న్యూఢిల్లీ, జూన్ 5: రాష్ట్ర మంత్రివర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డిని తొలగించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. డిఎల్‌పై పడినట్లు మరి కొంతమందిపై వేటు పడే అవకాశాలున్నాయా? ఈ ప్రహసనం అగిపోయిందని భావించవచ్చా? అన్న ప్రశ్నలకు ఆయన జవాబు ఇవ్వలేదు. తనకు అత్యంత సన్నిహితుడైన దేవాదాయశాఖ మంత్రి సి. రామచంద్రయ్య పదవిని కాపాడేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేంద్ర మంత్రి హోదాలో చిరంజీవి పార్టీ అధ్యక్షురాలితో సమావేశమయ్యారని ఆయన నమ్మబలికారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసి రాష్ట్రంలో నెలకొని ఉన్న తాజా రాజకీయ పరిస్థితులను వివరించినట్లు బొత్స చెప్పారు. పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా సోనియాగాంధీని రాష్ట్రంలో పర్యటించవలసిందిగా కోరానని ఆయన చెప్పారు. తమ ఆహ్వానానికి ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలియజేశారు. హైదరాబాద్‌లోనే కాక రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో సోనియా, రాహుల్ గాంధీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తామని బొత్స ప్రకటించారు. పిసిసి కొత్త కార్యవర్గం ఏర్పాటు గురించి ఆయన కచ్చితమైన సమాథానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. ‘ఇప్పుడు కార్యవర్గం లేదా?’ అని ఎదురుప్రశ్న వేశారు. మీ టీమ్ ఎప్పుడు వస్తుందని అడిగినప్పుడు స్వల్ప మార్పులు, చేర్పులతో త్వరలో వెలువడుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయిన ఎంపీలు మందా జగన్నాధం, జి వివేక్‌లు సభ్యత్వానికి రాజీనామా చేయాలా? వద్దా? అన్న విషయమై ఆత్మపరిశీలన చేసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. అత్యంత సున్నితమైన తెలంగాణ అంశానికి అతి త్వరలోనే సామరస్యపూర్వక పరిష్కారం లభించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
సోనియాతో చిరు భేటీపై బొత్స వివరణ త్వరలో రాష్ట్రంలో సోనియా పర్యటన
english title:
r
Date:
Thursday, June 6, 2013