లక్నో, ఫిబ్రవరి 21: జాతీయ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక మండలి (ఎన్‌సిటిసి)ని ఏర్పాటు చేయడంపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక వేళ దీన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలకు ఏమయినా అనుమానాలు ఉంటే వాటిని తొలగించడానికి ఆ రాష్ట్రాలతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర టెలికాం, మానవ వనరుల శాఖల మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. ఎన్‌సిటిసి కేంద్ర మండలిలో ప్రతి రాష్ట్రానికి ఇప్పటికే ప్రాతినిధ్యం కల్పించారని, ఒక వేళ ఇంకా ఏమయినా అనుమానాలు, అపోహలు ఉంటే చర్చల ద్వారా వాటిని తొలగించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని సిబల్ మంగళవారం ఇక్కడ విలేఖరుతో మాట్లాడుతూ చెప్పారు. ‘ఒక వేళ ఏవయినా అనుమానాలు, అపోహలు ఉంటే వాటిని తొలగించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసమే కేంద్రం ఇదంతా చేస్తోంది’ అని ఆయన చెప్పారు. ఎన్‌సిటిసిని ఏర్పాటు చేయడం వెనకు ఉన్న హేతుబద్ధతను మంత్రి వివరిస్తూ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాలను ఎన్‌సిటిసికి అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఎన్‌సిటిసి కేంద్ర మండలిలో ఎన్‌సిటిసి డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు, ప్రతి రాష్ట్రానికి చెందిన ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు, లేదా బలగాల చీఫ్‌లు ప్రతినిధులుగా ఉంటారని సిబల్ చెప్పారు. ‘ప్రతిరాష్ట్రానికి ప్రాతినిధ్యం ఉంటుంది. ఎన్‌సిటిసికి చెందిన మొత్తం కార్యకలాపాలను వారు పర్యవేక్షిస్తారు. ఎన్‌సిటిసి ఏర్పాటువెనుక ఉన్న హేతుబద్ధత ఇదే’ అని ఆయన చెప్పారు. ఎన్‌సిటిసిని ఏర్పాటు చేయడానికి యుపిఏ మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటుగా 13 రాష్ట్రాల కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఎన్‌సిటిసి ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రాల అధికారాలు కుదించుకుపోతాయని, ఫెడరల్ వ్యవస్థకు ఇది భంగకరమని ఆ రాష్ట్రాల సిఎంలు వాదిస్తున్నారు. ఎన్‌సిటిసికి సంబంధించిన వివరాలు ఇంతకు ముందు తనకు కూడా తెలియవని, ఈ మధ్యనే తెలుసుకున్నానని సిబల్ చెప్పారు. కోడ్ ఉల్లంఘన కేసులను ఎన్నిల కమిషన్ కాకుండా కోర్టులు విచారించడానికి వీలుగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి చట్టబద్ధత కల్పించడంపై చర్చించడానికి బుధవారం జరగనున్న మంత్రుల గ్రూపు సమావేశం గురించి అడగ్గా, తాను మంత్రుల గ్రూపులో ఉన్నప్పటికీ సమావేశం అజెండా గురించి తెలియదని సిబల్ చెప్పారు.
కాగా, క్రిమినల్ కేసులున్న బిఎస్పీ నేతలపై కేసులు ఉపసంహరించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టిన వారి జాబితాను విలేఖరుల సమావేశంలో సిబల్ విడుదల చేసారు. రేప్‌లు, బెదిరించి డబ్బులు గుంజుకోవడం లాంటి తీవ్రమైన అభియోగాలను ప్రభుత్వం ఎత్తివేయడాన్ని తాను ఇంతకు ముందు ఎక్కడా చూడలేదని, యుపిలో ప్రభుత్వం పని చేస్తున్న తీరు ఇలా ఉందని ఆయన అన్నారు.
ఎన్‌సిటిసిపై కేంద్ర మంత్రి సిబల్ వెల్లడి
english title:
r
Date:
Wednesday, February 22, 2012