బీజింగ్, జూన్ 3: చైనాలోని జిలిన్ రాష్ట్రంలో సోమవారం ఉదయం కోళ్ల కబేళాలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 112 మంది కార్మికులు మృతి చెందారు. మరో 54 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జిలిన్ బయోయువాన్‌ఫెంగ్ పౌల్ట్రీ కంపెనీకి చెందిన ఈ కోళ్ల కబేళాలో ఉదయం ఆరు గంటలకు అగ్ని ప్రమాదం సంభవించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. జిలిన్ రాష్ట్ర రాజధాని చాంగ్‌చున్‌కు ఈశాన్యంగా వంద కిలో మీటర్ల దూరంలోని దెహుయి నగరానికి చెందిన మిషాజి టౌన్‌షిప్‌లో గల ఈ కోళ్ల కబేళాలో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో 300 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. అకస్మాత్తుగా పెద్దశబ్దం వినిపించిందని, వెంటనే కబేళా ఆవరణ అంతటా దట్టమైన నల్లని పొగలు వ్యాపించాయని వారు వివరించారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ప్లాంట్ గేటుకు తాళం వేసి ఉంది. అయినప్పటికీ సుమారు వంద మంది కార్మికులు ప్లాంట్ బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకోగలిగారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
‘వంద మందితో కలిసి వర్క్‌షాప్‌లో ఉదయం ఆరు గంటలకు పనిచేయడం ప్రారంభించాం. ప్లాంట్‌లో రెండు వర్క్‌షాప్‌లు ఉన్నాయి’ అని కాలిన గాయాలతో బయటపడిన 44 ఏళ్ల మహిళ వాంగ్ ఫెంగ్యా తెలిపింది. ‘బయటకు పరిగెత్తండి’ అంటూ ఎవరో ఒకరు అరవడంతో మేము వెంటనే వర్క్‌షాప్ నుంచి బయటకు వెళ్లే మార్గం వైపునకు పరిగెత్తాం. ఆ మార్గం నేనున్న చోటు నుంచి 40 మీటర్ల దూరంలో ఉంది. అకస్మాత్తుగా లోపలి నుంచి మంటలు వ్యాపించి ప్లాంట్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది’ అని వాంగ్ చెప్పింది. బయటకు పరిగెత్తుతూ కింద పడిన తనకు కాలిన గాయాలయ్యాయని ఆమె తెలిపింది. మొత్తానికి బయటకు పెరిగెత్తిన తాను వెనుకకు చూడగా ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కనిపించిందని ఆమె తెలిపింది.
ఈ ప్లాంట్‌లో లోపలి నిర్మాణం బాగా లేదని, పైగా ఇందులో అగ్ని ప్రమాదం సంభవించడంతో బయటకు వెళ్లే మార్గం చిన్నగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టంగా మారిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంటలను ఆర్పిన తరువాత కూడా స్టీల్ ఫ్రేమ్‌తో నిర్మించిన ఈ భవనంలో దట్టమైన పొగలు ఆవరించి ఉండటం కనిపించింది. ఈ అగ్నిప్రమాదం వల్ల వాతావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందోననే కోణంలో పర్యావరణ పరిరక్షణ సంస్థ పరిశీలిస్తోంది. 2009 సెప్టెంబర్‌లో ప్రారంభించిన జిలిన్ బయోయువాఫెంగ్ పౌల్ట్రీ కంపెనీలో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏడాదికి 67వేల టన్నుల కోడిమాంసాన్ని (చికెన్‌ను) ఈ కంపెనీ సరఫరా చేస్తోంది.
54 మందికి గాయాలు * చైనాలో ఘోర అగ్నిప్రమాదం
english title:
kabela
Date:
Tuesday, June 4, 2013