బెంగళూరు, జూన్ 3: కర్నాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా బిజెపి సాగించిన పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బిజెపి హయాంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగమైందని, వివిధ కుంభకోణాలు, అవినీతి కేసులతో రాష్ట్ర ప్రతిష్ట దారుణంగా దిగజారిందని కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు చెరిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ హెచ్.ఆర్.్భరద్వాజ్ చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విమర్శలు చేసింది. ‘కర్నాటకలో గత ఐదేళ్లుగా వెలుగుచూసిన అనేక కుంభకోణాలు, అవినీతి కేసులతో రాష్ట్రం పరువు ప్రతిష్టలు దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైంది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం ప్రజాస్వామ్య సాంప్రదాయాలకే హానికరమని రుజువైంది’ అని భరద్వాజ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు నీతిమంతమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించి వారిలో తిరిగి విశ్వాసాన్ని పెంపొందించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
భరద్వాజ్ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి, శాసనసభలో ప్రస్తుతం బిజెపి పక్షనేతగా వ్యవహరిస్తున్న జగదీష్ షెట్టార్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్న బిజెపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గవర్నర్ కొత్త సాంప్రదాయానికి తెర లేపారని, బిజెపి పాలనలో భారీగా అవినీతి చోటుచేసుకుందని చెప్పిన గవర్నర్ అందుకు ప్రత్యేకంగా ఒక్క ఉదంతాన్ని కూడా తన ప్రసంగంలో ప్రస్తావించలేదని షెట్టార్ ధ్వజమెత్తారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో పాలన సాగిస్తున్న యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం 2జి స్పెక్ట్రమ్ తదితర అనేక కుంభకోణాల్లో పీకల్లోతున కూరుకుపోయిందని, కనుక అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని జగదీష్ షెట్టార్ పేర్కొన్నారు.
* గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వజం
english title:
bjp rule
Date:
Tuesday, June 4, 2013