Clik here to view.

ప్రముఖ నటుడు, దర్శకుడు మణివన్నన్ (59) కన్నుమూశారు. శనివారం చెన్నయ్‌లోని తన స్వగృహంలో గుండెపోటుకు గురైన ఆయన తుది శ్వాసవిడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. జూలై 31, 1954న జన్మించిన ఆయన తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో పలు చిత్రాల్లో ఆయన హాస్య నటుడుగా నటించారు. ప్రేమలేఖ, ఒకే ఒక్కడు, శివాజీ, రిథమ్, నరసింహా, భామనే సత్య భామనే తదితర చిత్రాల్లో ఆయన నటనను మరిచిపోలేం. ఓ పక్క తన నటనతో కడుపుబ్బ నవ్విస్తూనే మరో పక్క తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించేవారు. మణివన్నన్ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సత్యరాజ్ హీరోగా ‘నాగరాజ చోళన్ ఎం.ఎల్.ఏ’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా మధ్యలోనే వుండగానే ఆయన మృతి చెందడం ఆ చిత్రానికి తీరనిలోటే.