ఆదోని,జూన్ 7: హైకోర్టు డివిజన్ బెంచ్ ఉరుకుంద ఈరన్నస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా మనోరమ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ సభ్యులే కొనసాగాలని హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం తీర్పు ఇవ్వడంతో ఉరుకుంద ఈరన్న దేవస్థానం పాలక మండలి పై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు తీర్పుతో మంత్రి టిజి వెంకటేష్ వర్గీయులపై కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి వర్గీయులదే పై చెయ్యిగా నిలిచింది. ఆదోని డివిజన్‌లో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న దేవస్థానం పాలక మండలి సభ్యుల ఎన్నిక కోసం మంత్రి టిజి వెంకటేష్, కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి తమ వర్గీయులకు పాలక మండలి పగ్గాలను ఇప్పించేందుకు తీవ్రంగా కృషి చేశారు. చివరికి ఈ అంశం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి కూడా వెళ్ళింది. టిజి వెంకటేష్ తన సోదరుడైన టిజి పాండురంగయ్యకు దేవస్థానం అధ్యక్ష పీఠం దక్కాలని తీవ్ర ప్రయత్నంచేశారు. టిజి వెంకటేష్ పాలక మండలి జాబితాను తయారు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళారు. కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, మనోరమను అధ్యక్షురాలుగా చేసి తన వర్గీయులకే దేవాస్థానం సభ్యులుగా నియమించాలని ఆయన సైతం తన వర్గీయుల జాబితాను పంపారు. ఇటు టిజి వెంకటేష్, అటు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి తన వర్గీయులకే ఉరుకుం ద ఈరన్న దేవస్థానం పాలక మండలిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగించారు. 2013 జనవరిలో కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి పంపిన వర్గీయుల జాబితానే ముఖ్యమంత్రి ఖరారుచేసి ఉరుకుంద ఈరన్న దేవస్థానం పాలక మండలి సభ్యులుగా మనోరమ, బసప్ప, తిక్కయ్య, తిమ్మయ్య, హంపమ్మ, మురళీకృష్ణంరాజు, ఈరన్నలను నియమిస్తూ ఉత్తర్వులు జారి చేయడం జరిగింది. అయితే కోట్ల వర్గీయులైన మనోరమ, ఇతర సభ్యులు నియామకంపై అభ్యతరాలు వ్యక్తం చేస్తూ టిజి వెంకటేష్ వర్గీయులైన రాఘవేంద్రశెట్టి, గురునాథ్‌రెడ్డిలు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని వచ్చారు. టిజి వెంకటేష్ వర్గీయులు తెచ్చిన స్టేను కోట్ల వర్గీయులు మనోరమ, ఆమె కుమారుడు శివమోహన్‌రెడ్డిలు హైకోర్టుకు వెళ్ళి స్టేను తొలగింపుచేస్తూ ఉత్తర్వులు తీసుకొని వచ్చారు. స్టే తొలగించడంతో జనవరి 7వ తేదీ మనోరమ అధ్యక్షురాలుగా ఇతరులు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికి టిజి వెంకటేష్ వర్గీయులు రాఘవేంద్రశెట్టి, గురునాథ్‌రెడ్డిలు, మనోరమ ఇతర సభ్యులు అనర్హులుగా ప్రకటించాలని పాలక మండలిని రద్దుచేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్‌లో కేసు వేశారు. ఈ కేసు 6 నెలల పాటు విచారణ సాగింది. అయితే శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రస్థుత పాలక మండలి కొనసాగాలని తీర్పు ఇచ్చినట్లు అధ్యక్షురాలు మనోరమ కుమారుడు శివమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు కోట్ల వర్గానికి అనుకూలంగా రావడంతో కోట్ల వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీజి వర్గానికి కోర్టులో చుక్కెదురు అయింది. దీంతో ఉరుకుంద ఈరన్న దేవస్థానం పాలక మండలి నియామకంలో కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి తన పట్టును నిలుపు కున్నారు.
* హైకోర్టు ఉత్తర్వులు.. * ఉత్కంఠకు తెర
english title:
body
Date:
Saturday, June 8, 2013