సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 24: పౌష్టికాహారంకు బదులు నాసిరకం ఆహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తూ కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. సిద్దిపేట మండలం ఎన్సాన్‌పల్లిలోని ఒకటవ నెంబర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలు లేక టీచర్ ఒకరే ఉండడంతో పిల్లలు ఎందుకు లేరని టీచర్ నాగరాణిని ఎమ్మెల్యే ప్రశ్నించగా పెద్దమ్మ జాతర ఉండడంతో వెళ్లిపోయారని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా రిజిష్టర్లను తనిఖీ చేసి పప్పు, బియ్యం, రవ్వను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే విలేఖరులతో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న ఫలితం లేకుండా పొయిందని, అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు 800క్వింటాళ్ల పెసర పప్పును 70రూపాయలకు కిలో చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కేంద్రాలకు మాత్రం నాసిరకమైన 35రూపాయలకు కిలో చొప్పున లభ్యమయ్యే పిల్లి పెసరపప్పును సరఫరా చేస్తూ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పిల్లలు, గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహరాన్ని అందించాలనే సదుద్దేశ్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నా నాణ్యత లేని ఆహార ధాన్యాలు సరఫరా చేస్తుండడంతో పౌష్టికాహారం దేవుడెరుగు ఈ ఆహారంతో ఆనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని విమర్శించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారం పూర్తిగా నాణ్యత లొపించిందని ఆరోపించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అంగన్‌వాడీ కేంద్రాలకు టెండర్ల ద్వారా పౌష్టికాహరాన్ని సరఫరా చేయకుండా నామినేషన్ ప్రక్రియ ద్వారా గృహమిత్రకు అందజేయడంతో నాసిరకం ఆహరంతో పాటు తక్కువ ధర ఆహారాన్ని సరఫరా చేస్తుండడమే కాకుండా ధాన్యం బరువులో ఐదు కిలోల వరకు తగ్గిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంటనే అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహరంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, మాజీ జెడ్పీటిసి తిరుపతి, మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో
నాణ్యతను పాటించాలి
మెదక్ టౌన్, ఫిబ్రవరి 24: కోర్టు భవనాల నిర్మాణ సముదాయం పనులు పూర్తి నాణ్యతతో ఉండే విధంగా అధికారులు పర్యవేక్షించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్‌రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు మెదక్ కోర్టు ప్రాంగణంలో 4కోట్ల 55 లక్షలతో సాగుతున్న నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. భవనాల నిర్మాణంలో జరిగే చిన్నచిన్న తప్పుల వల్ల భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలం మన్నికతో ఉండాల్సిన భవనాలు అతితొందరలోనే శిథిలావస్థకు చేరుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులలో నాణ్యత ఉండే దిశగా కాంట్రాక్టర్‌తో పాటు అధికారులు కూడా ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని సూచించారు. పక్కా ప్రణాళికతో, నైపుణ్యత కలిగిన కార్మికులను నిర్మాణం పనులలో వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి భవనానికి సంబంధించిన ప్లాన్‌ను పరిశీలించారు. కోర్టు హాలు, న్యాయమూర్తులు, న్యాయవాదుల విశ్రాంతి గదులు, సమావేశ మందిరం తదితర విషయాలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. తాను తరచుగా నిర్మాణం పనులను పరిశీలిస్తానని, పనులలో అలసత్వం ప్రదర్శించవద్దని రోడ్డు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్‌ను సుభాష్‌రెడ్డి హెచ్చరించారు. సుభాష్‌రెడ్డితో పాటు న్యాయమూర్తులు గోవర్ధన్‌రెడ్డి, మాసయ్య, ఆర్డీవో వనజాదేవి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాయ వెంకటేశం, సీనియర్ న్యాయవాదులు హర్కార్ జగదీశ్వర్, కొప్పుల పోచయ్య తదితరులు పాల్గొన్నారు.