చెన్నై, జూన్ 4: అంతర్గత భద్రతపై చర్చించడానికి ఈ నెల 5న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో తన ప్రసంగాన్ని పది నిమిషాల్లో ముగించాలంటూ షరతు పెట్టడాన్ని అవమానంగా భావించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అయితే తనకు బదులుగా ఒక రాష్టమ్రంత్రిని, సీనియర్ అధికారులను పంపించాలని ఆమె నిర్ణయించారు. ‘పది నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించాలంటూ షరతులు పెట్టే సమావేశానికి హాజరుకావడంకన్నా ప్రసంగ పాఠాన్ని టేబుల్‌పై ఉంచడం మంచిది. నా తరఫున సమావేశానికి రాష్ట్ర పురపాలక, గ్రామీణాభివృద్ధి న్యాయ శాఖల మంత్రి కెపి మునిస్వామిని, హోం కార్యదర్శి, డిజిపిలను పంపిస్తున్నాను’ అని జయలలిత సోమవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసారు. అయితే సమావేశం అజెండాలోని అన్ని అంశాలను ఎంతో చిత్తశుద్ధితో పరిశీలించానని, ఈ అంశాలన్నిటిపైనా తమిళనాడు ప్రభుత్వ అభిప్రాయాలను తన ప్రసంగ పాఠంలో తెలియజేయడం జరుగుతుందని జయలలిత ఆ లేఖలో తెలియజేసారు. జయలలిత లేఖలోని ముఖ్య అంశాలను మంగళవారం పత్రికలకు విడుదల చేసారు. ఈ మేరకు సమావేశంలో జయలలిత ప్రసంగాన్ని మునుస్వామి చదివి వినిపిస్తారు. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహిస్తారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఏర్పాటు చేసే ఇలాంటి సమావేశాలు మొక్కుబడి వ్యవహారంగా ఉండడం, అజెండాలోని అన్ని అంశాలపై ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వకపోవడం అనేది తనకు అనుభవమేనని ఆమె ఆ లేఖలో అన్నారు. అలాగే ఈ సమావేశంలో కూడా 12 అంశాల సుదీర్ఘ అజెండా ఉందని, ఆ అంశాల పేర్లను చదవడానికే పది నిమిషాలు చాలదని, అలాంటిది ముఖ్యమంత్రులు ప్రసంగించడానికి పది నిమిషాలు కేటాయించడం ఏమిటని జయలలిత తన లేఖలో ప్రశ్నించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహం సిఎంల భేటీకి వెళ్లకూడదని నిర్ణయం
english title:
p
Date:
Wednesday, June 5, 2013