హైదరాబాద్, జూన్ 5: ఎమ్సెట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సాయంత్రం జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీలో విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు, ఎమ్సెట్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ రామేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ ఎన్ వి రమణారావుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి ఫలితాలను విడుదల చేశారు.
ఇంజనీరింగ్‌లో 2,91,083 మంది, మెడిసిన్ స్ట్రీంలో 1,05,070 మంది కలిపి మొత్తం 3,96,153 మంది అభ్యర్ధులు పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారని, 33 రీజనల్ కేంద్రాల్లో మే 10వ తేదీన ఎమ్సెట్ నిర్వహించగా ఇంజనీరింగ్‌లో 2,01,308 మంది, మెడిసిన్‌లో 80,778 మంది క్వాలిఫై అయ్యారని అన్నారు. కాగా. ఈ నెల 17వ తేదీ నుండి కౌనె్సలింగ్ ప్రారంభిస్తామని జూన్ 31 వరకూ కౌనె్సలింగ్ తొలి దశ జరుగుతుందని, ఆగస్టు 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. రెండో దశ కౌనె్సలింగ్ జూలైలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జూలై నాటికి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వస్తాయని, ఆ మార్కులను సైతం చేర్చి రెండో దశ కౌనె్సలింగ్ నిర్వహిస్తామని ఆయన వివరించారు.
మేనేజిమెంట్ కోటా ఆన్‌లైన్‌లోనే
యాజమాన్య కోటాకు ఈ సారి అభ్యర్ధులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని, ముందుగా యాజమాన్యాలు నేరుగా ఆ సీట్లను భర్తీ చేసే వీలు లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకించి నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. జీవో 66,67లను సవరిస్తామని, ఇందుకు సంబంధించిన ఎమెండ్‌మెంట్ కూడా త్వరలోనే జారీ అవుతుందని అన్నారు.
భారీగా సిబ్బంది
ఎమ్సెట్ నిర్వహణ పెద్ద ప్రహసనమని, దాదాపు 19,800 మంది ఇన్విజిలేటర్లు, 8560 మంది అబ్జర్వర్లు, 50 మంది స్పెషల్ అబ్జర్వర్లు పరీక్షల నిర్వహణకు వినియోగించామని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా ఎమ్సెట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేసినట్టు తేలడంతో 9 మంది ఫలితాలను నిలిపివేశామని, మరో ఇద్దరు బార్‌కోడ్‌లు మార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో వారి ఫలితాలను కూడా నిలిపివేశామని కన్వీనర్ రమణారావు చెప్పారు.
47 ప్రశ్నలపై 152 అభ్యంతరాలు
ఎమ్సెట్ పరీక్షలో మొత్తం 47 ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై 152 అభ్యంతరాలు వచ్చాయని కన్వీనర్ తెలిపారు. 11 మంది సబ్జెక్టు నిపుణులతో కూడిన కమిటీ గత నెల 11వ తేదీన కూర్చుని తొలి కీని రూపొందించిందని, తొలి కీని 12వ తేదీన విడుదల చేశామని, దానిపై అభ్యంతరాలను గత నెల 18వ తేదీ వరకూ స్వీకరించామని అన్నారు. ఇందులో గణితంలోని 14 ప్రశ్నలపై 48, ఇంజనీరింగ్ స్ట్రీంలోని ఫిజిక్స్ 4 ప్రశ్నలపై నాలుగు, కెమిస్ట్రీ 6 ప్రశ్నలపై 7, మెడిసిన్ స్ట్రీంలో బోటనీ 6 ప్రశ్నలపై 60, జువాలజీ రెండింటిపై రెండు, ఫిజిక్స్ ఏడింటిపై తొమ్మిది, కెమిస్ట్రీ 8 ప్రశ్నలపై 22 అభ్యంతరాలు వచ్చాయని అన్నారు.
25 శాతం వెయిటేజీ
ఇంటర్మీడియట్ మార్కులకు గతంలో మాదిరే 25 శాతం వెయిటేజీ ఈసారి కల్పించామని, ఎమ్సెట్ కు 75 శాతం వెయిటేజితో ర్యాంకులను ఖరారు చేశామని కన్వీనర్ తెలిపారు.
ఫలితాలు విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ ఆగస్టు 1 నుంచి తరగతులు యాజమాన్య కోటా ఆన్‌లైన్‌లోనే భర్తీ
english title:
m
Date:
Thursday, June 6, 2013