లండన్, జూన్ 3: భారత్, పాకిస్తాన్, చైనా దేశాలు ఇబ్బడిముబ్బడిగా ఆయుధ సంపత్తిని విస్తరించుకుంటున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఓ పక్క శాంతిమంత్రం జపిస్తూనే మూడు దేశాలు అణ్వాయుధాలు సమకూర్చుకోవడంలో పోటీ పడుతున్నాయని స్టాక్‌హోమ్‌కు చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (ఎస్‌ఐపిఆర్‌ఐ) తన సర్వేలో తెలిపింది. ఆసియా ఖండంలో శాంతి స్థాపనకు ఈ విపరీత ధోరణి విఘాతం కల్పిస్తుందని తెలిపింది. 2012లో భారత్ 10 అణ్వాయుధాలు సమకూర్చుకుంది. ఇప్పటికే భారత్ వద్ద 90 నుంచి 110 వరకూ ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. పాకిస్తాన్ విషయానికొస్తే పది అణ్వాయుధాలను విస్తరించుకుంది. పాక్ వద్ద వంద నుంచి 120 వరకూ అణ్వాయుధ సంపత్తి ఉన్నట్టు తెలిపింది. చైనా సైతం ఆయుధ సంపత్తి సమకూర్చుకోవడంలో ముందుందని సంస్థ పేర్కొంది. భారత్, పాకిస్తాన్ దేశాలు క్షిపణి సరఫరా సామర్థ్యాన్ని బాగా విస్తరిస్తున్నాయని, ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోటాపోటీగా ఆయుధాగారాలను విస్తరించుకుంటూ పోతున్నాయని తెలిపింది. ఎవరికి వారు అణ్వాయుధాలు పెంచుకుంటూ వెళ్లడం వల్ల ఆసియా ఖండంలో శాంతి ప్రశ్నార్థకంగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పొరుగుదేశాలతో ఘర్షణ వాతావరణం, సరిహద్దుల్లో ఉద్రిక్తత, తీవ్రవాదానికి సహకారం అందించడం వంటి వాటి నుంచి పూర్తిగా బయటపడాలన్నారు. సామూహిక ఆయుధ సంపత్తిని తగ్గించుకునే దిశగా అమెరికా, రష్యా చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయని సర్వే స్పష్టం చేసింది. అణ్వాయుధాల అనే్వషణ, విస్తరణ విషయాల్లో ఒకప్పటి సూపర్ పవర్ దేశాలైన అమెరికా, రష్యా విధించుకున్న నిషేధం పనిచేసిందని వివరించింది. 2012లో రష్యా 10వేల నుంచి 8,500కు, యుఎస్ 8వేల నుంచి 7,700కు అణ్వాయుధాలను తగ్గించుకున్నట్టు వెల్లడించింది. ఫ్రాన్స్, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు ఆయుధాలను తగ్గించుకున్నట్టు పేర్కొంది. అణ్వాయుధాల విస్తరణకు సంబంధించి యుఎస్, రష్యాలతో పోల్చుకుంటే చైనాలో పారదర్శకత తక్కువగానే ఉందని ఆరోపించింది. అణ్వాయుధ దేశాలుగా పేర్కొనే చైనా, ఫ్రాన్స్, రష్యా, యుకె, యుఎస్‌లలో చైనాలోనే విస్తరణ నిరాటకంగా సాగుతోందని సర్వే తెలిపింది. ఆయుధ ఎగుమతుల్లో ఐదో పెద్ద దేశమైన బ్రిటన్‌ను ఈ ఏడాదిలోగా చైనా అధిగమించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆయుధ ఎగుమతుల్లో యుఎస్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ సరసన బ్రిటన్ ఉంది. త్వరలో బ్రిటన్ స్థానాన్ని చైనా ఆక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారత్, పాక్, చైనాల్లో విస్తరణ * ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడి
english title:
no decrease
Date:
Tuesday, June 4, 2013