న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఉద్దేశించిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం)ను దేశవ్యాప్తంగా ముఖ్యంగా మధ్య, ఈశాన్య భారతంలో వేగవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ పిలుపునిచ్చారు. వచ్చే సంవత్సరం లోక్‌సభకు ఎన్నికలు జరుగనుండటంతో పాటు బిజెపి పాలిత మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సహా అయిదు రాష్ట్రాల విధాన సభల ఎన్నికలు ఈ సంవత్సరం జరుగనున్న దృష్ట్యా సోనియా గాంధీ ఈ ‘ఆజీవిక మిషన్’ అమలును వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎంను ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో సోనియా మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వానికి బలహీన వర్గాలు, మహిళల సాధికారతే మూల స్తంభాలని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి కొండ ప్రాంతాల్లో అమలు చేయడానికి ఓ ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేసినట్లు సోనియా ప్రకటించారు. వచ్చే పదేళ్లలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఏడు కోట్ల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయని ఆమె పేర్కొన్నారు. అయితే దీన్ని సాధించడం అంత సులభం కాదని అన్నారు. కాని, అనేక రాష్ట్రాలు ఆజీవిక మిషన్‌ను అమలు చేస్తూ, మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక మార్పులు తేవచ్చని రుజువు చేశాయని ఆమె అన్నారు. ఈ విజయాన్ని చూసే ఇప్పుడు ఆజీవిక మిషన్‌ను దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి మధ్య, ఈశాన్య రాష్ట్రాల్లో వేగవంతంగా అమలు చేయడానికి పూనుకున్నట్లు సోనియా చెప్పారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2011 జూన్‌లో ఆజీవిక మిషన్‌ను ప్రారంభించింది. సమర్థవంతమైన సంస్థలు, ఆర్థిక సేవల సహాయంతో గ్రామీణ పేదలు తమ జీవనోపాధిని పొందడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించినదే ఈ మిషన్. ఎనిమిది నుంచి పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఆరు వందల జిల్లాల్లోని ఆరు వేల బ్లాకుల్లో గల రెండున్నర లక్షల గ్రామ పంచాయతీల పరిధిలోని ఆరు లక్షల గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి, వాటికి ఆర్థిక సేవలను అందించడం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఏడు కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో ఆజీవిక మిషన్‌ను ప్రారంభించారు.
యుపిఎ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమం ఎన్‌ఆర్‌ఎల్‌ఎం అని ప్రశంసిస్తూ, మహిళా సాధికారతకు ఉద్దేశించిన ఇంత భారీ పథకం ప్రపంచంలోని మరే దేశంలోనూ లేదని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఈ పథకం దారిద్య్ర కూపం నుంచి మహిళలకు విముక్తి కల్పిస్తుందని నేడు ప్రతి ఒక్కరూ రుజువు చేశారని అన్నారు. ఈ పథకం ద్వారా మరెవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా కేవలం నిలకడైన స్వయం ఉపాధి సాధించుకోవడం ద్వారా మహిళలు పేదరిక శృంఖలాల నుంచి విముక్తులవుతారని ఆమె పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేయడమే మన ప్రభుత్వ ధ్యేయమని సోనియా అన్నారు. సోనియా తన ప్రసంగంలో జమ్మూకాశ్మీర్‌కు చెందిన స్వయం సహాయక బృందం సభ్యురాలు ఒకరు సాధించిన విజయాన్ని ప్రస్తావించారు. అంతకు ముందు ఆ సభ్యురాలు వేదిక పైనుంచి మాట్లాడుతూ స్వయం సహాయక బృందంలో చేరడం ద్వారా తాను ఆర్థికంగా ఎలా ఎదిగిందో వివరించారు. (చిత్రం) జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ను ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక బృందం కార్యకర్తలతో మాట్లాడుతున్న సోనియా గాంధీ
ఎన్‌ఆర్‌ఎల్‌ఎం వార్షికోత్సవంలో సోనియా పిలుపు * ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ
english title:
sonia
Date:
Tuesday, June 4, 2013