తిరుపతి, జూన్ 4: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కన్యాకుమారిలో 4.50 ఎకరాల విస్తీర్ణంలో 22.50 కోట్ల రూపాయల అంచనావ్యయంతో చేపట్టనున్న శ్రీవారి దివ్యక్షేత్ర నిర్మాణానికి మంగళవారం భూమి పూజ జరిగింది. స్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా ఇటీవల ఉత్తర భారత దేశంలో కూడా టిటిడి ఆలయ నిర్మాణం చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇందులో భాగంగానే కన్యాకుమారిలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కన్యాకుమారిలోని వివేకానందపురంలో గల వివేకానంద కేంద్ర ప్రాంగణంలో భూమి పూజ చేశారు. గోపూజ, యంత్ర స్థాపన, వాస్తుపూజ, శాంతిసూక్త హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. భారతీయ హిందూ సనాతన, ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిన స్వామి వివేకానంద ఈ ప్రాంగణంలోనే ధ్యానం చేసినట్లు చరిత్ర చెపుతోంది. ప్రముఖ తమిళ కవి తిరువళ్లూవర్ కూడా ఇక్కడే అనేక ఆధ్యాత్మిక రచనలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పద్మావతమ్మ ఆలయం, స్వామి పుష్కరిణి, యాగశాల, పోటు, అన్న ప్రసాద భవనం, గో సంరక్షణ శాల, వేద పాఠశాలలను నిర్మించనున్నారు. భూమి పూజ అనంతరం టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం కలిసి ఆలయ పనులు చేపడుతున్న ప్రాంతానికి శంకుస్థాపన చేశారు. బాపిరాజు మాట్లాడుతూ కళలకు, ఆధ్యాత్మికతకు నెలవైన కన్యాకుమారి దివ్యక్షేత్రంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీవారి ఆలయం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో వచ్చే ఏడాది నాటికి ఈ ఆలయ నిర్మాణం కూడా పూర్తి కానున్నదన్నారు. ఈ ప్రాంతం మరింతగా ప్రముఖ యాత్రా స్థలంగా అభివృద్ధి చెందనుందన్నారు. చారిత్రక ప్రాంతమైన కురుక్షేత్రంలో కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇఒ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కన్యాకుమారిలాంటి మరో చారిత్రక ప్రదేశంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగడం ఒక శుభపరిణామమన్నారు.
కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి
భూమిపూజ చేస్తున్న టిటిడి చైర్మన్ బాపిరాజు, ఇఓ సుబ్రహ్మణ్యం