మెల్‌బోర్న్, జూన్ 5: సముద్ర జలాల్లో చైనా బలప్రదర్శనల నేపథ్యంలో, ఆసియా పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అభివృద్ధి దృష్ట్యా ఇరు దేశాల రక్షణ ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవాలని భారత్-ఆస్ట్రేలియాలు నిర్ణయించాయి. చారిత్రాత్మక పర్యటన చేస్తున్న భారత రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ బుధవారం ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి స్టిఫెన్ స్మిత్‌ను కాన్‌బెర్రాలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా సముద్ర జలాల భద్రతతోపాటు రక్షణ ఒప్పందాలు, వ్యూహాత్మక భద్రతా ప్రయోజనాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఆందోళనలు, అభిప్రాయలను పంచుకున్నారని, ఇరు దేశాల రక్షణ శాఖల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారని ఆంటోని, స్మిత్ చర్చల అనంతరం ఆస్ట్రేలియా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటన తెలియజేసింది. కాగా, ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న తొలి భారతీయ రక్షణ మంత్రిగా చరిత్ర సృష్టించిన ఆంటోనీ మంగళవారం పెర్త్‌లో ఆ దేశ రక్షణ మంత్రి స్మిత్‌ను కొంతసేపు కలుసుకోగా, అనంతరం చర్చల నిమిత్తం ఇరువురు కాన్‌బెర్రాకు చేరుకున్నారు. ఇదిలావుంటే తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో జపాన్ తదితర పొరుగు దేశాలతో నెలకొన్న సముద్ర జలాల వివాదం నేపథ్యంలో ఇటీవలికాలంలో చైనా బలప్రదర్శనకు దిగుతుండటంపైనా భారత్, ఆస్ట్రేలియాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల నావికాదళాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రస్తుత ద్వైపాక్షిక నావికా సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించాయి. అలాగే 2015లో జరిగే ఇరుదేశాల ద్వైపాక్షిక తీరప్రాంత విన్యాసాల కోసం కలిసి పనిచేయాలనుకున్నాయి. కాగా, ఆసియా పసిఫిక్, హిందూ మహా సముద్ర ప్రాంతాల అభివృద్ధికి స్వేచ్ఛా వాణిజ్యం, సముద్ర జలాల రవాణా భద్రత కీలకమని ఈ సందర్భంగా ఇరు దేశాలు గుర్తించాయి.
కాన్‌బెర్రాలో బుధవారం జరిగిన సమావేశంలో భారత రక్షణ మంత్రి ఆంటోనీ,
ఆస్ట్రేలియా ప్రధాని జూలియా గిల్లార్డ్, ఆ దేశ రక్షణ మంత్రి స్టీఫెన్ స్మిత్