విజయనగరం, ఫిబ్రవరి 21: ధరల పెరుగుదల, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక వర్గాలపట్ల ప్రభుత్వం అనుసరిసున్న విధానాలు, పెండింగ్ సమస్యలు తదితర అంశాలపై ఈనెల 28న చేపట్టబోయే దేశ వ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని బంద్‌కు సహకరించాలని పలు కార్మిక, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. మంగళవారం స్థానిక రహదారులు భవనాల శాఖ అతిధిగృహంలో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా శాఖ నాయకులు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఫెడరేషన్ జిల్లాప్రధానకార్యదర్శి డి.రాము మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న కొత్త పింఛను విధానానం రద్దుచేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థల రద్దు, శాశ్వతప్రాతిపదికన ఉద్యోగాల నియామకం వంటి పలు కార్యక్రమాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే కనీస వేతనాలు 10వేల రూపాయలుగా నిర్ణయించడంతోపాటు ఫిఎప్ వడ్డీరేటును పెంచాలని డిమాండ్ చేశారు. ఈమేరకు యుటిఎఫ్ ఈ బంద్‌కు పూర్తి సహకారం అందిస్తుందని, ఉపాధ్యాయులు ఈ సమ్మెలో యుటిఎఫ్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యుటిఎఫ్ నాయకులు అల్లూరి శివవర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శేషగిరి, ఆడిట్ కమిటీ కన్వీనర్ జి.రమేష్‌చంద్రపట్నాయక్, జిల్లా కార్యదర్శి జి.నిర్మల తదితరులు పాల్గొన్నారు. అలాగే సిపిఎం కార్యాలయంలో అపార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.కృష్ణమూర్తి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1994 నుంచి ఇప్పటి వరకు జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలకు ఇది భిన్నమైనది, విపరీతమైన ధరల పెరుగుదల, సామాన్య ప్రజానీకంపై పెనుభారం పడుతున్న దృష్ట్యా అన్ని వర్గాల ప్రజలు స్వచ్చందంగా ఈ సమ్మెకు ముందుకు వస్తున్నారని అయితే ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ సమ్మెకు పూర్తి సహకారం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సమ్మె సందర్బంగా నిర్వహిస్తున్న బంద్‌ను విజయవంతం చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల మనుగడకు సహకరించాలన్నారు. ఈసందర్భంగా బంద్ ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. సమావేశంలో రైతుసంఘం జిల్లా ప్రతినిధి మర్రాపు సూర్యనారాయణ పాల్గొన్నారు.
రైతువారీ ఇంప్లిమెంట్సుకు
గ్రామాల వారీ సదస్సు
విజయనగరం, ఫిబ్రవరి 21: వ్యవసాయ యాంత్రికరణ కింద వ్యవసాయ పరికరాలు కావాల్సిన రైతుల జాబితాల సేకరణకు గాను మార్చినెలలో గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించాలని, వ్యవసాయ శాఖ కమిషనర్ ఉషారాణి ఆదేశించారు. అన్ని జిల్లాల వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రికరణ ప్రాధాన్యతపై ఆ సదస్సుల్లో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ పరికరాల వినియోగంపట్ల ఆశక్తికలిగిన కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిన రైతుల పేర్లు నమోదు చేయాలన్నారు. ఆ నివేదిక ఆధారంగానే కేటాయింపులు జరుగుతాయన్నారు.రైతు వారి ఇంప్లిమెంట్స్‌ను ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా కొనసాగించాలన్నారు. రైతబాట కార్యక్రమంలో ప్రతి రైతుకు సంబందించిన అన్నివివరాలు సేకరించి కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని వారిఫోన్ల్‌కు వాయిస్ మెసేజ్‌లు పంపేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి రైతు బ్యాంకు ఖాతా నెంబర్ తప్పనిసరిగా వ్యవసాయ శాఖ వద్ద ఉండేలా చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ జెడి లీలావతి, ఎ.ఓలు విజయకుమార్, హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు.
గతి తప్పుతున్న ‘ప్రత్యేక పాలన’
విజయనగరం, ఫిబ్రవరి 21: స్థానిక పాలనే గ్రామస్వరాజ్యానికి స్వావలంబన. ఇది పాలకులు తరచు చెప్పే సుభాషితమే. అయితే స్థానిక పాలన పట్ల పాలకుల చిత్తశుద్ధి మాత్రం అంతంతమాత్రమేనన్నది వ్యవహారంలో తేటతెల్లమవుతోంది. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేకపోవడం, అధికారులు తమకెందుకులే అన్న రీతిలో వ్యవహరించడంతో గ్రామస్వరాజ్యం గతి తప్పుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చట్ట సభలకు మినహా (సహకార సంఘాలు ఇన్‌ఛార్జ్ పాలనలో కొనసాగుతున్నాయి) మరెక్కడా ఇప్పుడు ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేదు. గ్రామ పచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీలు మొత్తం ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. పంచాయతీ, జిల్లా, మండల పరిషత్‌లకు ఫిబ్రవరి మూడో వారంతో ఆరు నెల్ల కాలం ప్రత్యేకాధికారుల పాలన పూర్తి కానుంది. వీటిని మరో ఆరునెల్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 928 గ్రామ పంచాయతీలు ఉండగా ఇటీవల కాలంలో మూడు పంచాయతీలను విజయనగరం మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో ప్రస్తుతం పంచాయతీల సంఖ్య 925కు తగ్గింది. ఆరు నెల్లుగా పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో, ప్రత్యేకాధికారులే పాలనాపరమైన అంశాలను పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీల్లో కార్యదర్శులతో పాటు మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ చేసింది. గ్రామాల్లో అభివృద్ధి, ఇతర కార్యకలాపాలను పర్యవేక్షించడం వీరివిధి. అయితే ప్రస్తుతం గ్రామాల్లో పంచాయతీ పరంగా అందే సదుపాయాలు ప్రత్యేకాధికారుల పాలనలో కానరావట్లేదంటూ ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల నిర్వహణ విషయంలో అధికార యంత్రాంగం సరైన శ్రద్ధ తీసుకోలేదన్న విమర్శలున్నాయి. నిధులను వెచ్చించే విషయంలో ప్రజా ప్రతినిధులు చూపే చొరవను ప్రత్యేకాధికారులు చూపలేకపోతున్నారు. పారిశుద్ధ్య, విద్యుత్ పరికరాల కొనుగోలు వంటి అంశాల పట్ల కూడా వీరికి పూర్తి అవగాహన లేదు. తమకెందుకులే అన్న వైఖరి వల్ల గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వచ్చిన నిధులను ఖర్చు చేసే విషయంలో కూడా అధికారుల వైఖరి పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధుల్లో సుమారు 13కోట్ల రూపాయలు ఇప్పటి వరకూ ఖర్చు చేయలేదు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులను ఖర్చు చేసే విషయంలో సైతం యంత్రాంగం పూర్తిగా వెనుకబడి ఉంది. కేంద్రం మంజూరు చేసిన నిధులను నిర్ణీత గడువులోగా ఖర్చు చేయని పక్షంలో అవి మురిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు చేయని ఖర్చులను చేసినట్టు చూపుతున్నారు.
ప్రజా బ్యాలెట్‌కు విశేష స్పందన
విజయనగరం , ఫిబ్రవరి 21: సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్న సందర్భంలో మంగళవారం స్థానిక ఆర్టీ కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన ప్రజాబ్యాలెట్ కార్యాక్రమానికి మంచి స్పందన లబించింది. సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో వేదిక ప్రతినిధులు ఎం.అప్పలనాయుడు మాట్లాడుతోపాటు పలువురు పౌరులు, సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమాచార హక్కు చట్టం అమలు మన రాష్ట్రంలో అంతంతమాత్రంగానే ఉందని, ఈ దశలో ప్రభుత్వం కమిషనర్ల ఎంపికలో అక్రమాలకు పాల్పడటం విచారకరం అని, ఈ విషయాన్ని పరిశీలిస్తే ప్రభుత్వంపైనా, ప్రజాస్వామ్యంపైనా నమ్మకం పోతుందని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోవాలని, అక్రమంగా నియమించిన కమిషనర్లను తొలగించి వారి స్థానంలో పారదర్శంగా కొత్తగా నియామకాలు చేపట్టాలని కోరారు. అలాకాని పక్షంలో ప్రజా కోర్టులో ప్రభుత్వం దోషిగా నిలవక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రైవేటు కళాశాల అధ్యాపకులు ఆరిపల్లి సింహాచలంనాయుడు, ప్రజాఐక్యవేదిక ప్రతినిధులు భూసర్ల వెంకటరమణ, యువజన సంఘాల నాయకులు అబ్దుల్వ్రూఫ్, కాకర్లపూడి కృష్ణమూర్తిరాజు, మెయిద సత్యనారాయణ, బలిరెడ్డి ఆదినారాయణ, పెంటయ్య, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
‘వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు’
విజయనగరం (తోటపాలెం), ఫిబ్రవరి 21: కేంద్రాసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం పనికిరాదని అసుపత్రి సైవల జిల్లా సమన్వయాధికారి బి.విజయలక్ష్మి అన్నారు. స్థానిక ఆసుపత్రిలో డిసిహెచ్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం డాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విథులు నిర్వహిస్తున్న సమయంలో బయట వెళ్లిపోవడం చేయకూడదన్నారు. సమయం పూర్తి అయినంత వరకూ ఆసుపత్రిలోనే ఉండాలన్నారు. అత్యవసర కేసులపట్ల ప్రత్యేకశ్రద్ధ వహించాలన్నారు. డ్యూటీ మధ్యలో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళిసేవలు ఆందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రోగులపట్ల అసభ్యకరంగా ప్రవర్తించరాదని తెలిపారు. అవసరమైనచో రోగిని రోజుకు రెండుసార్లు పరిశీలించి అవసరమైన మేరకు వైద్యం అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది పట్ల రోగులు వల్ల ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్ కె.సీతారామరాజు, ఆర్‌ఎంఓ ఉషశ్రీ, వైద్యులు కె.ఎన్.మూర్తి, గౌరీశంకర్, బి.సత్యశ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.