కోల్‌కతా, జూన్ 5: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్, బిజెపియేతర కూటమికి తృణమూల్ నాయకత్వం వహిస్తుందా? అన్న ప్రశ్నను ఆమె తోసిపుచ్చారు. బుధవారం ఇక్కడ ఆమె విలేఖరులతో మాట్లాడారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయని నాకు అనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే చాలా సంతోషం’ అని ఈ సందర్భంగా ఆమె అన్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒకవేళ జాతీయ స్థాయిలో వచ్చే కాంగ్రెస్, బిజెపియేతర కూటమికి మీరు నాయకత్వం వహించేందుకు సిద్ధమా? అని విలేఖరులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ‘నేను ఏ పదవినీ ఆశించడం లేదు. ఓ కార్యకర్తగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నాయకత్వం వహించేందుకు ఎవరు ముందుకొచ్చినా నాకు అభ్యంతరం లేదు’ అని చెప్పారు. ‘నేను అధికారం కోసం పోరాటం చేయను. ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పోరాడుతాను. ప్రజా ప్రయోజనార్థమే మేము యుపిఎ-2 ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాం’ అని గుర్తుచేశారు. కాగా, బొగ్గు, ఎరువులు, ఇతర వస్తువుల ధరల పెంపుపై మన్మోహన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
ధరల పెంపు ప్రజలపై ప్రభావం చూపుతోందన్న ఆమె ఆ ప్రభావం కారణంగానే తాజా ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైందన్నారు.
‘మాజీ’లకు ఆ హక్కు లేదు
‘వై,’ ‘జడ్’ సెక్యూరిటీపై సుప్రీం కోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూన్ 5: కేవలం మాజీ మంత్రి అయినంత మాత్రాన తనకు వై లేదా జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కోరే హక్కు ఏ వ్యక్తికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిఎస్పీ నాయకుడొకరు దాఖలు చేసుకున్న అభ్యర్థనను విచారణకు స్వీకరించడానికి నిరాకరించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ విషయం స్పష్టం చేసింది. ‘వాస్తవానికి నిబంధనల ప్రకారం మీరు భద్రత కల్పించడానికి అర్హులు కాని పక్షంలో మీకు భద్రత కల్పించబడదు. ప్రభుత్వ ఖర్చుతో మీకు రక్షణ కల్పించడానికి వీల్లేదు’ అని న్యాయమూర్తులు జ్ఞానసుధా మిశ్రా, మదన్ బి లోకుర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రామ్‌వీర్ ఉపాధ్యాయ్‌కు ఉన్న వై కేటగిరీ సెక్యూరిటీని సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుదించింది. అయితే తనకు వై సెక్యూరిటీని పునరుద్ధరించమని ఆదేశించాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు తన పిటిషన్‌పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకుండా తీర్పును రిజర్వ్ ఉంచడాన్ని సవాలు చేస్తూ ఈ బిఎస్పీ నాయకుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ విచారణ జరపడానికి అర్హమైంది కాదని బెంచ్ పేర్కొంటూ, హైకోర్టు నిర్ణయం వెలువడకముందే పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం సరికాదని కూడా పేర్కొంది. ఒకవేళ తన ప్రాణానికి ఏదయినా ముప్పు ఉందని పిటిషనర్ భావిస్తున్నట్లయితే ఆయన తన సొంత ఖర్చుతో ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని కూడా బెంచ్ స్పష్టం చేసింది. అయితే మధ్యంతర సెక్యూరిటీ కోసం పిటిషనర్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఆశ్రయించవచ్చని, హైకోర్టు ప్రాణానికి ముప్పు అంశాన్ని పరిశీలించే కమిటీ నివేదిక ఆధారంగా ఆయన అభ్యర్థనను పరిశీలించవచ్చని బెంచ్ స్పష్టం చేసింది. అయితే ప్రాణానికి ముప్పు అంటే ఏమిటో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు, ఇంటెలిజన్స్ బ్యూరో లేదా సంబంధిత అధికారులు నిర్ణయిస్తారని స్పష్టం చేసింది. ప్రాథమికంగా వై లేదా జడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసం బిఎస్పీ నేత చేసిన వాదనలతో తాము సంతృప్తి చెందడం లేదని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేసారు. ‘మా అనుభవంలో ప్రాణానికి ఎంత తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ సామాన్య ప్రజలకు వై లేదా జడ్ సెక్యూరిటీని కల్పించడం ఎక్కడా చూడలేదు’ అని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మాజీ ఎంపి లేదా ఎమ్మెల్యేగా ఉంటూ కూడా మీరు జీవితం పొడవునా భద్రత ఉండాలని కోరడం వింతగా ఉందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సమైక్య సూత్రానికే విరుద్ధం
ఎన్‌సిటిసిని వ్యతిరేకించిన గుజరాత్, బీహార్, త్రిపుర, చత్త్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ, జూన్ 5: నేషనల్ కౌంటర్ టెర్రరిజమ్ సెంటర్ (ఎన్‌సిటిసి)ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై యుపియేతర రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు మరోసారి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన రాజ్యాంగం ప్రవచిస్తున్న సమైక్య సూత్రాలకే విరుద్ధమైనదని దేశ అంతర్గత భద్రతపై బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో వారు స్పష్టం చేశారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో నక్సలిజం కూడా ఒకటని ప్రతిపక్ష పార్టీలకు చెందిన చాలా మంది ముఖ్యమంత్రులు పేర్కొన్నారు.
ఎన్‌సిటిసి ఏర్పాటు విషయమై ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని భావించానని, అయితే ఈ ఆందోళనలకు ప్రభుత్వం తన కొత్త ముసాయిదాలో కూడా ఎలాంటి పరిష్కారాలు చూపలేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్‌సిటిసి స్వరూపం, దాని పనితీరు రాజ్యాంగం ప్రవచిస్తున్న సమైక్య సూత్రాలకే విరుద్ధంగా ఉందని, ఈ ముసాయిదాపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఎన్‌సిటిసి స్వరూపం, అధికారాలు, దాని పనితీరుపై గత ఏడాది తాను తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశానని, వీటిలో చాలావాటికి కొత్త ముసాయిదాలో కూడా పరిష్కారం చూపలేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారు.
సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న వాదనను అభినందిస్తున్నానని, అయితే ఎన్‌సిటిసి ఏర్పాటు విషయంలో కేంద్ర హోం శాఖ అనుసరిస్తున్న తీరును మాత్రం వ్యతిరేకిస్తున్నానని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు.
అయితే దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో నక్సలిజం కూడా ఒకటని ఈ సమావేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు అంగీకరించారు. దేశాన్ని పీడిస్తున్న వామపక్ష తీవ్రవాద సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని తామంతా అంగీకరిస్తున్నామని, ఇటీవల చోటుచేసుకున్న ఘటనలతో ఈ సమస్య మరింత ప్రముఖంగా తెరమీదకు వచ్చిందని నితీష్ కుమార్ పేర్కొన్నారు.
దేశ అంతర్గత భద్రతకు నక్సలిజం పెనుముప్పుగా పరిణమించిందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అన్నారు. ఇది కేవలం చత్తీస్‌గఢ్ మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదని, అనేక రాష్ట్రాలు ఈ సమస్యతో అల్లాడుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశ వ్యాప్తంగా ఒకే విధమైన బలమైన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.