కడప, జూన్ 5: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని మాజీమంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. తానెపుడూ పార్టీకి విధేయుడేనని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తన తడాఖా చూపిస్తానని స్పష్టం చేశారు. మంత్రి పదవి నుండి డిస్మిస్ అయిన తరువాత తొలిసారిగా బుధవారం తన సొంత జిల్లా కడప వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మైదుకూరు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఆయనకు నియోజకవర్గంలోని వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు జిల్లా శివారులోని కర్నూలు జిల్లా చాగలమర్రికి తరలి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. వందలాది వాహనాల కాన్వాయిలో టాప్‌లేని జీపుపై డిఎల్ తన పర్యటనకు శ్రీకారం చుట్టారు. దువ్వూరు, కానగూడూరు, మైదుకూరు, ఖాజీపేట ప్రాంతాల్లో కార్యకర్తలు ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు. కిరణ్‌కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ ఆశయాలను కూడా తుంగలో తొక్కుతున్నారని డిఎల్ ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి చేపడుతున్న చర్యలు, సంక్షేమ పథకాలు అమల్లో ఆచరణ సాధ్యం కానివన్నారు. పదవుల కోసం తాను ప్రాకులాడడం లేదన్నారు. పని చేసే వారికి, ప్రతిభ కలిగిన వారికి పదవులు ఎప్పుడైనా వస్తాయని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కుట్ర కుతుంత్రాల వల్ల పార్టీకి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. తాను మొదటిసారిగా మంత్రి అయినప్పుడు కేవలం ఒక పర్యాయమే ఎమ్మెల్యేగా ఎన్నికైన సిఎం తన వద్దకు వచ్చి పనుల చేయించుకున్నారన్నారు. తన సేవలను మరచిపోయారన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పలుసార్లు మంత్రిగా పార్టీ కోసం అంకిత భావంతో పని చేస్తున్న తనకు మాటమాత్రమైనా చెప్పకుండా బర్త్ఫ్ చేయడం బాధ కలిగించిందన్నారు. కాంగ్రెస్‌కు చెందిన పెద్ద నాయకులెవరితో ఫోన్ చేయంచినా తృణప్రాయంగా మంత్రి పదవికి రాజీనామా చేసేవాడినన్నారు. బర్త్ఫ్ చేయడానికి తానేమైనా కళంకిత మంత్రినా అని నిలదీశారు. తొలగించిన తీరు తనను బాధించిందన్నారు. అయనా కాంగ్రెస్ పార్టీని విడనాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో సిఎం కుట్రలను, కుతంత్రాలను తిప్పి కొడతానని, అసెంబ్లీ సమావేశాల్లో తన తడాఖా చూపుతానని అన్నారు. సిద్ధాంతాలతో పనిచేసే ఏ ముఖ్యమంత్రికైనా తన ఇష్టప్రకారమే మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకునే అధికారం ఉంటుందని, కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం నియంతలా వ్యవహరిస్తూ తన అడుగులకు మడుగులొత్తే వారినే మంత్రివర్గంలో కొనసాగించాలని భావిస్తున్నారని ఆరోపించారు.
‘కాంగ్రెస్ కోసం మిత్రుడి కొడుకుపైనే పోటీచేశా’
ఖాజీపేట, జూన్ 5: కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు తన ప్రాణ స్నేహితుడు వైఎస్ కుమారుడిపై పోటీ చేయడానికి కూడా వెనుకాడలేదని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలోని తన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన తనకు మంచి బహుమానం దక్కిందన్నారు. ముఖానికి రంగులు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చే వారికే కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రాధాన్యత ఉందన్నారు.
పార్టీని నాశనం చేసేందుకు సిఎం కిరణ్ కంకణం కట్టుకున్నారన్నారు. తనలాంటి నిజాయితీపరుడికి ఇలాంటి దుస్థితి కలిగితే పార్టీ అట్టడుగుకు దిగజారుతుందన్నారు. తాను కళాంకిత మంత్రి కాదన్నారు. లంచగొండిని అసలు కాదని అన్నారు. కొంతమంది కుక్కలు తనపై అసత్య ప్రచారం చేస్తూ మెప్పుపొందేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. ఇక ముందు కార్యకర్తల అభీష్టం మేరకు కార్యచరణ రూపొందించి నడుచుకుంటానన్నారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనుగుణంగా సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కడప జిల్లాలోని ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, మరి కొంతమంది ముఖ్యమంత్రికి చెంచాగిరీ చేస్తున్నారన్నారు. గతాన్ని నెమరువేసుకుంటే వారి స్థాయి ఏమిటో వారికే అర్థమవుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం తన నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పర్యటించి కార్యకర్తల అభీష్టం మేరకు రాజకీయ భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తానన్నారు. కార్యకర్తలంతా పార్టీ కోసం పని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డిఎల్ పర్యటనలో దారి పొడవునా భారీ ఎత్తున జనం తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.
దువ్వూరులో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తున్న డి.ఎల్.రవీంద్రారెడ్డి
వైకాపాలోకి సినీ నటుడు నరేష్?
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జూన్ 5: అనంతపురం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సినీనటుడు నరేష్ త్వరలో వైకాపా తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం జైలులో ఉన్న జగన్‌తో ములాఖత్ అయినట్లు తెలిసింది. అనంతరం పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కూడా కలసి పార్టీలో చేరేందుకు హామీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో తాను ప్రాంతీయ పార్టీలో చేరనున్నట్లు నరేష్ బుధవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అయతే ఏ పార్టీలో చేరేదీ ఇప్పుడే స్పష్టం చేయలేనన్నారు. త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం వాస్తవమన్నారు.
రాజకీయాల్లోకి రాను
‘ప్రిన్స్’ మహేష్‌బాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూన్ 5: రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రసక్తేలేదని, అసలు మొదటి నుంచి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రిన్స్ మహేష్‌బాబు అన్నారు. రెయిన్‌బో తల్లీపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం విజయవాడ విచ్చేసిన మహేష్‌బాబు కొద్ది సేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మరో పదేళ్ల వరకు హిందీ చిత్రాల జోలికి వెళ్లబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘నేనొక్కడినే’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, తన కుమారుడు గౌతంకృష్ణతో నటింప చేయాలని సుకుమార్ ఆలోచిస్తున్నారని ఈ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
‘నేనొక్కడినే’ చిత్రం టైటిల్‌తో తనకు సంబంధంలేదని, కథను బట్టి అలా నిర్ణయించి ఉండవచ్చన్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో త్వరలో మరో చిత్రంలో షూటింగ్ ప్రారంభం కాబోతున్నదన్నారు. తాను నటించిన ఏ చిత్రం వల్ల కూడా యువత పెడదోవ పట్టలేదని మహేష్‌బాబు నవ్వుతూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుత యువ సినీ హీరోలందరూ తనకు పోటీయేనని అన్నారు. ఎయిడ్స్, పోలియో ఇతరత్రా ప్రమాదకర వ్యాధులు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో పుట్టే పిల్లలకు వైద్య సహాయం అందించేందుకు రెయిన్‌బో ఆసుపత్రి సహాయంలో ఓ ట్రస్ట్ నెలకొల్పే ఆలోచన ఉందని మహేష్‌బాబు వివరించారు.
శ్రీశైలం జలాశయానికి వరదనీరు
శ్రీశైలం, జూన్ 5: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చిచేరుతోంది. సుంకేసుల జలాశయం, తుంగభద్ర నది నుంచి రోజా గేజింగ్ పాయింట్ ద్వారా జలాశయానికి 8,088 క్యూసెక్యుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. జలాశయంలో బుధవారం 814 అడుగుల నీటిమట్టం ఉంది. 36.98 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో జలాశయానికి ఊహించినదాకికన్నా ఎక్కువగా నీరు వచ్చి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆశించిన మేరకు వరద నీరు జలాశయానికి చేరితే విద్యుత్ ఉత్పత్తి, రైతులకు సాగునీటి అవసరాలు తీరుతాయని అధికారులు అంటున్నారు.
చురుకుగా కదులుతున్న రుతుపవనాలు
ఉత్తర కోస్తాలో భారీ వర్షం.. కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 5: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాలు బుధవారం ఉత్తర కోస్తాకు కూడా విస్తరించాయి. తాడేపల్లిగూడెంలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెరువూరులో 3 సెంటీ మీటర్లు, రాజమండ్రి, విజయవాడల్లో 2 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. రుతుపవనాలు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో రుతుపవనాల వలన వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాష్ట్రంలో రుతుపవనాలు మరింత బలపడాలంటే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అరేబియా మహా సముద్రంలో అల్పపీడనం ఏర్పడడం వలన పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలావుండగా, ఛత్తీస్‌గడ్ నుంచి ఆంధ్రా మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడిన అల్పపీడన ద్రోణి యథాతథంగా కొనసాగుతోంది. దీని ప్రభావం వలన రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాఉం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో
ఆధిపత్య పోరు
షర్మిల యాత్రలో గ్రూపు రాజకీయాలు బట్టబయలు
ఆంధ్రభూమి బ్యూరో
రాజమండ్రి, జూన్ 5: మరో ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్ర ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారుతోంది. పార్టీలోని గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పాదయాత్రను విజయవంతం చేయటంలో తామే బాగా కష్టపడ్డామన్న అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలియచేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని గ్రూపుల నాయకులు బలప్రదర్శనకు దిగుతున్నారు. బలప్రదర్శనకు ఎవరికి వారు తమ సొంత ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో అసలు పార్టీ బలపడాలనే లక్ష్యం గాలికి కొట్టుకుపోతోంది. నాయకుల మధ్య ఏర్పడిన ఈ పోటీ మాత్రం కార్యక్రమానికి హాజరయ్యే బలహీనవర్గాల ప్రజలకు కలసివస్తోంది. పాదయాత్రకు జన సమీకరణకు రాజమండ్రి నగరంలోని వార్డుల్లోకి నాయకుల అనుచరులు వెళ్లి బలహీనవర్గాలకు చెందిన జనాన్ని ప్రసన్నం చేసుకునేందుకు చాలాతిప్పలు పడ్డారు. ఎక్కడికక్కడ అన్ని వార్డుల్లో జన సమీకరణకు నాయకులు తమ అనుచరులకు బాధ్యతలు అప్పగించటంతో, చోటా మోటా నాయకులు పోటీపడ్డారు. ఈ పోటీని గుర్తించిన జనం, కాస్త తెలివిగా నాయకుల మధ్య తమదైన శైలిలో పోటీపెట్టారు. తాము ఎక్కువ దూరం రాలేమని, ఏదో ఒక సెంటరు నుండి మరో సెంటరు వరకు మాత్రమే వస్తామని, అక్కడి వరకు తీసుకెళ్లి, తరువాత ఇంటికి చేరవేసే బాధ్యత కూడా మీదేనని, అయినా చెప్పిన మేర మొత్తం ఇచ్చేయాల్సిందేనని జనం చెప్పటంతో నాయకుల అనుచరులకు మతిపోయింది. పాదయాత్రకు ముందు జరిగిన సన్నాహక సమావేశాల్లో తాను 10వేల మందిని తీసుకొస్తామంటే, తాను 15వేల మందిని తీసుకొస్తానంటూ హామీలిచ్చిన నాయకులు ఎలాగైనా హామీని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో తమ అనుచరులను వార్డుల్లోకి పంపటంతో, మంగళ, బుధవారాల్లో రెండు రోజులూ బలహీనవర్గాలకు చెందిన మహిళలకు కాస్తంత ఉపాధి లభించింది. అయితే గ్రూపు రాజకీయాల తలనొప్పి భవిష్యత్తులో పార్టీకి ఎలా ఉంటుందో తెలియదుగానీ, ప్రస్తుతానికి మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో షర్మిల పాదయాత్ర విజయవంతంగా సాగేందుకు గ్రూపుల నాయకుల మధ్య నెలకొన్న పోటీ బాగా ఉపయోగపడుతోంది.
ఇక వచ్చేవన్నీ
సంకీర్ణ ప్రభుత్వాలే
తెరాస అధినేత కెసిఆర్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జూన్ 5: వచ్చే ఎన్నికల అనంతరం కేంద్ర-రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడుతాయని, జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితిని అవకాశంగా మలుచుకుని తెలం గాణ రాష్ట్ర సాధనకు టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. నల్లగొండ జిల్లా కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం బుధవారం ఆయన టిఆర్‌ఎస్ రాజకీయ శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ, జాతీయ పార్టీలతోనే తెలంగాణ వస్తుందన్న వాదనను తిప్పికొట్టారు. టిఆర్‌ఎస్ పుట్టకపోతే కాంగ్రెస్, బిజెపి, టిడిపి తెలంగాణ ఊసెత్తేవి కావన్నారు. జెఎంఎంతో జార్ఖండ్ రాష్ట్ర సాధన జరిగిందన్నారు. రాష్ట్రంలో సీమాంధ్రలో కాంగ్రెస్, టిడిపి, వైకాపాల మధ్య మూడుముక్కలాట సాగుతోందని, తెలంగాణలో సాధించే మెజార్టీ సీట్లతో టిఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అన్నారు. 100అసెంబ్లీ, 16ఎంపి స్థానాల్లో టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే సంకీర్ణ రాజకీయాల్లో తెలంగాణ లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆంధ్ర పక్షపాతిగానే వ్యవహరిస్తోం దని, తెలంగాణ ప్రజల పక్షాన ఏనాడు లేదన్నారు. సోనియా గాంధీ చేతిలో ప్రధానమంత్రి మన్మోహన్ కీలుబొమ్మలా మారారని కెసిఆర్ విమర్శించారు.
తెలంగాణ సాధన కోసం ఈ నెల 14న జెఎసి నిర్వహించే చలో అసెంబ్లీకి లక్షలాదిగా తెలంగాణ వాదులు తరలివచ్చి ఉద్యమసత్తా చాటాలని, మధ్యలో అడ్డుకుంటే ప్రతి పోలీస్ స్టేషన్‌ను అసెంబ్లీగా మార్చి మాక్ అసెంబ్లీ నిర్వహించాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని, సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు మోసాలతో నీళ్లను, నిధులను, ఉద్యోగాలను దోచుకెళ్లిన సంగతిని ప్రజల్లో చర్చకు పెట్టి తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ప్రతి కార్యకర్త కథానాయకుడు కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే జురాల-పాకల ప్రాజెక్టును చేపట్టి నల్లగొండకు సాగు, తాగునీరు అందిస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పింఛన్లు అందజేస్తామని, బలహీన వర్గాలకు 120 గజాల స్థలంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని, లక్ష రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని కెసిఆర్ హామీలు గుప్పించారు.