మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25: రెండు కళ్ల సిద్ధాంతం అవలంభిస్తున్న చంద్రబాబునాయుడు ముమ్మాటికి పచ్చి సమైక్యవాదేనని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని స్టార్ ఫంక్షన్‌హాల్‌లో తెరాస మహబూబ్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టిడిపిలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తెరాసలో చేరారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో బొంద పెట్టారని, వారు పోటీ చేసి దండగా అని, తెలుగుదేశం అంటేనే తెలంగాణ ప్రజలకు ఆవేశమని, ఆ ఆవేశాన్ని మరోసారి ఉప ఎన్నికల్లో చూయిస్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థులు చంద్రబాబు కావాలో.. తెలంగాణ ప్రజలు కావాలో తేల్చుకోవాలన్నారు. అవసరమైతే గ్రామాలకు తెలంగాణ ద్రోహులు రావొద్దంటూ విద్యార్థులు గోడలపై రాతలు రాసే పరిస్థితి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. 800 మంది బిడ్డల బలిదానాలను అపహాస్యం చేసిన చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ కూడా అంతే ద్రోహం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాటకాలను ప్రజలు అర్థం చేసుకున్నారని, ఇక వారి సంగతి ఓటు ద్వారా తేలుతుందన్నారు. టిడిపి కంచుకోటలకు బీటలు ఎప్పుడో వారాయని, ఆ పార్టీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలను పురస్కరించుకుని గ్రామాలను రచ్చబండలుగా ఏర్పాటు చేసి ఎవరిని తట్టినా తెలంగాణ సోహి తప్ప మరొకటి లేకుండా ఉండాలని కోరారు. ఉప ఎన్నికలను ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, ఆశామాషిగా తీసుకుంటే మోసం చేయడానికి కాంగ్రెస్, టిడిపిలు పన్నాగం వేస్తాయని తెలిపారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తెలంగాణ బిడ్డలు ఎక్కడ కూడా తలొగ్గదని తెలిపారు. మహబూబ్‌నగర్, కొల్లాపూర్‌లలో గులాబీ జెండా ఎగురనుందని, అదేవిధంగా ప్రజల ఆకాంక్ష కోసం రాజీనామా చేసిన నాగం జనార్ధన్‌రెడ్డిని కూడా తెలంగాణ బిడ్డలు కడుపులో పెట్టుకుని గెలిపించుకుంటున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలు గెలిస్తే సీమాంధ్రలో పండుగ చేసుకుంటారని, ఈ విషయాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ గ్రహించి కాంగ్రెస్, టిడిపిలను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తెరాస అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం, జిల్లా పార్టీ కన్వీనర్ విఠల్‌రావు ఆర్య, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు సుమన్, నాయకులు అమరేందర్, ఇంతియాజ్, రాజవరప్రసాద్, కృష్ణ, శివరాజ్, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
బిజెపితోనే తెలంగాణ సాధ్యం
కార్యకర్తల సమావేశంలో జాతీయ కార్యదర్శి లక్ష్మణ్
పాలమూరు, ఫిబ్రవరి 25: జాతీయ పార్టీ అయిన బిజెపితోనై తెలంగాణ రాష్ట్రం సాధ్యమని, నాలుగైదు ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాదని, జాతీయ స్థాయిలో ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉంటేనే తెలంగాణ వస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని బిజెపి జాతీయ కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి లక్ష్మణ్ మాట్లాడుతూ బిజెపి గెలిస్తేనే తెలంగాణ వస్తుందని, ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పార్టీ తరపున యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని బరిలోకి దింపుతున్నామని, ఈ ఎన్నికలపై రాష్ట్ర ప్రజల దృష్టి ఉంటుందని, ఊహించని ఫలితాలు ఉంటాయని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ భయ పడాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ బిజెపికి ఓటు వేయాలని ఆయన కోరారు. పాలు ఇచ్చే బర్రెకు గడ్డి వేస్తే పాలు ఇస్తుందని, ఈ విషయాన్ని ప్రతి బిజెపి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎంపి సీటు లేకున్నా పార్లమెంట్‌లో మాత్రం తెలంగాణ వాణిని, బాణిని వినిపిస్తున్న ఘనత తమ అధి నాయకురాలు సుష్మాస్వరాజ్‌కే దక్కుతుందని అన్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగే ఉప ఎన్నికల ప్రచారానికి అవసరమైతే సుష్మాస్వరాజ్‌తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కూడా రంగంలో దింపే అవకాశాలు ఉంటాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకునేందుకు భారీ వ్యూహంతో వచ్చామని, ప్రతి తెలంగాణ వాది, ప్రతి హిందువు బిడ్డ బిజెపికి ఓటు వేసి అటు తెలంగాణ వాదాన్ని ఇటు హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఆయన కోరారు. మజ్లిస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని, తెలంగాణ వస్తే మజ్లిస్ పార్టీ ఆటలు సాగవని భావించిన ఆ నేతలు ప్రజల్లోకి వచ్చే ప్రమాదం ఉందని, అందుకే తెలంగాణ వాదులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపుతో ఢిల్లీకి ఓ సంకేతం వెళ్లనుందని, బిజెపి ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో గెలిచిందని సంకేతం వినిపిస్తే ఇక తెలంగాణ వస్తుందని ఆ భయం కాంగ్రెస్ పార్టీకి కలిగించేలా నియోజకవర్గ ప్రజలకు అవకాశం వచ్చిందని తెలిపారు. బిజెపి గెలుపు తెలంగాణకు కొత్త మలుపు అనే నినాదంతో తాము ముందుకు వెళ్తున్నామని, జాతీయ పార్టీ ద్వారా తెలంగాణ వస్తుందనే ప్రచారాన్ని బిజెపి నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్డీఏ పక్షాలను ఒప్పించి తెలంగాణ వైపు మళ్లించిన ఘనత బిజెపికే దక్కుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలు గెలిచినా ఉపయోగం ఉండదని, జాతీయ పార్టీ బిజెపి గెలిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. గ్రామాల వారిగా నాయకులు, కార్యకర్తలు జోరుగా సమీకరణలు చేయాలని, అందుకు భారీ ప్రణాళికను రచించామని, ప్రతి ఓటు బిజెపికి పడే విధంగా వ్యూహాలు ఉన్నాయని, ప్రతి అస్త్రాన్ని ఉపయోగించుకుంటామని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్, టిడిపిలను బొంద పెడితేనే తెలంగాణ వస్తుందనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇందిర, బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నాగూరావు నామాజీ, రాములు, పద్మజారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బాల్‌రాజ్, రమాదేవి, బాలమణి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.