న్యూఢిల్లీ, జూన్ 4: కాంగ్రెస్ అధినాయకత్వం 2014లోపే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్న విశ్వాసం తనకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ప్రక్రియలో భాగంగా అతి త్వరలోనే తెలంగాణ నాయకులు మరోసారి ఢిల్లీకి వచ్చి అధినాయకత్వంతో సమావేశమవుతారని మంగళవారం ఇక్కడ చెప్పారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులామ్ నబీ అజాద్‌తో జానా సమావేశమయ్యారు. పంచాయతీ రాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించటానికి అజాద్‌తో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. జూన్ 11లోపు రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అందచేస్తామని జానా వెల్లడించారు. జూలై మొదటి వారంలో ఎన్నికలను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కాగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ఆజాద్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు. వరంగల్ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ను విడిచిపెట్టే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ ఇవ్వదని తానేప్పుడు చెప్పలేదని ఆయన అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందన్న నమ్మకాన్ని రాజయ్య వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధినాయకత్వం 2014లోపే
english title:
t
Date:
Wednesday, June 5, 2013