Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విచారణ ముగిసింది.. చర్య మిగిలింది

$
0
0

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను ధిక్కరించిన 18 మంది ఎమ్మెల్యేలపై విచారణ మంగళవారం ముగిసింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీర్పును రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు విప్‌ను దిక్కరించారు. వీరిలో ఈరోజు టిడిపి ఎమ్మెల్యేలు సముద్రాల వేణుగోపాలాచారి, హరీశ్వర్‌రెడ్డి స్పీకర్ వద్ద విచారణకు హాజరై తమ వాదన వినిపించారు. తమకు విప్ అందలేదని వారు స్పీకర్‌కు తెలపగా, టిడిపి విప్ దూళిపాళ్ళ నరేంద్ర విప్‌ను అందజేసినట్టు తెలిపారు. వాదనలు విన్న స్పీకర్ తన తీర్పును రిజర్వ్ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలు 9 మంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 9 మంది విప్‌ను దిక్కరించారు. వీరిపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతూ కాంగ్రెస్, టిడిపి విడివిడిగా స్పీకర్‌కు ఫిర్యాదు చేశాయి. తాము విప్‌ను దిక్కరించామని, వెంటనే చర్య తీసుకుని ఉప ఎన్నికలు జరిగేట్టు చూడాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన టిడిపి,కాంగ్రెస్ ధిక్కార ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లిఖితపూర్వకంగా తెలిపారు. టిడిపి ఎమ్మెల్యేలు కొందరు తమకు విప్ అందలేదని తెలిపారు. సాధారణ ఎన్నికల గడువు సమీపిస్తున్నందున అనర్హత వేటు వేసినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు మొదటి నుంచి తమపై అనర్హత వేటు త్వరగా వేయాలని, ఉప ఎన్నికలు జరిగేట్టు చూడాలని కోరుతున్నారు.
గంగులపై ఫిర్యాదు
తాజాగా మరో ఎమ్మెల్యేపై టిడిపి స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ టిడిపి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆయనపై అనర్హత వేటువేయాలని విప్ దూళిపాల నరేంద్ర స్పీకర్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. విప్‌ను దిక్కరించిన 18 మంది ఎమ్మెల్యేలతో పాటు గంగుల కమలాకర్ పై కూడా ఒకే సారి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఫిర్యాదుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు నోటీసు జారీ చేశారు.

పంచాయతీ తర్వాతే రచ్చబండ

అప్పుడే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్లు మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: పంచాయతీ ఎన్నికల తర్వాతనే మూడవ విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, జె గీతారెడ్డి, ఎన్ రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, శైలజానాథ్ తదితరులు పాల్గొని చర్చించిన అంశాలను కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు వివరించారు. రచ్చబండ మొదటి, రెండో విడతల్లో వచ్చిన దరఖాస్తులతో పాటు ఈ ఏడాది మే 31 వరకు అందిన ఆర్జీలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. అలాగే ఇందిరమ్మ కళలకు సంబంధించి మండలిలో అనుమతి పొందిన పనులను మూడవ విడత రచ్చబండలో శంకుస్థాపనలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించినట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వివిధ జిల్లాల్లో జరిపిన పర్యటనలు, ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై వివిధ పనులకు సంబంధించి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆయా పనులకు టెండర్లు ఖరారు చేయాలనీ, వాటికి కూడా మూడవ విడత రచ్చబండలో చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. డిసెంబర్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన మేరకు తెలుగుబాట పేరుతో రాష్టవ్య్రాప్తంగా జిల్లాల్లో ప్రతీ నెల ఒ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన వివరించారు. ఈ నెల 7న దీనిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్టు మంత్రి కన్నా తెలిపారు. పెన్షన్లు, ఇళ్ళు, రేషన్ కార్డుల కోసం గత మే 31 నాటికి అందిన దరఖాస్తులను పరిశీలించి, మూడవ దశ రచ్చబండలో పంపిణి చేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.

2013-14 రుణ ప్రణాళిక

రూ.1,33,074 కోట్లు

సేద్యానికి 67,224 కోట్లు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: రాష్ట్ర రుణ ప్రణాళికను 2013-14 సంవత్సరానికి 1,33,074 కోట్ల రూపాయలతో రూపొందించారు. 181వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బిసి) సమావేశం సందర్భంగా ఈ రుణప్రణాళికను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజ్ కృష్ణా హోటల్‌లో మంగళవారం ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి 67,224 కోట్లు, ఇతర ప్రాధాన్యతారంగాలకు 32,670 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాధాన్యతేతర రంగాలకు 33,180 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమితి నిర్ణయించింది. వ్యవసాయ రంగానికి గత ఏడాది కన్నా 14,252 కోట్ల రూపాయలు ఎక్కువ రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మట్లాడుతూ, వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో స్వయం సహాయ గ్రూపులకు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. కౌలు రైతులకు కూడా లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కౌలురైతులకు రుణాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సేద్యంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు అవసరమైన రుణాలు సమకూర్చ గలిగితేనే రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించగలరని పేర్కొన్నారు. రైతులకు సౌరవిద్యుత్ మోటార్లను ఇవ్వాలని నిర్ణయించామని, ఒక్కో మోటార్‌కు 5.50 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇందులో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని, మిగతా నిధుల్లో 80 శాతం వరకు బ్యాంకులు రుణంగా ఇస్తే, మిగతా మొత్తాన్ని రైతులు భరిస్తారని తెలిపారు.
యాంత్రిక సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ విషయంలో బ్యాంకర్లు కూడా సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. రైతులందరిపేర్లతో అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు.
స్వయం సహాయ గ్రూపులకు ఇస్తున్న రుణాలను వసూలుతో పాటు, పాత బకాయిలను వసూలు చేసేందుకు తాము సహకారం అందిస్తామని స్ర్తిశిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. వికలాంగులకు రుణాలు ఇచ్చే సమయంలో స్టాంపుడ్యూటీ వసూలు చేయవద్దని ఆమె కోరారు.
‘మీసేవ’ పహణీలు సరిగా లేవు
మీసేవలో ఇచ్చే పహణీలు, అడంగల్‌లన్నీ పూర్తిగా సరైనవి కావని, 10 శాతం వరకు తప్పులు దొర్లుతున్నాయని, అందువల్ల బ్యాంకర్లు జాగ్రత్తగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి హెచ్చరించారు. కౌలురైతులతో పాటు అటవీభూములు, దేవాలయ భూములు సాగు చేసే రైతులకు కూడా రుణసదుపాయం కల్పించాలని కోరారు.
ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా కింద రైతులకు లభించే నిధులను రుణాల కింద జమచేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాణిక్య వరప్రసాదరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి తదితరులు మాట్లాడారు.

చేపమందుపై లోకాయుక్త తీర్పు వాయిదా

హైదరాబాద్, జూన్ 4: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది బత్తిన సోదరులు ఆస్త్మా, ఉబ్బసం తదితర రోగులకు పంపిణీ చేస్తున్న చేపమందుకి సంబంధించిన వివాదంపై వచ్చిన పిటిషన్‌ను విచారించిన లోకాయుక్త తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అంతకు ముందు మంగళవారం లోకాయుక్త ఎదుట నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ, నగర పాలక సంస్ధ కమిషనర్ కృష్ణబాబు, ఎగ్జిబిషన్ మైదానం సొసైటీ కార్యదర్శి సుఖేష్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే తాము చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు కమిషననర్ అనురాగ్ శర్మ లోకాయుక్తకు తెలిపారు. నగర పాలక సంస్ధ కమిషనర్ కృష్ణబాబు మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒక అంశంపై గుమిగూడినప్పుడు నగర పాలక సంస్ధ అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని, ఇది కర్తవ్యంలో భాగంగా చేస్తున్నామని వివరణ ఇచ్చారు. అంతకుముందు బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు వారం రోజుల క్రితం లోకాయుక్తకు పిటిషన్ ఇచ్చారు.
మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు
ఈ నెల 15, 17 తేదీల్లో నోటిఫికేషన్?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగబోతుంది. రాష్టవ్య్రాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన షేడ్యూల్ ఈ నెల 15, 17వ తేదీల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. జనాభా ప్రాతిపదిక ఖరారు చేసిన రిజర్వేషన్ల ప్రకారం సర్పంచ్, వార్డు మెంబరు పదవులను త్వరలో ప్రకటించనున్నట్టు ఎన్నికల కమిషన్ వర్గాల సమాచారం.

నిరుద్యోగులకు హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ టోకరా

రూ. 80 లక్షలు కుచ్చుటోపీ ఇద్దరు ఘరానా నేరగాళ్ల అరెస్టు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: నిరుద్యోగులకు విదేశాల్లో హోటల్ పరిశ్రమలో ఆకర్షణీయమైన వేతనంతో ఉపాధి ఇప్పిస్తామని చెప్పి 80 లక్షల రూపాయల వరకు వసూళ్లు చేసి కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను రాజధాని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డిటెక్టివ్ విభాగం డిసిపి ఎల్‌కెవి రంగారావు కథనం ప్రకారం కూచిపూడి డేనియల్ ప్రవీణ్ పీటర్స్, సావేద్కర్ ప్రమోద్ అనే ఇద్దరు నిందితులు బంజారాహిల్స్‌లో రోడ్డు నెంబర్ 10లో మానవ వనరుల కనె్సల్టెన్సీ సర్వీసెస్ (హెచ్‌ఆర్)ను తెరిచి నిరుద్యోగులను వలలో వేసుకునేవారు. వీరి మాటలు నమ్మి 70 నుంచి 80 మంది నిరుద్యోగులు పది వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సొమ్ము చెల్లించారు. కూచిపూడి డేనియర్ ఎంబిఏ లా గ్రాడ్యూయేట్. విదేశాల్లో కొంత కాలం ఉద్యోగం చేశాడు. కెనెడా, క్యూబా, సైప్రస్ హాంకాంగ్, మలేషియా, జార్జియాలో హోటల్ పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు నిందితులు పత్రికల్లో ప్రకటనలు గుప్పించారు.
ముందుగా ఈ నెల కొంత మంది బాధితులు నగర క్రైమ్ బ్రాంచికి వచ్చి కూచిపూడి, సావేద్కర్ నిందితుల మోసాలపై ఫిర్యాదు చేశారు. తమకు వీసా ఇప్పించలేదని, ఉద్యోగం రాలేదని, సొమ్ము చెల్లించి తిరుగుతున్నామని ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు. ఇటీవల ఈ నిందితులు కొంత మందికి వీసాలు, ఎయిర్ టిక్కెట్లు ఇచ్చారు. అవన్నీ నకిలీవని తేలింది. నకిలీ ఏజెంట్లు, కనె్సల్టెన్సీల బారిన పడి మాయమాటలు నమ్మి మోసపోరాదని డిసిపి ఎల్‌కెవి రంగారావు కోరారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌పై జైలుకు పంపించారు.

ఆర్టీసి టిక్కెట్ల స్కాం ప్రధాన నిందితుడి అరెస్టు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: ఆర్టీసి ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయం కేసులో వెలుగుచూసిన అవకతవకల వ్యవహారంలో రాజధాని పోలీసులు కీలక నిందితుడు ఒకరిని అరెస్టు చేశారు. నిందితుడు ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేశాడని, నిందితుడి పేరు హనుమంతరావు అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో నిందితుడి నుంచి 20 వేల రూపాయల నగదు, సిమ్ కార్డులు, రెండు కంప్యూటర్లను సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఉన్నారని, ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్ టిక్కెట్ల స్కాం విజయనగరం జిల్లా చీపురుపల్లితో పాటు రాష్ట్రంలోని పలు కేంద్రాలకు విస్తరించిన విషయం విదితమే. నిందితులను పట్టుకునేందుకు ఆర్టీసి, పోలీసు శాఖ ఉమ్మడిగా పనిచేస్తున్నాయి.

నేడు ఎమ్సెట్
ఫలితాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 4: ఎమ్సెట్-2013 ఫలితాలను 5వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు మాసాబ్‌ట్యాంకులోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆడిటోరియంలో విడుదల చేస్తున్నట్టు కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావు చెప్పారు. ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ విడుదల చేస్తారని ఆయన వివరించారు. ఫలితాలను వెబ్‌సైట్‌లలోనూ, ఎస్‌ఎంఎస్, ఐవిఆర్‌ఎస్ ద్వారా విద్యార్ధులు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్ ద్వారా ఎమ్సెట్ హాల్‌టిక్కెట్ నెంబర్ టైప్ చేసి 53346కు పంపించాలని, లేదా 53345కు పంపించాలని సూచించారు. ఐవిఆర్‌ఎస్ ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ ఫోన్ నుండి 1255225కు, ఎయిర్‌టెల్ నుండి 550770కు, మిగిలిన ఆపరేటర్లు అయితే 5664477కు ఫోన్ చేయాలని సూచించారు. వాస్తవానికి ఎమ్సెట్ ఫలితాలను జూన్ 2వ తేదీన ప్రకటించాల్సి ఉండగా, జూన్ 5వ తేదీకి ఫలితాల విడుదల తేదీని వాయిదా వేశారు. 2వ తేదీన జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉండటంతో విద్యార్ధులపై ఎలాంటి ఒత్తిడి ఉండరాదనే భావనతో ఎమ్సెట్ ఫలితాలను వాయిదా వేశామని కన్వీనర్ వెంకటరమణారావు చెప్పారు. ఎమ్సెట్ ఫలితాలను ప్రకటిస్తే దాని వల్ల విద్యార్ధులు ఉద్వేగానికి గురవుతారని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే ఫలితాల విడుదల తేదీని మార్చామని అన్నారు. 5వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఇంటర్మీడియట్ పేపర్ల రీకౌంటింగ్ , రీ వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన మార్కుల జాబితానే తాము పరిగణనలోకి తీసుకున్నామని, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే వాటిని తర్వాత తదనుగుణంగా మార్చడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

తీర్పును రిజర్వు చేసిన స్పీకర్ మనోహర్
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>