న్యూఢిల్లీ, జూన్ 3: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేయటం పట్ల రాష్ట్ర కాంగ్రెస్, ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు, నాయకులు తీవ్ర ఆందోళన, నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌తో చెప్పినట్లు తెలిసింది. బొత్సా సత్యనారాయణ సోమవారం ఢిల్లీకి వచ్చిన అనంతరం సాయంత్రం ఆజాద్‌తోపాటు లోక్‌సభ నాయకుడు, హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేను విడివిడిగా కలుసుకుని రాష్ట్ర రాజకీయాల గురించి వివరించినట్లు తెలిసింది. రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేసేందుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి అనుమతి ఇవ్వటం వలన రాజకీయంగా తీరని నష్టం కలిగిందని ఆయన ఇద్దరు సీనియర్ నాయకులకు స్పష్టం చేశారని అంటున్నారు. రవీంద్రా రెడ్డి మంత్రి పదవికి ఇదివరకే చేసిన రాజీనామాను ఆమోదిస్తే సరిపోయేదనీ, దీనికి బదులు అతన్ని బర్తరఫ్ చేసేందుకు అనుమతి ఇవ్వటం వలన రాష్ట్ర మంత్రులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించినట్లు చెబుతున్నారు. రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేయటం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లు అయ్యిందని కూడా ఆయన చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉంటే రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేసేందుకు అనుమతి ఇవ్వటంపై అధినాయకత్వానికి తమ నిరసనతో కూడా అభిప్రాయాన్ని చెప్పేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి ఢిల్లీకి వచ్చారు. ఆజాద్‌తోపాటు కాంగ్రెస్ అధినాయకత్వానికి చెందిన మరికొందరు సీనియర్ నాయకులను ఆయన కలుసుకుని తమ అభిప్రాయాలను వివరించనున్నారు. రవీంద్రా రెడ్డిని బర్తరఫ్ చేయటం వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం సంభవించిందని ఆయన అధినాయకులకు చెప్పనున్నారు.
* డిఎల్ బర్తరఫ్‌పై ఢిల్లీలో బొత్స
english title:
botsa
Date:
Tuesday, June 4, 2013