న్యూఢిల్లీ, జూన్ 4: ప్రముఖులు ప్రయాణించడం కోసం సుమారు 3,500 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం రద్దయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సంబంధించి నిలిపివేసిన సుమారు 2,400 కోట్ల రూపాయలను చెల్లించాలని అగస్టావెస్ట్‌లాండ్ సంస్థ కేంద్రాన్ని కోరింది. అంతేకాకుండా ఈ చెల్లింపులను నిలిపివేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కూడా పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖతో కాంట్రాక్ట్‌కు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమకు చెల్లించాల్సిన పేమెంట్లను విడుదల చేయాలని రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు రాసిన ఒక లేఖలో ఈ ఆంగ్లో-ఇటాలియన్ సంస్థ కోరింది. హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి కుదుర్చుకున్న సుమారు 3,600 కోట్ల రూపాయల ఒప్పందానికి సంబంధించి 30 శాతం సొమ్మును భారత్ ఈ సంస్థకు చెల్లించింది. అయితే ఈ ఒప్పందం తమకు అనుకూలంగా వచ్చేలా చూడడం కోసం 362 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారన్న ఆరోపణపై ఇటలీ దర్యాప్తు అధికారులు ఈ హెలికాప్టర్ల తయారీదారులయిన ఫిన్‌మెకానికా, అగస్టా సంస్థల మాజీ సిఈఓలను అరెస్టు చేయడంతో మిగతా చెల్లింపులను నిలిపివేసింది. అయితే భారత్, ఇటలీ చట్టాల ప్రకారం, నేరం రుజువయ్యే దాకా ఏ వ్యక్తి, లేదా సంస్థను దోషిగా పేర్కొనడానికి వీల్లేదని, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులు రెండు దేశాల్లోను ఇంకా జరుగుతున్నాయని ఆ సంస్థ పేర్కొనింది. అంతేకాదు, ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయడానికి లేదా, చెల్లించాల్సిన పేమెంట్లను నిలిపివేయడానికి కానీ కాంట్రాక్ట్ లేదా దానికి సంబంధించి కుదుర్చుకున్న ఒడంబడిక కానీ రక్షణ శాఖకు ఎలాంటి అధికారాలను ఇవ్వలేదని కూడా ఆ సంస్థ పేర్కొంటూ, అలాంటి చర్యలు ఒప్పందాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని ఆ సంస్థ రక్షణ శాఖకు రాసిన లేఖలో తెలియజేసింది. అగస్టావెస్ట్‌లాండ్ మేనేజింగ్ డైరెక్టర్ జెఫ్ హూన్ ఈ లేఖ రాసారు.
ఈ ముడుపుల కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఒక కేసును నమోదు చేసి వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఎస్‌పి త్యాగి, ఆయన సమీప బంధువులు ముగ్గురిని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
పేమెంట్లకు సంబంధించి రక్షణ అధికారులతో సమావేశం కోసం తాము గత ఫిబ్రవరినుంచీ ప్రయత్నిస్తున్నామని, అయినా ఇప్పటివరకు ఆ శాఖనుంచి ఎలాంటి సమాధానం రాలేదని అగస్టా వెస్ట్‌లాండ్ సంస్థ ఆ లేఖలో పేర్కొంది. డెలివరీ చేసిన హెలికాప్టర్లకు సంబందించి అగస్టా వెస్ట్‌లాండ్ తన హామీలన్నిటినీ నెరవేర్చిందని, అయినప్పటికీ పేమెంట్లు అందలేదని ఆ సంస్థ పేర్కొనింది.
12 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి 3,600 కోట్ల రూపాయలకు కుదుర్చుకున్న ఈ ఒప్పందం కింద తొలి విడతగా మూడు హెలికాప్టర్లు గత నెల పాలమ్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. మరో మూడు హెలికాప్టర్లు వచ్చే నెలలో రావలసి ఉంది. మిగతా ఆరు హెలికాప్టర్లను ఈ ఏడాదిలోనే డెలివరీ చేయాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం నాలుగు విడతలుగా అందే విమానాలకు సంబంధించిన చెల్లింపులను ఆయా హెలికాప్టర్లు అందిన తర్వాత మన దేశం చెల్లించాలి. అయితే ఈ దశలో కూడా మన దేశం మొత్తం సొమ్మును వెనక్కి రాబట్టగలదని కుంభకోణం తర్వాత రక్షణ మంత్రి ఆంటోనీ చెప్పడం గమనార్హం.
నిలిపివేయడం ఒప్పంద ఉల్లంఘనే ప్రభుత్వానికి అగస్టా వెస్ట్‌లాండ్ లేఖ
english title:
b
Date:
Wednesday, June 5, 2013