హైదరాబాద్, జూన్ 4: మద్యం బెల్టు దుకాణాలను సమూలంగా తొలగించి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలని మద్య నియంత్రణ ఉద్యమ సదస్సు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తద్వారా మద్యం విక్రయాలపై నియంత్రణ చేపట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరింది. దాదాపు రెండు లక్షల బెల్టు షాపుల ద్వారా రాష్ట్రంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, సమాజంలో ఉన్న అన్ని సమస్యలకన్నా మద్యం అతి పెద్ద సమస్యగా తయారైందని సదస్సులో పాల్గొన్న పలు పార్టీల ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నాడిక్కడ రవీంధ్రభారతిలో మద్య నియంత్రణ సదస్సు జరిగింది. ఈ సదస్సులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎన్. తులసిరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, తెరాస నేత నాయిని నర్సింహారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కఠారి శ్రీనివాసరావు, తెలుగు దేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, న్యూడెమోక్రసి నేత దివాకర్‌రావుతదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. మద్యం విక్రయాల నియంత్రణపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందని, ఆదాయ వనరుగా భావించి మద్యం విక్రయాలను విచ్చలవిడి చేశారని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం అమలు సాధ్యం కాదంటున్న ప్రభుత్వం కనీసం నియంత్రణ విధాన్నైనా సక్రమంగా అనుసరించాలని వారు డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం అసలు ఆదాయ వనరుగా చూడరాదని కోరింది. ఈ సదస్సును కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య ప్రారంభించగా, రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అధ్యక్షత వహించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణ మాఫీ, రెండో సంతకం బెల్టు దుకాణాల తొలగింపు ఫైళ్లపై సంతకాలు చేస్తానని అన్నారు. బెల్టుషాపుల తొలగింపుపై సిఎం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తే అందుకు మద్య నియంత్రణ కమిటీ చేసే కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి మాట్లాడుతూ 2004 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న మేరకు క్రమేణా మద్య నియంత్రణను ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. రిటైల్ దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మద్యం దుకాణాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న నేతలెవరికి రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వవద్దని, మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న మద్యం మాఫియాను నిర్మూలించేందుకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లే ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయిస్తోందని అన్నారు.
నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేందుకు చట్టం తేవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మద్య నియంత్రణ కమిటీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తొలుత స్వాగతోపన్యాసం చేశారు. ఐద్వా నాయకురాలు మల్లు స్వరాజ్య లక్ష్మి, మహిళాభ్యుదయ సమితి అధ్యక్షురాలు టి. అరుణ తదితరులు మద్య నియంత్రణను ప్రభుత్వం చేపట్టాలని ధ్వజమెత్తారు.
మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రవీంధ్రభారతిలో జరిగిన సదస్సులో ప్రసంగిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు,
కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి. వేదికపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డితో బాబు మాటామంతీ.