న్యూఢిల్లీ, జూన్ 3: మాజీ మంత్రులకు ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పిస్తోందో అర్థం కావడం లేదని సుప్రీం కోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి, బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు రామ్‌వీర్ ఉపాధ్యాయ్ చేసుకున్న విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు ఆయనను ప్రశ్నించింది. ‘మాజీ మంత్రి అయినంత మాత్రాన మీకు ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రత కల్పించాలా? ఇలా ఎందుకు చేయాలో మాకు అర్థం కావడం లేదు’ అని జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ మదన్ బి.లోకూర్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఉత్తరప్రదేశ్‌లో ఇంతకుముందు మాయావతి ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన రామ్‌వీర్ ఉపాధ్యాయ్‌కు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది. దీంతో ప్రభుత్వం తనకు పోలీసు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం కోర్టు ఎటువంటి ఉత్తర్వునూ జారీ చేయలేదు. రామ్‌వీర్ ఉపాధ్యాయ్ తన విజ్ఞప్తిపై ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో ఉన్న అలహాబాద్ హైకోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. అయితే ఈ కేసుపై తాము విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. రామ్‌వీర్ ఉపాధ్యాయ్ ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉందో వివరించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది ఈ నెల 5వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
* ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు
english title:
former minister
Date:
Tuesday, June 4, 2013