వరంగల్, జూన్ 13: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో.. తెలంగాణ ఉద్యమ ఖిల్లా వరంగల్ పోలీసుల చక్రబంధంలో చిక్కింది.. రాజధానికి వెళ్లే తెలంగాణవాదులను అడుగడుగునా పోలీసులు నిలిపివేయడంతోపాటు.. మరోవైపు ముందస్తుగా చేసిన వేలాది అరెస్టులు, బైండోవర్లతో జిల్లానుంచి తెలంగాణవాదులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా ఇవేవీ లెక్కచేయకుండా పోలీసుల కన్నుగప్పి వందలాదిమంది తెలంగాణవాదులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. శుక్రవారం అసెంబ్లీని ముట్టడించేందుకు తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపుమేరకు జిల్లానుండి స్పందన పెద్దఎత్తున వచ్చింది. తెలంగాణ రాష్టస్రమితి, భారతీయ జనతాపార్టీ, సిపిఐ, న్యూడెమొక్రసీ కార్యకర్తలతోపాటు విద్యార్థి జెఎసి ప్రతినిధులు రాజధాని బాట పట్టేందుకు సిద్ధంకాగా..జిల్లావ్యాప్తంగా 40చెక్‌పోస్టులను ఏర్పాటుచేసిన పోలీసులు మూడు రోజులుగా వారిని అడ్డుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో కార్యక్రమం ఉండగా..గురువారం తెల్లవారుజాము నుండే తెలంగాణవాదులు హైదరాబాద్‌కు వివిధ మార్గాల ద్వారా తరలి సాయంత్రానికి చేరుకున్నారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో జిల్లా పోలీసులు జిల్లాలోని అన్ని రైల్వేస్టేషన్లలో నిఘా ముమ్మరం చేశారు. డిఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలను దింపి రైళ్లలో తెలంగాణవాదులు హైదరాబాద్ వెళ్లకుండా చూస్తున్నారు. ఆయా రైల్వేస్టేషన్లకు వచ్చే ప్రయాణికులతోపాటు రైళ్లలోను తనిఖీలు జరిపి అనుమానితులను కిందకు దింపేస్తున్నారు. రైల్వేస్టేషన్లు పోలీసులతో కిక్కిరిసిపోయాయి. చలో అసెంబ్లీ నేపథ్యంలో తెలంగాణవాదులు హైదరాబాద్‌కు తరలివెళ్తున్నారనే అనుమానంతో శుక్రవారం ఉదయం వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్యాసింజర్ రైలును రైల్వే అధికారులు రద్దుచేశారు. పోలీసుల హెచ్చరికల మేరకు అవసరమైతే మరికొన్ని ప్యాసింజర్ రైళ్లను కూడా చివరి నిమిషంలో రద్దుచేయవచ్చని తెలుస్తోంది. రైల్వేమార్గంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బస్‌లలో వెళ్లేందుకు కొందరు యత్నించగా.. అక్కడ కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌తోపాటు వివిధ ప్రాంతాల్లోని బస్‌స్టేషన్లలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా యువకులెవరూ హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. శుక్రవారం పరిమిత సంఖ్యలో పోలీసుల పర్యవేక్షణలో బస్సులను నడపాలని ఆర్టీసి అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. జిల్లాలోని మహబూబాబాద్, నర్సంపేట, జనగామ, పరకాల తదితర రూట్లలోనూ పోలీసులు తనిఖీలు జరిపారు. కాగా బైండోవర్లు, అరెస్టులతో జిల్లా దద్దరిల్లిపోయింది. జిల్లావ్యాప్తంగా దాదాపు రెండువేల మంది తెలంగాణణవాదులను పోలీసులు రెవిన్యూ అధికారుల వద్ద బైండోవర్ చేశారు. వరంగల్ ఆర్డీవో కార్యాలయం తెలంగాణవాదుల బైండోవర్‌తో కిటకిటలాడింది. ఇళ్లల్లో, పార్టీ కార్యాలయాల్లో.. హైదరాబాద్‌కు వెళ్లె మార్గంలో తెలంగాణ అనుకూలపార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్డీవో ఎదుట బైండోవర్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా.. తెలంగాణ నినాదాలతో ఆర్డీఒ కార్యాలయం ప్రతిధ్వనించింది. ఒక దశలో ఆగ్రహించిన తెలంగాణవాదులు ఆర్డీవో కార్యాలయానికి తాళాలు వేసేందుకు యత్నించగా.. అధికారులతోపాటు పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చచెప్పి ఆ చర్యను విరమింపచేశారు. మరోవైపు బిజెపి కార్యాలయంలో నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటుచేసిన సమయంలోనే పోలీసులు అక్కడకు చేరుకుని నాయకులను బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల చర్యతో బైఠాయించిన బిజెపి నాయకులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చివరకు పోలీసులు వారిని బయటకు వెళ్లేందుకు అనుమతించారు. కాగా చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ బయలుదేరిన మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని జనగామ వద్ద జిల్లా సరిహద్దులో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు. ఇదిలా ఉంటే, పోలీసుల కన్నుగప్పి అనేకమంది తెలంగాణవాదులు వివిధ మార్గాల్లో రాష్ట్ర రాజధానికి చేరుకున్నట్లు సమాచారం. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఎలాగైనా హాజరు కావాలనే లక్ష్యంతో ముందుగానే.. పోలీసులకు చిక్కకుండా హైదరాబాద్ వెళ్లారని తెలిసింది. మరోపక్క చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌లో ప్రత్యేక బందోబస్తు కోసం జిల్లా నుంచి ఎంపిక చేసిన కొంతమంది సిఐలు, ఎస్సైలు, పోలీసు బృందాలను అధికారులు హైదరాబాద్‌కు పంపించారు. జిల్లా నుంచి వచ్చిన నాయకులను, తెలంగాణవాదులను గుర్తించి ఎక్కడికక్కడే నిలిపివేసే బాధ్యతలను వీరికి అప్పగించారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీని ముట్టడిస్తాం
* బిజెపి రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ మార్తినేని
హన్మకొండ, జూన్ 13: సీమాంధ్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీని ముట్టడించి తీరుతామని బిజెపి రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ మార్తినేని ధర్మారావు హెచ్చరించారు. గురువారం నగరంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ జెఎసి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత పద్ధతిలో నిర్వహించ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగమేనని విమర్శించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని జెఎసి, బిజెపి, టిఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, సిపిఐ తదితర పార్టీల ప్రతినిధులు కోరినప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతి ఇవ్వకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును సిఎం కాలరాస్తున్నాడని ఆరోపించారు. సిఎం అదేశాలతో డిజిపి దినేష్‌రెడ్డి పోలీసులతో తెలంగాణ ప్రాంతంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మూడురోజుల ముందునుండే తెలంగాణలో నిర్భంధం కొనసాగుతున్నదని అన్నారు. తెలంగాణ ప్రాంత పల్లెలు, పట్టణాలను పోలీసుల గుప్పిట్లోకి తెచ్చుకుని దిగ్భంధనం చేశారని అన్నారు. ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, తెలంగాణవాదులను ఎక్కడికక్కడే అరెస్టుచేసి నిర్భందిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతున్నదని, రజాకార్ల పరిపాలనలో కూడా ఇంత నిర్బంధాన్ని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌వైపు వెళ్లే రహదారులు, బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పోలీసులు మకాంవేసి తెలంగాణవాదులను అరెస్టు చేస్తున్నారని అన్నారు. అరెస్టులు, బైండోవర్ల పేరుతో వరంగల్ జిల్లాలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం
సిఎం కిరణ్ కాంగ్రెస్‌కు మరణశాసనం రాస్తున్నాడు * టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం
జనగామ, జూన్ 13: తెలంగాణ ప్రజల ఆకాంక్షపై, ఉద్యమంపై ఉక్కుపాదాన్ని మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలోనే బొందపెట్టడానికి సిద్ధమవుతున్నారని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఒకరోజు ముందే జిల్లా నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆయనను గురువారం జనగామలోని ఏకశిల బిఇడి కళాశాల వద్ద జనగామ ఎఎస్పీ జోయల్ డేవీస్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కడియం వ్యక్తిగత పూచీ తీసుకొని తిరిగి వరంగల్‌కు పంపించారు. ఈ సందర్భంగా కడియం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమంపై అప్రకటిత నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి మరణశాసనం రాస్తున్నాడని, కాంగ్రెస్‌కు ఆయనే చివరి ముఖ్యమంత్రి కాబోతున్నాడని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని, దాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉప్పెనలా లేస్తుందని, దీన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. శాంతియుతంగా నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని హింసాత్మకంగా మార్చేందుకు సీమాంధ్ర పాలకులు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాంత మంత్రులు సీమాంధ్ర పాలకుల వద్ద శవాల్లా పడి ఉండి తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతులు తెచ్చే దమ్ము, ధైర్యం లేని తెలంగాణ మంత్రులు ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. వారికి సిగ్గు, శరం ఉంటే వెంటనే రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, లేనట్లైతే వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తెలంగాణలోని మంత్రులే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి తెలంగాణవాదులు చలో అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో తెలంగాణ మంత్రులను గ్రామాల్లోకి రానివ్వవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండ యాదగిరి రెడ్డి, పసుల ఏబేలు, రాంరెడ్డి, మేకల కళింగరాజు తదితరులు పాల్గొన్నారు.
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
‘నిర్భయ’ చట్టం అమలుకు స్థానికుల డిమాండ్
రాయపర్తి, జూన్ 13: కామంతో కళ్లు మూసుకుపోయి మానసిక వికలాంగురాలిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన మండలంలోని మొరిపిరాల గ్రామంలో జరిగింది. ఎస్సై, బంధువుల కథనం ప్రకారం.. మొరిపిరాలకు చెందిన మానసిక వికలాంగురాలిపై (25) అదే గ్రామానికి చెందిన కాగితోజు రాములు (45) అనే వ్యక్తి ఈనెల 11వ తేదీన అత్యాచారం జరిపాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి మానసిక వికలాంగురాలు బలైపోయింది. ప్రస్తుతం మానసిక వికలాంగురాలి పరిస్థితి దయనీయంగా మారింది. మానసిక వికలాంగురాలి తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. వర్ధన్నపేటలో అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశానికి వెళ్లిన క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో తండ్రి ట్రాక్టర్ నడిపేందుకు వెళ్లాడు. అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశానికి వెళ్లివచ్చిన తల్లి కూతురికి స్నానం చేయిస్తుండగా ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో ఇదేమిటని ప్రశ్నించింది. దీంతో జరిగిన విషయాన్ని వికలాంగురాలు తల్లికి సైగలతో విషయాన్ని వివరించింది. దీంతో ఆమె భర్తతో కలసి గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అభం.. శుభం తెలియని మానసిక వికలాంగురాలిని అత్యాచారం చేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భయ చట్టం కింద అత్యాచారం జరిపిన రాములుపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మామునూరు డిఎస్పీ సురేష్‌కుమార్, వర్ధన్నపేట సిఐ మల్లయ్య సంఘటన ప్రదేశానికి చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వాయిదా తీర్మానంపై కడియం విమర్శలు అర్థరహితం
టిడిపి జిల్లా అధ్యక్షుడు బస్వారెడ్డి
హన్మకొండ, జూన్ 13: శాసనసభ సమావేశాలలో తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం పెట్టలేదని మాజీమంత్రి కడియం శ్రీహరి చేస్తున్న విమర్శలు అర్థరహితమని టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి అన్నారు. గురువారం నగరంలోని టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన వైఖరి కలిగిన టిడిపిపై కడియం శ్రీహరి పదేపదే ఆరోపణలు చేయడం మానుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వాయిదా తీర్మానం పెట్టామని, తెలంగాణపై స్పష్టతతో ముందుకు సాగుతున్న టిడిపి వాయిదా తీర్మానం పెట్టకుంటే దానిని రాద్ధాంతం చేయడం కడియంకు తగదని అన్నారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ పార్టీని వదిలేసి స్పష్టత కలిగిన టిడిపిపై విమర్శలు చేయడం మానుకోవాలని చెప్పారు. అంతేకాకుండా టిడిపిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలే ఉన్నట్లు చీటికిమాటికి వారిపై కడియం నోరు పారేసుకుంటున్నారని, ఇంకోసారి విమర్శలు చేస్తే ప్రతి విమర్శ తప్పదని హెచ్చరించారు. ఉద్యమంలో పాల్గొనకుంటే పాల్గొనడం లేదని, పాల్గొంటామంటే స్వాగతించని టిఆర్‌ఎస్ పార్టీకి ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని అన్నారు. జెఎసి చైర్మన్ కోదండరాం టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు సూచనల మేరకే టిడిపిని ఉద్యమంలోకి రానివ్వడం లేదని విమర్శించారు. తెలంగాణకోసం తాము కూడా చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటామని అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లే టిడిపి నాయకులు, కార్యకర్తలను అరెస్టుచేస్తే నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు. అరెస్టులతో చలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు ఆపలేరని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, టిడిపి వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ దొమ్మాటి సాంబయ్య, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.