కర్నూలు, జూన్ 7: ‘పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు, ఇపుడు మీ వంతు వచ్చింది, స్థానిక ఎన్నికల్లో విజయమే కీలకం, అంతా కలిసికట్టుగా పని చేస్తే విజయం తథ్యం’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లా పార్టీ నేతలకు హితబోధ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన కర్నూలు, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించిన చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా పరిస్థితి దారుణంగా ఉందని తన సర్వేలో తేలిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వైకాపా బలాన్ని ఆయన నాయకులకు వివరించినట్లు సమాచారం. ఆ పార్టీ నేతల చేతుల్లో ఉన్న మీడియా, పార్టీ నాయకుల హడావుడి తప్పిస్తే వాస్తవంలో ఏమీ లేదని బాబు వివరించినట్లు పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో గత తొమ్మిదేళ్ల కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని వెల్లడించినట్లు తెలిపారు. వైకాపా బలహీనపడటం, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా చేసుకుంటూ ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ నేతలు కలిసికట్టుగా పని చేస్తే స్థానిక ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసినట్లు నాయకులు పేర్కొంటున్నారు. ఏ నియోజకవర్గంలోనూ నాయకుల మధ్య స్పర్థలు లేకుండా చర్చించుకుని పరిష్కరించుకోవాలని అవసరమైతే జిల్లాలోని సీనియర్ నేతల సహకారం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తన పాదయాత్ర ద్వారా జగన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు, ఆయన ప్రజల సొమ్మును దోచుకున్న తీరును, అధికార పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వారి నుంచి సానుకూలమైన అభిప్రాయం వచ్చిందని వెల్లడించారు. రానున్న కొద్ది రోజుల్లోనే పాదయాత్ర చేయని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడుతానని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే వరకూ విశ్రమించబోనని బాబు పేర్కొన్నట్లు సమాచారం. తనకు జిల్లా, నియోజకవర్గ నేతలు సహకరిస్తే అధికారంలోకి సులభంగా వస్తామని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఒకటి, రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిల నియామకంలో కొంత ఆలస్యమవుతుందని అంత వరకూ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తగిన చర్యలు తీసుకుని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి గ్రామ స్థాయి నాయకులతో కూడా మాట్లాడాలని పొలిట్ బ్యూరో సభ్యుడు కెఇ కృష్ణమూర్తిని కోరినట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు సమీక్షా సమావేశంలో పేర్కొన్న లెక్కలు, వెల్లడించిన సర్వే వివరాలతో రానున్న ఎన్నికల్లో తమదే అధికారమన్న ధీమా మరింత పెరిగిందని, కార్యకర్తలతో కలిసి మరింత కష్టపడి స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని జిల్లా నాయకులు బాబుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఎసిబి వలలో విఆర్వో
* రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
బేతంచెర్ల, జూన్ 7: మండలంలో మరో అవినీతి చేప శుక్రవారం ఎసిబి వలకు చిక్కింది. ఎసిబి డీఎస్పీ విజయపాల్ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన రైతు పసుపుల వెంకటేశ్వర్లు తనకు వారసత్వంగా సంక్రమించిన సర్వే నెంబర్ 1061కి సంబంధించిన పొలానికి పట్టాదారు పాసు పుస్తకాల కోసం ధరఖాస్తుచేసుకున్నాడు. ఈ విషయమై తహశీల్దార్ విఆర్వో రహంతుల్లాకు విచారణ నిమిత్తం బాధ్యతలు అప్పగించారు. దీంతో రహంతుల్లా రైతు వెంకటేశ్వర్లు పేరు మీద 2 ఎకరాలకు, అతడి భార్య అంజనమ్మ పేరుమీద 4 ఎకరాలు చేసి పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా వెంకటేశ్వర్లు రూ. 5 వేల ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆ డబ్బును బేతంచెర్లలోని తన ప్రైవేట్ కార్యాలయం వద్ద ఇవ్వాలని విఆర్వో రైతుకు సూచించాడు. ఆ మేరకు రైతు అక్కడికి వచ్చి విఆర్వోకు సమాచారం ఇవ్వగా, తాను రంగాపురంలో ఉన్నానని చెప్పాడు. దీంతో రైతు రంగాపురం చేరుకుని పెట్రోలు బంకు వద్ద ఉన్న టీ కొట్టు వద్ద విఆర్వోకు రూ. 5 వేల నగదు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకుని, ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే రైతుకు సంబంధించిన పొలం పత్రాలను బేతంచెర్లలోని విఆర్వో ప్రైవేట్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు రహంతుల్లా స్వగ్రామం డోన్‌లో ఇంటిని సోదా చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడుల్లో సిఐ నాగరాజుయాదవ్, ఎస్‌ఐలు కృష్ణారెడ్డి, ప్రసాద్‌రావు, సుబ్బారెడ్డి, సిబ్బంది శ్రీనివాసులు పాల్గొన్నారు.