నల్లగొండ, జూన్ 4: మాతృభాష తెలుగును పరిపాలన భాషగా అమలు చేయడంలో రాష్ట్రానికే ఆదర్శనీయంగా ఉన్న నల్లగొండ జిల్లా ఇతర జిల్లాల అధికార యంత్రాంగానికి అధికార భాష అమలుపై పాఠాలు నేర్పే అరుదైన ఘట్టానికి వేదిక కానుంది. తెలుగును అధికార భాషగా అమలు చేయడంలో నల్లగొండ జిల్లా సాధించిన ప్రగతి నేపథ్యంలో ఈ జిల్లా నమూనాగా ఇతర జిల్లాలకు అధికార భాష అమలుపై మార్గదర్శకం చేసేందుకు అధికార భాష సంఘం ఈ నెల 7న నల్లగొండలో అధికార భాషగా తెలుగు అమలుపై రాష్ట్ర స్థాయి శిక్షణ, అవగాహన సదస్సును నిర్వహిస్తుండడం విశేషం. ఈ శిక్షణా తరగతులకు అన్ని జిల్లాల అదనపు జాయింట్ కలెక్టర్లు, డిఆర్‌వోలు, సిఇవోలు, జిల్లా పరిషత్, డిఆర్‌డిఏ, డ్వామా, పౌరసరఫరా తదితర శాఖల అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె.మహంతి ఆదేశాలు సైతం జారీ చేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ చొరవతో జరుగుతున్న ఈ శిక్షణా తరగతుల నిర్వాహణకు జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు ఆదేశాలతో తెలుగు అమలు పర్యవేక్షణాధికారి అంజయ్య అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఈ శిక్షణా తరగతుల్లో అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాలు, దస్త్రాలు, ఉత్తర్వులను, తీర్పులను ఏ విధంగా జిల్లా యంత్రాంగం అధికార భాష తెలుగులో సాగిస్తున్నారన్న దానిపై ఇతర జిల్లా యంత్రాంగానికి అవగాహన కల్పించనున్నారు. అధికార భాష అమలులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న తెలుగు పదకోశాలను సదస్సులో ఇతర జిల్లాల అధికారులకు వివరించి వాటి ప్రతులను అందించనున్నారు. పాలనా భాషగా తెలుగును అమలు చేయడంలో ఎదురవుతున్న ఆటంకాలను ఏ విధంగా అధిగమించి ముందుకు సాగుతున్న తీరును ఈ సదస్సులో వివరించనున్నారు. అలాగే కంప్యూటర్ ద్వారా తెలుగులో సాగించే అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాలకు సంబంధించి సైతం జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న ప్రక్రియను ఇతర జిల్లా అధికారులకు జిల్లా యంత్రాంగం ద్వారా అవగాహన కల్పించనున్నారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, పంచాయతీ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగు అమలుకు జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు తీసుకున్న చొరవ నేడు రాష్ట్ర స్థాయిలో జిల్లాను గురు స్థానంలో నిలబెట్టడం జిల్లా ప్రజలకు, అధికారులకు దక్కిన విశిష్ట గౌరవంగా చెప్పవచ్చు.
అవగాహన సదస్సుకు పాలన
వినియోగ పదకోశాలను సిద్ధం చేస్తున్న తెలుగు పర్యవేక్షణాధికారి అంజయ్య