కాబూల్, జూన్ 3: అఫ్గానిస్తాన్‌లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్లలో 20 మంది చనిపోయారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లోని రద్దీగల ఓ మార్కెట్ వెలుపల అమెరికా సైనిక దళాలను లక్ష్యంగా చేసుకుని పేలిన ఆత్మాహుతి బాంబు 13 మంది ప్రాణాలను తీయగా, ఇందులో 10 మంది పాఠశాల విద్యార్థులున్నారు. అలాగే తూర్పు ప్రావిన్స్ లగ్మన్‌లో పేలిన ల్యాండ్‌మైన్ ఏడుగురిని బలి తీసుకుంది. సమ్‌కని జిల్లాలో గల మార్కెట్ వెలుపల మధ్యాహ్న సమయంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ద్విచక్ర వాహనంపై పేలుడు పదార్థాలను అమర్చుకుని వచ్చిన ఆత్మాహుతి బాంబు పేలిందని, ఇదే సమయంలో స్థానిక పాఠశాల విద్యార్థులు భోజన విరామం కావడంతో బయటకు వచ్చారని దీంతో 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని పక్టియా ప్రావిన్స్ పోలీస్ చీఫ్ జెన్ జెల్మియా ఒరియఖైల్ తెలిపారు. కాగా, ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారని అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా సైనిక కూటమి స్పష్టం చేసింది. అయితే వారు ఏ దేశానికి చెందినవారనేది ఇంకా నిర్ధారించలేదు. అఫ్గాన్ పోలీస్ అధికారి కూడా ఒకరు చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు తూర్పు ప్రావిన్స్ లగ్మన్‌లో పేలిన ల్యాండ్‌మైన్ ఏడుగురు పౌరులను పొట్టనబెట్టుకుంది. వంటచెరకు సేకరణ నిమిత్తం వెళ్లిన వీరి వాహనం ల్యాండ్‌మైన్‌పై నుంచి వెళ్లడంతో ఈ పేలుడు సంభవించిందని, వాహనంలో ఉన్నవారంతా మరణించారని, మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులతోపాటు వాహనం డ్రైవర్ ఉన్నారని స్థానిక ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది. తాలిబన్ తీవ్రవాదులు అఫ్గాన్ ప్రభుత్వాన్ని, అంతర్జాతీయ సంస్థలను, అమెరికా సైనిక కూటమిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. రోడ్లకు ఇరువైపుల అమర్చిన బాంబులు పేలి అమాయకులు మరణిస్తున్నారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా దాడితో అఫ్గాన్‌లో ప్రవేశించిన అమెరికా సేనలు తాలిబన్ల నిర్మూలనే లక్ష్యంగా గత పనె్నండేళ్లుగా పోరాడుతున్నది విదితమే.
మృతుల్లో 10 మంది చిన్నారులు!
english title:
20 killed
Date:
Tuesday, June 4, 2013