సింహాచలం, జూన్ 4: భక్తుల హరినామ స్మరణతో మారుమోగాల్సిన సింహాచల పుణ్యక్షేత్రం పరిసరాలు మంగళవారం స్వామీజీలు, పీఠాధిపతుల నినాదాలతో ప్రతిధ్వనించాయి. దేవాలయాల్లో టిక్కెట్ల వ్యవస్థనే రద్దు చేయాలని స్వామీజీలు నినదించారు. సింహాచలం దేవాలయంలో పెంచిన ఆర్జిత సేవల టిక్కెట్ల ధరలు, గోశాలల్లో గోవుల మరణాలను నిరసిస్తూ పలువురు స్వామీజీలు, పీఠాధిపతులు సింహాచల క్షేత్రం రాజగోపురం ఎదుట ఆందోళన నిర్వహించారు. సింహగిరి మాడవీధుల్లో బైఠాయించి పాలకులు, అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. పెంచిన టిక్కెట్ల రేట్లు తక్షణమే తగ్గించాలని, గోవుల పరిరక్షణ బాధ్యతను దేవస్థానాలే చేపట్టాలని నినాదాలు చేశారు. స్వామీజీలు తమ శిష్యపరివారంతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, శ్రీకోటిలంగ మహాశైవ క్షేత్ర పీఠాధిపతి బ్రహ్మచారి శివస్వామి విలేఖర్లతో మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో టిక్కెట్టు వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గోమరణాల నేపథ్యంలో సింహాచలం వచ్చినప్పుడు రాజగోపురం మెట్ల మార్గంలో మద్యం సేవించిన ఒక వ్యక్తి తూలుతూ మెట్లు దిగుతున్నాడని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే, అతను కాంట్రాక్టు ఉద్యోగి అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. పాలకులు వ్యవహర్తిన్న తీరు పట్ల నిరసన వ్యక్తం చేసిన ఆయన ఈ పరిణామాన్ని హిందూ ధర్మంపై ఒక పథకం ప్రకారం జరుగుతున్న దాడిగా పేర్కొన్నారు. దేవస్థానాలకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే దేవాలయాల నిర్వహణ జరగాలని స్వామీజీ పేర్కొన్నారు. ఉత్సవాల పేరుతో కోట్లాది రపాయల అవినీతికి పాల్పడుతున్న దేవాదాయ శాఖ అధికారులు మూగజీవాలను పరిరక్షించే గోశాలలు నిర్వహించలేరా అని ప్రశ్నించారు. భక్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో దేవస్థానాల అధికారులు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. దేవస్థానాల్లో అడుగుపెట్టిన దగ్గర నుండి టిక్కెట్ల పేరుతో దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతానంద స్వామి (ప్రకాశం జిల్లా), యోగానంద స్వామి (ఒంగోలు), విశ్వధర్మ పరిరక్షణ వేదిక కార్యదర్శి భక్త చైతన్యానంద సరస్వతి (విజయవాడ), రుద్రయ్య, అప్పస్వామి, ఆత్మానంద స్వామి (విజయవాడ), శివకల్యాణానంద భారతి (గుంటూరు), గంభీరానంద స్వామి (కర్నూలు), జ్ఞానేశ్వరానంద స్వామి, జ్ఞానేశ్వరీ మాత (రవ్వలకొండ), రంగనాధానంద స్వామి (కర్నూలు), రాజయ్య స్వామి (మెదక్) పాల్గొన్నారు. కాగా సింహాచలం దేవస్థానం ఇఓ రామచంద్రమోహన్ హామీతో దీక్ష విరమించారు.
సింహాచలం గాలిగోపురం ఎదుట నినాదాలు చేస్తున్న స్వామీజీలు