కడప, జూన్ 4: మంత్రి వర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డిని బర్త్ఫ్ చేసిన తరువాత కడప జిల్లాతోపాటు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అప్రమత్తమయ్యారు. కడప వైఎస్సార్ జిల్లాలో డిఎల్‌ను ఏకాకిని చేయడంలో ఫలితం సాధించినట్లు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండడంతో ముఖ్యమంత్రి కనీసం కడప జిల్లాపై ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశాల్లో ఉన్న రవీంద్రారెడ్డి సొంత జిల్లాకు వచ్చేలోపే పరిస్థితులను చక్కదిద్దుకుని జిల్లాపై మరింత పట్టుసాధించాలని సిఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే మునిసిపల్ శాఖామంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి మంగళవారం ప్రొద్దుటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పటికీ పనిలోపనిగా ముఖ్యమంత్రి అప్పగించిన పని చక్కబెట్టడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. పార్టీని నమ్ముకుని పని చేసిన పలువురు సీనియర్ నేతలు పదవులు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో డిఎల్ బర్త్ఫ్ తరువాత జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు జిల్లాలో పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అసంతృప్తివాదులతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ప్రజాప్రతినిథులు సీనియర్ నేతలతో కలసి కమలాపురం ఎమ్మెల్యే జి వీరశివారెడ్డి డిఎల్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ఇస్తూ ముఖ్యమంత్రి చర్యలను సమర్థిస్తూ ఆయనకు బాసటగా నిలిపే ప్రయత్నం చేశారు. డిఎల్ వర్గీయుల్లో ఎలాంటి ఆందోళన, నిరుత్సాహం కనిపించకపోవడం ఆయన వ్యతిరేక వర్గాన్ని విస్మయానికి గురి చేస్తోంది. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు జైపాల్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి జానారెడ్డి తదితరులు సిఎం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడంతోపాటు డిఎల్‌కు బాసటగా నిలబడడంతో డిఎల్ వర్గీయులు పార్టీ అధిష్ఠానం తమ నాయకుడి పట్ల సానుకూలంగానే ఉందనే ధీమాతో ఉన్నారు. ఇదిలావుండగా గత కొంతకాలంగా అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న జిల్లాలోని బద్వేలు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత డాక్టర్ శివరామకృష్ణారావు డిఎల్ బర్త్ఫ్‌ప్రై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల సిఎం జిల్లా పర్యటనలో కూడా ఆయన పట్టీపట్టనట్లుగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి సోమవారం ఆయనతో మంతనాలు జరపడం ప్రాముఖ్యత సంతరించుకుంది. కడప జిల్లా పర్యటనను పురస్కరించుకొని మంత్రి మానుగుంట పోరుమామిళ్లకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లాకు నామినేటెడ్ పదవి దక్కుతుందని ప్రకటించారు. అయితే పదవి ఎవరికి అనేది తేల్చి చెప్పలేదు. అనంతరం ఆయన కడప మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకొని మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ డీఎల్‌ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని సమర్థించడంతోపాటు సిఎంకు అనుకూలంగా మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తదితరులు హాజరయ్యారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
హైవేపై మద్యం
దుకాణాలకు తాళాలు?
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూన్ 4: జాతీయ రహదారులపై మద్యం దుకాణాల లైసెన్స్‌లు రెన్యువల్ చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ నెల 30 తర్వాత హైవేపై ఒక్క మద్యం దుకాణం ఉండకూడదన్న ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైవేపై మద్యం దుకాణాలకు లైసెన్స్ రెన్యూవల్ చేయవద్దంటూ మంగళవారం ప్రాథమికంగా ఎక్సయిజ్ అధికారులకు సమాచారం వచ్చింది. అయితే లైసెన్స్‌డ్ దుకాణాలకు మాత్రమే తాళాలు వేస్తామంటున్న అధికారులు ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటైన బెల్టు దుకాణాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియటం లేదు. బెల్టుషాపుల విషయంలో అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు. ప్రతీ 50 కిలోమీటర్లకు నాలుగు ఎక్సయిజ్ టాస్క్ఫోర్సు బృందాలు దాబాలన్నింటినీ తనిఖీ చేస్తూనే ఉంటాయని తెలుస్తోంది. 2012 జూన్‌లో జరిగిన వేలం పాటల్లో హైవే మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. రెండేళ్లు వ్యాపారం చేసుకోవచ్చునంటూ అబ్కారీశాఖ ముందుగా ప్రకటించడంతోనే లక్షలాది రూపాయలు లైసెన్సు ఫీజులు ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధపడ్డామని, మొదటి ఏడాదిలో లాభనష్టాలు సరికాకపోయినా, నష్టాలతో నడుపుతూ రెండో ఏడాది ఆ నష్టాలను పూరించుకోవచ్చునన్న ఆలోచనతోనే ఎంఆర్‌పి అమలు చేశామని కొంతమంది మద్యం వ్యాపారులు బహిరంగంగా అధికారులను నిలదీస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలైతే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి పైడిబీమవరం వరకూ 172 కిలోమీటర్ల మేర 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన గల 27 మద్యం దుకాణాలకు తాళాలు వేయాల్సిందే!
మల్లన్న హుండీ
లెక్కింపులో చేతివాటం
శ్రీశైలం, జూన్ 4: కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంగళవారం నిర్వహించిన హుండీ లెక్కింపు సందర్భంగా దేవస్థానంలో స్వీపర్‌గా పని చేస్తున్న ఏసుదాసు అనే ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి సిసి కెమేరాకు దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలిలావున్నాయి. మంగళవారం శ్రీశైలం దేవస్థాన కల్యాణ మండపంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానాల్లోని హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసుదాసు అనే స్వీపర్ హస్తలాఘవంతో మూడు వెయ్యి రూపాయల నోట్లు, రెండు ఐదు వందల నోట్లు తస్కరించాడు. వాటిని మడిచి నోటి నాలుక కింద దాచేశాడు. ఆలయ సిబ్బంది సిసి కెమేరాల ఫుటేజీలో ఈ విషయాన్ని కనుగొన్నారు. వెంటనే ఇవో చంద్రశేఖర్ ఆజాద్‌కు తెలిపారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒన్‌టూన్ ఎస్సై ఆధ్వర్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా 31 రోజులకు సంబంధించిన జరిగిన లెక్కింపులో 1. 23 కోట్ల రూపాయల నగదు ఆదాయం లభించింది.
ముదురుతున్న
రైవాడ వివాదం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 4: విశాఖ జిల్లాలో తాగునీరు, సాగునీరుకు వివాదం ముదురుతోంది. రైవాడ జలాశయం నుంచి విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే 2004 సంవత్సరంలో ఈ నీటిని కేవలం రైవాడ ఆయకట్టుకు మాత్రమే వినియోగించాలని, విశాఖ ప్రజల తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను మాత్రమే ఉపాయోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జిఓను ఇప్పటి వరకూ అమల్లోకి తీసుకురాలేదు. టిడిపి ఈ విషయమై ఉద్యమించడానికి సిద్ధపడుతోంది. విశాఖ జిల్లాలో రైవాడ జలాశయం కింద పాత ఆయకట్టు 15,337 ఎకరాలు ఉండగా, కొత్త ఆయకట్టు సుమారు ఆరు వేల ఎకరాల వరకూ ఉంది. ఏటా రబీకి ఈ జలాశయం నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తుంటారు. గత ఏడాది పరిస్థితి అనుకూలించకపోవడంతో ఇక్కడ రైతులు జలాశయంలో నీటిని వాడుకోకుండా పొదుపు చేశారు. ఇదే జలాశయం నుంచి 27 ఎంజిడి నీటిని విశాఖ ప్రజల తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. దీనివలన రైవాడ రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్న రైతులు ఇబ్బందిపడుతున్నారని, అందువలన రైవాడ నీటిని కేవలం సాగుకు మాత్రమే వినియోగించాలంటూ 2002లో అప్పటి కాంగ్రెస్ నేత కొణతాల రామకృష్ణ భారీ ఉద్యమం చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు రైవాడ నీటిని సాగు కోసం వినియోగించేలా, ప్రజల తాగునీటి కోసం గోదావరి జలాలను రప్పించేందుకు ప్రభుత్వం నుంచి సుమారు 250 కోట్ల రూపాయలు విడుదల చేశారు. స్టీల్ ప్లాంట్ కూడా కొంత మొత్తాన్ని వెచ్చింది గోదావరి జలాలను విశాఖకు తీసుకువచ్చారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కొణతాల రామకృష్ణ మంత్రి అయ్యారు. ఆయన పలుకుబడి ఉపయోగించి, రైవాడ నీటిని సాగునీటికి, గోదావరి జలాలను విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగించేలా జిఓ కూడా తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈ జిఓను అమలు చేయడం లేదు.
విస్తరించిన రుతుపవనాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 4: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన 24 గంటల్లోనే తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తరించాయి. దీని ప్రభావం వలన ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ రుతుపవనాలు ఉత్తర కోస్తాను తాకుతాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలియచేసింది. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ భూతల ద్రోణి కొనసాగుతోంది. కాగా, రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
గోదావరి జిల్లాల్లో...
ఏలూరు: ఉభయగోదావరి జిల్లాలను రుతుపవనాలు పలకరించాయి. ఊహించినదానికంటే ముందుగా రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు మంగళవారం గోదావరి జిల్లాలను భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాల రూపంలో పలకరించాయి. మంగళవారం మధ్యాహ్నం వరకు 39 నుండి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదై అల్లాడిన ప్రజలు సాయంత్రానికి భారీ వర్షంతో సేదదీరారు. రాజమండ్రి, కడియపులంక, రామచంద్రపురం, కొవ్వూరు, భీమవరం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడటం, ఫ్లెక్సీలు, హోర్డింగులు ధ్వంసం కావడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
మావోలకు రిమాండ్
కొత్తగూడెం, జూన్ 4: ఖమ్మం జిల్లా పాల్వంచలో సోమవారం సినీపక్కీలో పట్టుబడ్డ ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెం ఓఎస్‌డి కార్యాలయంలో ఓఎస్‌డి టి శ్రీనివాసరావు మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ పట్టుబడ్డ వారిలో ఇద్దరు మావోయిస్టులుగా నిర్థారణ అయిందని తెలిపారు. వారిలో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రన్న భార్య మోతీబాయి అలియాస్ రాధక్క ఉరఫ్ మాధవి కాగా మరొకరు సుఖ్‌దేవ్‌దళంలో సభ్యునిగా పనిచేస్తున్న అంకాల పృథ్వీగా తెలిపారు. మూడవ వ్యక్తి అంకాల ధర్మరాజుకు మావోయిస్టులతో ఎలాంటి సంబంధంలేదని కారుడ్రైవర్ మాత్రమేనని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాధవి 1985లో మావోయిస్టుపార్టీ పట్ల ఆకర్షించబడి గత 28సంవత్సరాలుగా పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిందని తెలిపారు. సిర్పూర్ దళంలో సభ్యురాలిగా, చెన్నూరు దళకమాండర్‌గా, ఇంద్రవెల్లి దళంలో సభ్యురాలిగా పనిచేస్తూ 1993లో చంద్రన్నను వివాహం చేసుకుందని తెలిపారు. తదనంతరం మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దులోని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి మారి సౌత్, వెస్ట్ బస్తర్ డివిజన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తోందని తెలిపారు. 10 హత్యలు, 20 దహనాలు, 15 పోలీసులతో ఎదురుకాల్పుల ఘటనలలో ఈమె పాల్గొంది. పృథ్వీ చిన్నాన్న 1998లో వైజాగ్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడని, పెద్దవాడయ్యాక పృథ్వీ 2011లో యూనివర్సిటీ ఆఫ్ హైద్రాబాద్‌లో పిజి చదువుతుండగా ఉదయభాను అనే పిజి స్టూడెంట్‌తో పరిచయం ఏర్పడి ఆయన ఆదేశం మేరకు ఖమ్మం జిల్లాకు చెందిన మోరె రవితో కలిసి సుఖ్‌దేవ్ దళంలో చేరి దళంలో సభ్యునిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. పార్టీ పనిమీద మాధవితో కలిసి కారులో విజయవాడ వెళ్తూ పాల్వంచ వద్ద తనిఖీలో చిక్కాడని తెలిపారు. కారులో నక్సల్స్ సాహిత్యంతో పాటు 75 వేల రూపాయల నగదు లభ్యమైనట్లు వివరించారు.
ఆలయ భద్రతపై దృష్టి
* అనంతపురం రేంజి డిఐజి బాలకృష్ణ
తిరుపతి, జూన్ 4: తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు సంబంధించి టిటిడిలోని అన్ని విభాగాలను భాగస్వాములను చేస్తూ ఒక కమాండింగ్ విధానాన్ని తీసుకొస్తామని అనంతపురం రేంజ్ డిఐజి బాలకృష్ణ అన్నారు. మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంకన్నా తిరుమల శ్రీవారి ఆలయ భద్రత ఎంతో మెరుగ్గా ఉందన్నారు. తిరుమల ఔటర్ కారిడార్, ఇన్నర్ కారిడార్‌లను ఏర్పాటు ఎంతో ఉపయోగంగా ఉందన్నారు. ఈకారిడార్‌ల కారణంగా అసాంఘిక శక్తులు తిరుమలలోకి ప్రవేశించే అవకాశమే లేదన్నారు. పోలీసులు, టిటిడి సెక్యూరిటీ మధ్య సమన్వయం చేయనున్నట్లు తెలిపారు.
సామాన్య భక్తులకు
డ్రస్‌కోడ్ వద్దు: యనమల
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జూలై 4: ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి గంటల తరబడి క్యూల్లో నిల్చుని ఉన్న సామాన్య భక్తులకు కూడా టిటిడి డ్రెస్‌కోడ్ విధించడం సబబు కాదని వారికి మినహాయింపు ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్సీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. శ్రీవారి దర్శనార్ధం మంగళవారం తిరుమలకు వచ్చిన ఆయన ఆలయ ఎదుట తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. డ్రెస్ కోడ్ పెట్టడం మంచిదే అయినా అది ఆర్జిత సేవల్లో పాల్గొనే గృహాస్థులకు పరిమితం చెయ్యాలన్నారు. అంతే తప్ప ఉచిత క్యూలైన్లలో వెళ్లే సామాన్య భక్తులకు నిబంధలను పెట్టరాదన్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా కొన్ని ఆలయాల్లో చొక్కా తీయ్యాలని చెపుతారే తప్ప పూర్తిగా డ్రెస్‌నే మార్చుకోవాలని చెప్పరన్నారు. విజయసాయిరెడ్డి తన మనువడికి ఆలయంలో అన్నప్రాసన చేయడంపై విమర్శలు వచ్చినా టిటిడి స్పందించకపోవడం సరికాదన్నారు. ఆగమాలు, శాస్త్రాలు ఆలయంలో ఎవరైనా అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.
నమ్మకద్రోహులు వెళ్లిపోయారు
* వివేక్, కెకెపై ఎమ్మెల్యే ఆనం నిప్పులు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జూన్ 4: వార్డు కౌన్సిలరుగా కూడా గెలిసే సత్తాలేని వ్యక్తులను కూడా కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుని అందలం ఎక్కించిందని, అయితే ఆ విశ్వాసం లేని వారు పార్టీని వీడటంతో పార్టీకి పట్టిన శని వదిలిందని నెల్లూరు కాంగ్రెస్ శాసన సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని వదిలి టిఆర్‌ఎస్‌లో చేరిన కెకె, మంద, వివేక్‌ల పేర్లు చెప్పకుండా వారిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. పంచాయతీ వార్డు ఎన్నికల్లో కూడా గెలవలేని ఒక వ్యక్తికి ఎమ్మెల్సీ, ఎంపి, పిసిసి అధ్యక్ష పదవిని, ఇతర రాష్ట్రాల ఇన్‌చార్జిల పదవులను కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అప్పగించి గౌరవించిందన్నారు. అంతేకాకుండా ఆయన కుమారుడు హత్యకేసుకు సంబంధించి కాంగ్రెస్‌పార్టీ ఆ ఎంపిని ఆదుకున్నదన్నారు. అలాంటి వారు విశ్వాసం లేకుండా తమ స్వార్ధ ప్రయోజనాలకోసం పార్టీని వీడి అధిష్ఠానాన్ని దూషించడం వారి నీచరాజకీయాలకు అద్దం పడుతోందన్నారు.
నెల రోజుల్లో తెలంగాణపై
సానుకూల ప్రకటన: దుద్దిళ్ల
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జూన్ 4: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోగా సానుకూల ప్రకటన చేయబోతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్ బాబు మంగళవారం కరీంనగర్‌లో వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా తనను కలిసిన విలేఖరులతో మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, నెల రోజుల్లోగా ఈ అంశం తేల్చేస్తామంటూ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటన వాస్తవమేనని, ఈ ప్రక్రియ వేగవంతమైందని అన్నారు. రాజకీయంగా లబ్ధిపొందడం కోసమే టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా వారికంటే ఎక్కువ విమర్శలు చేయగలమని, పెట్టుబడిదారులతో ఆ పార్టీ నాయకులకున్న సంబంధాలు, ఒప్పందాలు ఏమిటో తమకు తెలుసని అన్నారు. తన గెలుపోటములు టిఆర్‌ఎస్ పార్టీనో మరో పార్టీనో నిర్ణయించలేదని, ప్రజలే అంతిమ నిర్ణేతలని ఆయన అన్నారు.