాటు యోగివేమన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రామచంద్రారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శంభురెడ్డిలు మేళతాళాలతో తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొని వచ్చి స్వామి వారికి, అమ్మవారికి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తులసిరెడ్డి, రామచంద్రారెడ్డి, శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సమన్వయంతో పని చేయాలి
* అధికారుల పనితీరుపై కలెక్టర్ అనిల్‌కుమార్ మండిపాటు
నందలూరు, ఫిబ్రవరి 21: మండలంలోని అన్ని గ్రామాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనులు నిర్వహించాలని, ఎవరి ఇష్టానుసారంగా వారు పనులు చేయరాదని, ఒకరి శాఖకు సంబంధించి వేరొకరు జోక్యం చేసుకోకూడదని కలెక్టర్ అనిల్‌కుమార్ అధికారుల తీరుపై మండిపడ్డారు. మంగళవారం కలెక్టర్ స్థానిక ఎంపిడిఓ, పిహెచ్‌సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఏ శాఖకు సంబంధించిన పనులను వారే నిర్వహించాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖకు సంబంధించి ఆడపూరు దళితవాడ, చింతలకుంటలలో తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మండలంలో 13 ఫైనాన్స్ కింద మంజూరైన రూ. 12 లక్షల ఏక్కడక్కడ వినియోగించారని ప్రశ్నించగా లేబాకలో రూ. 3 లక్షలు, టంగుటూరులో రూ. 2 లక్షలు, నాగిరెడ్డిపల్లె ఇతర గ్రామాల్లో పారిశుద్ధ్యంకు వినియోగించామని ఎఇ రాజశేఖర్ తెలిపారు. ఎంపిడిఓ ఎవి ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలు, వెలుగు, వెటర్నరీ, వ్యవసాయ శాఖల్లో ఏమి జరుగుతుందో తెలియడం లేదన్నారు. ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఇష్టానుసారంగా పనులు చేపట్టకూడదని హెచ్చరించారు. ఈ వి ద్యా సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెం చాలని ఎంఇఓ నరసింహులుకు సూచి ంచారు. మధ్యాహ్న భోజనం రిజిష్టర్లను పరిశీలించారు. ముంపు ప్రాంతాలైన కొమ్మూరు, కోనాపురంల్లో అభివృద్ధి పనులు చేపట్టరాదన్నారు ఎర్రచందనం స్మగ్లర్లపై 107 కింద బైండోవర్ కేసులు నమోదు చేయాలని తహశీల్దార్‌ని ఆదేశించారు. పిహెచ్‌సి అపరిశుభ్రంగా ఉందని, హెచ్‌డిఎస్ నిధులతో పరిశుభ్రంగా ఉంచుకుని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వెటర్నరీ డాక్టర్ భాగ్యవతి, వ్యవసాయ అధికారిణి శ్రీదేవి, ఉపాధి హామీ ఎపిఓ నరసింహులు వారి శాఖలకు సంబంధించి రికార్డులను చూపారు. నాగిరెడ్డిపల్లెలో పూర్తయిన ఓవర్‌ట్యాంకు వినియోగంలోకి రావడం లేదని తెలియడంతో కలెక్టర్ వాటిని పరిశీలించి, మిగిలిన పనులను పూర్తి చేసి తాగునీటిని ప్రజలకు అందించాలని ఆదేశించారు.
ఆకాశవాణి ప్రసారాల్లో
తెలుగుభాషకు పెద్దపీట
* ఆకాశవాణి స్టేషన్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ విజయసారథి
ప్రొద్దుటూరు, ఫిబ్రవరి 21: ఆకాశవాణి ప్రసారాలలో తెలుగు భాషకు పెద్దపీట వేస్తున్నట్లు కడప ఆకాశవాణి స్టేషన్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ విజయసారథి పేర్కొన్నారు. మంగళవారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా స్థానిక గాంధీ మున్సిపల్ పార్కులోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రొద్దుటూరు సాహితీ మిత్రసమితి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విజయసారథి మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యము, ఔచిత్యాన్ని చెప్పడంలో ఆకాశవాణి ఎంతో కృషి చేస్తోందని వివరించారు. మరో ముఖ్య అతిథిగా ముద్దనూరు ఎంపిడిఓ మొగలిచెండు సురేష్ మాట్లాడుతూ ప్రమాదపు అంచుల్లో ఉన్న తెలుగు భాష పరిరక్షణకై ప్రతి తెలుగు భాషాభిమాని కృషి చేయాలని ఉద్భోదించారు. సాహితీ మిత్ర సమితి అధ్యక్షుడు ప్రముఖ రచయిత జింకా సుబ్రమణ్యం మాట్లాడుతూ తెలుగు భాష ఉన్నతి కోసం ప్రభుత్వం వెంటనే ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని అన్నారు. పదవి కాలం తీరిపోయిన అధికార భాషాసంఘానికి తగిన అధికారాలు ఇచ్చి వెంటనే నియమించాలని అలాగే సాహిత్య అకాడమిని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ మహ్మద్ ముస్త్ఫా, డాక్టర్ గోపాల్‌రెడ్డి, సి ఎ గోపాలకృష్ణ, ఆర్ వై కొండయ్య, విజయభాస్కర్, మునుస్వామి, డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, నడిమల గంగాధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గండికోట రిజర్వాయర్ పేరు మార్చండి
కడప, ఫిబ్రవరి 21: గండికోట రిజర్వాయర్‌కు ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి రిజర్వాయర్‌గా బోర్డుపై రాయించాలని కలెక్టర్ అనిల్‌కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జలయజ్ఞం పథకంపై నీటి పారుదల శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టుల వారిగా చేపట్టిన పనులను, సాధించిన ప్రగతిని, ఖర్చు చేసిన నిధుల వివరాలను అవసరమైన భూ సేకరణ, రైతులకు చెల్లించాల్సిన పరిహారం, నిధుల లభ్యత, సమస్యలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్థంభాల మార్పు కోసం విద్యుత్ అధికారులకు ప్రతిపాదనలు పంపాలన్నారు. భూ సేకరణకు సంబంధించి ఏదైనా సమస్యలుంటే సత్వరమే తగిన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ప్రాజెక్టులకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు చెల్లించాలన్నారు. సిబిఆర్ కింద పులివెందుల, లింగాల వరకు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ భూములకు సంబంధించిన సమస్యలుంటే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. పునరావాసం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
కమనీయం కల్యాణం
రాజంపేట రూరల్, ఫిబ్రవరి 21: మండలంలోని అత్తిరాల పుణ్యక్షేత్రంలో శ్రీ త్రేతేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ కామాక్షి, మీనాక్షి సమేతంగా స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక వేదికపై కల్యాణోత్సవం కార్యక్రమం చేపట్టారు. ఆలయ కమిటీ చైర్మన్ సండ్రపల్లె శివయ్య, ఇఓ కూరగాయల కొండయ్యలు స్వామివారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. వేదపండితుల మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వామి కల్యాణం జరిగింది. ఈ కల్యాణోత్సవానికి రాజంపేట పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది భక్తులు పాల్గొని, స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.
హరిహర నామస్మరణతో స్వామివారికి భక్తాదులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ మహోత్సవాలకు హాజరై భక్తుల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు అన్నదాన కార్యక్రమాలు, పీపుల్స్ ఓరియంటెల్ వేకర్స్ ఎడ్యుకేషనల్ రూరల్ సొసైటీ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తాదుల దాహార్తిని తీర్చేందుకు మినరల్‌వాటర్ చలివేంద్రంను సొసైటీ అధ్యక్షులు మోహన్‌రాజు (మధు), పాండురాజు, మురగరాజు, విశ్వనాథరాజు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది అడుగడుగునా మంచినీటి చలివేంద్రాలు అనేక సంస్థలు నిర్వహించేవి. అయితే ఈ ఏడాది పవర్ సొసైటీ తప్ప మరే సంస్థలు ఏర్పాటు చేయక పోవడంతో భక్తులు ఇబ్బందులకు లోనయ్యారు.
వైభవంగా
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గ్రామోత్సవం
నందలూరు, ఫిబ్రవరి 21: స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో మహశివరాత్రి సందర్భంగా 3 రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కేరళ కళాకారులు ప్రదర్శించిన శింగారి మేళం, డప్పు వాయిద్య ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నాయి. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త కొత్తపల్లె శ్రీనివాసాచారి, అర్చకులు వీరాచారులు, మర్రిస్వామిఆచారి, రాజాచారి, బాలాంజనేయులు, హెడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో పోటెత్తిన గండిక్షేత్రం
చక్రాయపేట, ఫిబ్రవరి 21: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండిక్షేత్రం భక్తులతో మంగళవారం పోటెత్తింది. పొలతలు, ఇతర దైవ క్షేత్రాలకు వెళ్ళిన కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద సం ఖ్యలో గండికి తరలివచ్చి అంజన్నను దర్శించుకున్నారు. భక్తులకు సరిపడ సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థా న సిబ్బంది సౌకర్యం ఏర్పాట్లు చేయన ట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రసాదాలు కూడా లేకపోవడంతో భక్తు లు నిరుత్సాహంతో వెళ్ళారు. తిరుమ ల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గండిక్షేత్రం సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదీ ఏమైనప్పటికి గండిక్షేత్రం కిక్కిరిసిపోయింది. కడపలో సోమవారం జరిగిన పొలతల జాతరకు వచ్చిన భక్తులు గండిక్షేత్రానికి రావడంతో గండిక్షేత్రం పోటెత్తింది.
అత్తిరాలలో పోటెత్తిన భక్తజనం
రాజంపేట, ఫిబ్రవరి 21: పవిత్ర పుణ్యక్షేత్రంగా చారిత్రాత్మక చరిత్ర కలిగిన శైవక్షేత్రంగా, పరశురాముని మాతృహత్యా పాతకాన్ని రూపుమాపిన బాహుదానది తీరాన వెలిసిన అత్తిరాల శ్రీ త్రేతేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు కూడా భక్తజనం పోటెత్తారు. యథావిథిగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. రెండోరోజు స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. కాగా బుధవారం పూల రథోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. పోలీసులు, వైద్య సిబ్బంది యథావిథిగా అత్తిరాల దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండోరోజు భక్తుల సందడితో అత్తిరాల శైవక్షేత్రం కోలాహలంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లక్షకు పైగా భక్తులు అత్తరాల శ్రీ త్రేతేశ్వరుని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. మూడో రోజు నిర్వహించే పూల రథోత్సవంలో కూడా భక్తజనం వేల సంఖ్యలో పాల్గొనే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ, అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టింది. ఇక్కడి బాహుదానదిలో స్నానమాచరించడంతో పరశురాముని మాతృహత్య రూపుమాపిందన్న ఇతిహాసం నేపథ్యంలో వేల సంఖ్యలో ఈ నదిలో భక్తులు స్నానమాచరిస్తుంటారు. బాహుదానదిలో ఎలాంటి ప్రమాదాలు ఏర్పడకుండా రెవెన్యూ శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. అత్తిరాల శైవక్షేత్రంలో అభివృద్ధిపనులు దాతల సహకారంతో చైర్మన్ సండ్రపల్లె వెంకటశివయ్య లక్షల రూపాయలతో చేపట్టడం విశేషం. అత్తిరాల శైవక్షేత్రానికి రాత్రి సమయాల్లో భక్తుల సందడి ఎక్కువగా ఉంటుండడంతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క్భజనలు, ఆర్కెస్ట్రా, పౌరాణిక నాటకాల్లోని ముఖ్య సన్నివేశాలైన రామాంజనేయ యుద్దసీను, గయోపాఖ్యానం, శ్రీ కృష్ణరాయబారంలో పడకసీను, సత్యహరిశ్చంద్రలో అడవి సీను, వారణాసి సీను, కాటి సీను తదితర ముఖ్యఘట్టాలతో ప్రదర్శనలు జరుగుతుండడం విశేషం. ఈ ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.