కొల్లాపూర్, ఫిబ్రవరి 25: జిల్లాలో ఆధిపత్యం కోసం పోరాటం చేసి నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా జూపల్లి కృష్ణారావు మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ప్రజలు ఆదరించరనే ఆలోచనతో జిల్లాలో నేనే తెలంగాణ హీరో అనే విధంగా స్వార్థంతో రాజీనామా చేశారని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి డికె అరుణ ఆరోపించారు. కొల్లాపూర్ పట్టణంలో మామిళ్లపల్లి విష్ణువర్దన్‌రెడ్డి శనివారం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డికె అరుణ మాట్లాడుతూ పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తానేపెద్ద మంత్రినని తన కన్న చిన్నమంత్రి డికె అరుణ అనుకొని స్వార్థంతో గతంలో లేని విధంగా గ్రూపురాజకీయాలకు జూపల్లికృష్ణారావు అప్పట్లో శ్రీకారం చుట్టారని ఆరోపించారు. అనంతరం దేవాలయ శాఖ రావడంతో పేరుకు మాత్రమే దేవాదాయమని దాంట్లో ఆదాయం లేదని తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి తెలంగాణ పాట పాడుతున్నారని జూపల్లిపై విమర్శలు కురిపించారు. గతంలో గెస్ట్ హౌస్ నందుకారును ఆపే విషయంలో కూడా తనపై వివక్ష చూపించారని అన్నారు. నారాయణపేటలో తనకు చెప్పకుండానే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. వివిధ సందర్భాలల్లో తనపై చూపిన వివక్షను గురించి ఆమె వివరించారు. చివరకు దేవాదాయ శాఖ రావడంతో మున్ముందు ఎమ్మెల్యేగా గెలవాలనే స్వార్థంతోనే రాజీనామా చేసి తెలంగాణ పాట పాడుతున్నాడని ఆమె ఆరోపించారు. తెలంగాణ విషయంలో రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పక ముందే పార్టీని విడిపోవడం స్వార్థం కాదా అని ఆమె ప్రశ్నించారు. బిజెపి తెలంగాణ ఇస్తానని అంటున్న వారు అధికారంలోకి వచ్చేది లేదు, ఇచ్చేది లేదని వ్యగ్యంగా అన్నారు. సభలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, మల్లురవి, చిత్తరంజన్‌దాసు, రాంమోహన్‌రెడ్డి, స్థానిక నాయకులు కమలేశ్వర్‌రావు, వీరయ్య, రాంమూర్తినాయుడు పాల్గొన్నారు.
జిల్లాలో భారీగా చెక్‌పోస్టులు
లక్షలాది రూపాయలు స్వాధీనం
ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు : ఎస్పీ
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25: జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు నియోజకవర్గాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టుల దగ్గర ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత మూడు, నాలుగు రోజుల నుండి పోలీసుల తనిఖీలు పెద్దఎత్తున జరుగుతుండటంతో వ్యాపారస్తులకు, సామాన్య ప్రజానికానికి, రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. తనిఖీలలో పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుంటుండటంతో ముఖ్యంగా వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తున్న పోలీసులు తనిఖీలలో లక్షలాది రూపాయలు స్వాధీనం చేసుకుని ఆ డబ్బులను ఐటి అధికారులకు అప్పచెబుతున్నారు. శనివారం గోపాల్‌పేట మండలం ఏదుట్ల చెక్‌పోస్టు దగ్గర వాహనాలను తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి దగ్గర రూ. 1.99 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గోపాల్‌పేటలో కేసు నమోదు చేసి డబ్బులను ఐటిశాఖ అధికారులకు అప్పజెప్పారు. అదేవిధంగా జడ్చర్ల సమీపంలో గల మరికల్ చెక్‌పోస్టు దగ్గర దాదాపు రూ. 4 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చుట్టుపక్కల ప్రధాన రహదారుల గుండా పెద్దఎత్తున చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 20కి పైగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో నాయకులు సైతం గందరగోళానికి గురవుతున్నారు. కాగా జిల్లా ఎస్పీ లక్ష్మిరెడ్డి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాట్లతో పాటు సకల బందోబస్తు ఏర్పాటు చేసిందని అన్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ అసీంబ్లీ నియోజకవర్గాలలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే జిల్లాలో ఒక పౌరుడు ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి రూ. 10వేలకు మించి డబ్బులు కలిగి ప్రయాణిస్తే ఆ మొత్తానికి తగిన లెక్కలు చూపించాల్సి ఉంటుందని, లేకుంటే ఆ డబ్బును స్వాధీన పరుచుకోవల్సి ఉంటుందని అన్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బు లావాదేవీలు ఉంటే ఆ సొమ్మును చెక్కు లేదా డిడి రూపంలో ఇచ్చి పుచ్చుకోవడం చట్టబద్దత అవుతుందన్నారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలను అరికట్టడానికి జిల్లాలోని పోలీసు యంత్రాంగం విస్తృతంగా వాహనాలను తనిఖీ చేయాలని సూచించారు.