Clik here to view.

మనిషి అన్నిరంగాల్లోనూ దూసుకెళుతున్నప్పటికీ పెరిగిపోతున్న నేరాలను అరికట్టడంలో మాత్రం ఎప్పటి కప్పుడు విఫలమవుతూనే వున్నాడు. రాత్రీపగలూ తేడా లేకుండా, వయసు తారతమ్యాలను సైతం చూడకుండా, ఆడామగా విచక్షణలేకుండా అఘాయిత్యాలకు బలి అవుతూనే వున్నారు. నేరాల విషయంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేయవలసిన అత్యవసర సమయం ఆసన్నమైందనే అభిప్రాయంతో నటుడు, నిర్మాత కె.నాగబాబు వ్యాఖ్యాతగా ‘పోలీస్‌డైరీ’ అనే కార్యక్రమాన్ని జీ-తెలుగు వీక్షకుల ముందుకు తీసుకువచ్చింది. నేటి నుంచి (జూన్ 16) ఆదివారం రాత్రి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో రా.9.30గం.లకు ప్రసారం కానున్నది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ- ‘‘జీ తెలుగు ఆధ్వర్యంలో రూపొందిన ఈ కార్యక్రమం ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. సమాజంలో జరుగుతున్న నేరాల గురించి చర్చిస్తూనే, అమూల్యమైన సలహాలు సూచనలు కూడా పంపొచ్చు. ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసే ప్రయత్నంలో భాగంగా ‘పోలీస్‌డైరీ’ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్న జీతెలుగు, పలు కళాశాలల్లో చర్చా కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేయనుంది’’అని పేర్కొన్నారు.