ఇస్లామాబాద్, జూన్ 5: దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరముందని పాకిస్తాన్‌లోని రాజకీయ పార్టీలకు కొత్త ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయని, వీటన్నింటినీ అధిగమించి ప్రగతి బాటలో ప్రయనించేందుకు అందరి సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. దేశం ముందున్న ఎన్నో సమస్యలను కేవలం ఒక్క రాజకీయ పార్టీ పరిష్కరించడం అసాధ్యమని, అందరూ కలిసికట్టుగా ఒకే గొడుగు కింద పనిచేస్తే తప్ప వాటిని అధిగమించడం కష్టమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధానిగా భారీ మెజారిటీతో మూడోసారి పిఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జాతీయ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలతో తాను సంప్రదిస్తానని, ముఖాముఖి చర్చలు, అభిప్రాయాలను పంచుకోవడంద్వారా వాటిని అధిగమించవచ్చునని తెలిపారు. సమస్యలనుంచి దేశాన్ని బయటపడేందుకు సమష్టిగా ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. కీలక సమస్యల తక్షణ పరిష్కారానికి తాను, తన పార్టీ సీనియర్ నాయకులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, ఆ ప్రణాళికను, ప్రభుత్వం తీసుకొనబోయే చర్యలను త్వరలో ప్రజలకు వివరిస్తామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో అద్భుతాలేవో జరుగుతాయని ప్రజలు ఆశించవద్దని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, స్వర్గాన్ని మీముందు ఆవిష్కరిస్తానని ఆశపడవద్దని సూచించారు. నేను విశ్రాంతి కూర్చోనని, అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా విశ్రాంతి తీసుకోనివ్వనని షరీఫ్ స్పష్టం చేశారు. అయితే, విదేశాంగ విధానాలు, భారత్‌తో సంబంధాలు వంటి అంశాలు షరీఫ్ ప్రసంగంలో చోటుచేసుకోలేదు. కానీ, పాక్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా చేపడుతున్న డ్రోన్ దాడులను తక్షణం నిలిపివేయాలని అన్నారు.
భారీ మెజారిటీతో ఎన్నిక
పాకిస్తాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ మూడోసారి భారీ మెజారిటీతో ఎన్నికై రికార్డు సృష్టించారు. 342మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో 244 ఓట్ల మెజారిటీని సాధించి షరీఫ్ విజయకేతనం ఎగురవేశారు. గురువారం ప్రధాని ఎన్నిక నామమాత్రంగా జరిగింది. ప్రధాని పదవికి పోటీపడిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన మఖ్దూమ్ అమీన్ ఫాహిమ్‌కు 42 ఓట్లు వచ్చాయి. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్ తరపున పోటీచేసిన జావెద్ హాష్మికి 31 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అనంతరం ఫలితాలను స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. పదమూడేళ్ల విరామం తర్వాత పిఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి హోదాలో జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం.