న్యూఢిల్లీ, జూన్ 3: దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకోవటానికి దారితీసిన పరిస్థితులపై ప్రధాని మన్మోహన్‌సింగ్ జాతికి వివరణ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. ఎన్డీఏ అప్పగించిన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను యుపీఏ పూర్తిగా నాశనం చేసిందని పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ ఆరోపించారు. ఆర్థిక రంగంలో నిష్ణాతుడైన వ్యక్తి ఏ దేశానికి అధినేతగా లేడని చెబుతూ భారత చరిత్రలో ఇప్పటివరకూ ఈ విధమైన తిరోగమనం మన్మోహన్ హయాంలోనే జరిగిందని సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. దేశ ఆర్థిక చరిత్రలో మన్మోహన్ సింగ్ హయాం ఓ దుర్దశగా గుర్తుండి పోతుందని ఆయన అన్నారు. అభివృద్ధి రేటు ఐదు శాతానికి, పారిశ్రామికాభివృద్ధి ఒక శాతానికి, ప్రాథమిక సదుపాయాల కల్పన రెండు శాతానికి దిగజారిపోయాయని ఆయన విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు విపరీతంగా తగ్గిపోయాయని అన్నారు. గత ఏడాది 22 బిలియన్ డాలర్ల మేరకు లభించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాదిలో పది బిలియన్ డాలర్లకు పడిపోయాయని చెప్పారు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు అడ్డూ అదుపులేకుండా పోవటంతో ప్రజా జీవితం నరకంగా మారిపోయిందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా భారత్ నిర్మాణ్ గురించి తెగ ప్రచారం చేసుకోవటం విడ్డూరంగా ఉందని రూడీ ఎద్దేవా చేశారు. కుంభకోణాలతో కుదేలవుతున్న యుపీఏ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయిని ఆయన జోస్యం చెప్పారు.
ఆహార భద్రత బిల్లుపై సభలో పూర్తి స్థాయిలో చర్చించిన తరువాతే చట్టం చేయాలన్నదే బిజెపి అభిమతమని అన్నారు. ఈ బిల్లుతో పాటు భూసేకరణ బిల్లుకు చట్టరూపం ఇవ్వటానికి ఉద్దేశించిన బిల్లును చట్టం చేయటానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. సాలీనా వంద రోజులు పని కల్పిస్తామని ఇచ్చిన హామీ నవ్వుల పాలవుతోందని ఆయన చెప్పారు. అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఐపిఎల్ క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్‌ను తెరపైకి తెచ్చారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
* ప్రధాని మన్మోహన్‌పై బిజెపి నిప్పులు
english title:
economy
Date:
Tuesday, June 4, 2013