మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25: ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. రెండు రోజులు వెలవెలబోయిన రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు ఒక్కసారిగా నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పట్టణాలు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కోలాహలంగా కనబడుతున్నాయి. అందులో భాగంగా శనివారం కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కాంగ్రెస్ అభ్యర్థిగా మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హరిసింగ్‌కు అందజేశారు. మంత్రి డికె అరుణ సమక్షంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను దాఖలు చేశారు. అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా కురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. నాగర్‌కర్నూల్‌లో టిడిపి అభ్యర్థిగా మర్రి జనార్ధన్‌రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి మధుసూదన్‌నాయక్‌కు అందజేశారు. అదేవిధంగా జమునారాణి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి శనివారం ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. మరో నాలుగు రోజులు మాత్రమే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు సమీకరణలను చేసుకుంటున్నారు. కాగా కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు రోజు కొల్లాపూర్‌కు వేలాది మంది తరలివచ్చారు. దాదాపు ఎడెనిమిది వేల మంది తరలిరావడంతో కొల్లాపూర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నిండిపోయింది. మంత్రి డికె అరుణ, మాజీ ఎంపి మల్లురవితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నామినేషన్ దాఖలుకు హాజరయ్యారు. పట్టణంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ దాఖలు రోజు జనాన్ని బాగా తరలించడంతో తెరాస శ్రేణుల్లో చర్చ మొదలైంది. ఏదిఏమైనా జిల్లాలో జరగనున్న నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది.
* కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్‌రెడ్డి * నాగర్‌కర్నూల్ టిడిపి అభ్యర్థిగా జనార్ధన్‌రెడ్డి * కాంగ్రెస్ నామినేషన్ దాఖలుకు భారీ జనం * హాజరైన మంత్రి డికె అరుణ
english title:
u
Date:
Sunday, February 26, 2012